ప్రమాదమా? ఉద్దేశపూర్వక దాడా? రాజమండ్రి ప్రియాంక ఘటనలో వెలుగులోకి సంచలన నిజాలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంక తీవ్రంగా గాయపడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
By: A.N.Kumar | 8 Aug 2026 12:04 PM ISTతూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంక తీవ్రంగా గాయపడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. ఆదిత్యమాల్ వద్ద ఆ ఇద్దరు యువకులు తాగి ఉన్నారని ఆపారు. అప్పుడు మేం తాగలేదని దబాయిస్తే ‘బ్రీత్ అనలైజర్ తో చెక్ చేస్తే 100కు పైగా పాయింట్లు చూపించింది. దీంతో తాగి వస్తే లోపలికి ప్రవేశం లేదంటూ ఆదిత్యమాల్ మేనేజర్ ఆపారు. దీంతో రెచ్చిపోయిన యువకుడు మేనేజర్ ముఖంపై ఫోన్ తో కొట్టాడు. దీంతో మాల్ లోని పనివారు ఈ ఇద్దరు యువకులను పట్టుకోవడానికి రాగా కారులో పారిపోయారు. పారిపోతే మెడికో విద్యార్థినిని కారుతో ఢీకొట్టారు. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాలు ఈ ఘటనపై మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఇది కేవలం రోడ్డు ప్రమాదమా? లేక ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టారా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఈ ఘటన ఆగస్టు 3వ తేదీ రాత్రి రాజమండ్రి లోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న ప్రసాద్ ఆదిత్య మాల్ వద్ద చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీలో డెర్మటాలజీ మొదటి సంవత్సరం చదువుతున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రియాంక.. రేడియాలజీ మొదటి సంవత్సరం విద్యార్థి మల్లి వెంకట దుర్గాసాయి ఉమేశ్‌తో కలిసి మాల్‌లో సినిమా చూసి స్కూటీపై బయటకు వస్తున్నారు.
అదే సమయంలో రాజమండ్రి రూరల్ మండలం నామవరానికి చెందిన సూరారపు ధస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ కారులో సెకండ్ షో సినిమా చూసేందుకు మాల్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. వారు మద్యం మత్తులో ఉన్నారని అనుమానించిన మాల్ సిబ్బంది వారిని బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించినట్లు సమాచారం. మద్యం సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిని థియేటర్‌లోకి అనుమతించలేదని చెబుతున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో యువకులు వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.
సీసీటీవీలో కీలక దృశ్యాలు
యువకులు మాల్ నుంచి కారులో బయటకు వస్తున్న సమయంలోనే ప్రియాంక, ఉమేశ్ స్కూటీపై గేటు దాటుతున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తున్నట్లు సమాచారం. మొదట కారు స్కూటీని ఢీకొట్టిన తర్వాత కూడా ఆగకుండా ముందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రియాంక కారు వైపు కోపంగా చూడటంతో యువకులు మరోసారి కారును వెనక్కి తిప్పి స్కూటీని ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మొత్తం మూడుసార్లు స్కూటీని ఢీకొట్టినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా తెలుస్తోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రియాంక, ఉమేశ్ ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. అనంతరం కారు వేగంగా ముందుకు దూసుకెళ్లిన సమయంలో కిందపడిన ప్రియాంక తలపై నుంచి కారు వెళ్లిన దృశ్యాలు కూడా సీసీటీవీలో నమోదైనట్లు సమాచారం. ఈ ఘటనను చూసిన మాల్ సిబ్బంది కేకలు వేయడంతో యువకులు అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.
ప్రియాంక పరిస్థితి విషమం
తీవ్రంగా గాయపడిన ప్రియాంకను ఆమె స్నేహితుడు, మాల్ సిబ్బంది వెంటనే రాజమహేంద్రవరంలోని కంబాలచెరువు ప్రాంతంలోని స్వతంత్ర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి కిమ్స్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందుతోంది. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రియాంక మృత్యువుతో పోరాడుతున్న పరిస్థితి కుటుంబ సభ్యులు, వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఉమేశ్‌కు చేతి, ఛాతి భాగాల్లో గాయాలయ్యాయి.
రెండు కేసులు నమోదు
ఘటనపై ప్రసాద్ ఆదిత్య మాల్ థియేటర్ మేనేజర్ విజయ్ ఫిర్యాదు మేరకు ఒక కేసు, ప్రియాంక తండ్రి కనికే వెంకటేష్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల్లో నమోదైన కారు నంబర్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. వారిని చింతల నామవరానికి చెందిన సూరారపు ధస్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌గా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు సీసీటీవీ ఫుటేజీల్లో వరుసగా ఢీకొట్టిన దృశ్యాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.
ఏపీ జూడా తీవ్ర ఆందోళన
రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక ఘటనపై ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర, పారదర్శక, నిష్పాక్షిక విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. అసలు ఆ రాత్రి మాల్ వద్ద ఏం జరిగింది? యువకులు నిజంగానే మద్యం మత్తులో ఉన్నారా? స్కూటీని పదేపదే ఢీకొట్టడం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఉద్దేశపూర్వక చర్యా? అనే అంశాలపై దర్యాప్తు పూర్తయితేనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రియాంక త్వరగా కోలుకోవాలని వైద్యులు, సహచర విద్యార్థులు, కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. మరోవైపు ఈ ఘటనలో బాధ్యులపై ఎలాంటి రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
