మా కన్నీళ్లు కనిపించడం లేదా? సీఎం, డీసీఎంపై మెడికో ప్రియాంక తండ్రి అసంతృప్తి
ఏడ్చిఏడ్చి తన కళ్లల్లో నీళ్లు ఇంకిపోయాయని, తన బిడ్డకు అన్యాయం జరిగితే ప్రభుత్వం నుంచి సరైన భరోసా లభించలేదని ఆయన బాధపడిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.
By: Tupaki Political Desk | 9 Aug 2026 2:51 PM ISTరాజమహేంద్రవరం ఘటనలో బ్రెయిన్ డెడ్ కు గురైన మెడికో ప్రియాంక తండ్రి మీడియా ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు కలచివేస్తున్నాయి. తన బిడ్డ మృత్యువుతో పోరాడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత పరామర్శించలేదంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏడ్చిఏడ్చి తన కళ్లల్లో నీళ్లు ఇంకిపోయాయని, తన బిడ్డకు అన్యాయం జరిగితే ప్రభుత్వం నుంచి సరైన భరోసా లభించలేదని ఆయన బాధపడిన తీరు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.
ఈ నెల 3న రాజమహేంద్రవరం నగరంలోని ప్రసాద్ ఆదిత్యామాల్ గేటు ముందు ద్విచక్రవాహనంపై వెళుతున్న ప్రియాంకను ఇద్దరు నిందుతులు ఉద్దేశపూర్వకంగా వెనుక నుంచి కారుతో ఢీకొట్టడమే కాకుండా, కింద పడిపోయిన ఆమె తలపై నుంచి కారును వేగంగా నడిపి తీవ్ర గాయాలకు గురిచేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే ఈ విషయంలో నిందితులకు బహిరంగంగా ఉరి వేయాలని బాధితురాలు తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా కేసును సీరియస్ గా తీసుకుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఘటనను హిట్ అండ్ రన్ కేసుగా పరిగణించడం లేదని, హత్యాయత్నంగానే భావిస్తున్నామని ఎస్పీ నరసింహ కిశోర్ ప్రకటన చేశారని చెబుతున్నారు.
అయితే కేసు విషయంలో ప్రభుత్వ తీరుపై బాధితురాలు ప్రియాంక తండ్రి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. 30 ఏళ్లపాటు తాము కష్టపడి బిడ్డను చదివించామని డాక్టరుగా స్థిరపడే సమయంలో ఇలాంటి ఘటన జరగడాన్ని వారు తేలిగ్గా తీసుకోలేకపోతున్నారు. తమకు న్యాయం జరగలేదనే బాధతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తోపాటు మంత్రులు లోకేశ్, అనిత పేర్లు ప్రస్తావిస్తూ బాధితురాలు తండ్రి సంధించి ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.
"చంద్రబాబు గారు.. వారం వారం హైదరాబాద్ వచ్చే మీరు ఒకసారి కూడా వచ్చి పరామర్శించలేదు.. పవన్ కల్యాణ్ గారు.. మీకు మంచి పేరు ఉంది. ఇలాంటివి జరిగితే మీరు తట్టుకోలేరు.. లోకేష్ గారు.. మీరు ప్రజా సమస్యలు పట్టించుకుంటారు.. నా కూతుర్ని కారుతో గుద్ది చంపేస్తే ఎవరూ స్పందించకపోవడం నేను తట్టుకోలేకపోతున్నా." అంటూ ఆయన కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక హోంమంత్రి అనిత సాటి మహిళకు జరిగిన అన్యాయంపై ఇంతవరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
