Begin typing your search above and press return to search.

రాజ‌మండ్రి స్థానికంలో 'రాజ‌కీయం సెగ‌'.. !

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో కీల‌క‌మైన రాజ‌మండ్రి నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక ఎన్నిక‌ల వ్య‌వ‌హారం కూట‌మి పార్టీల నాయ‌కుల మ‌ధ్య రాజ‌కీయ సెగ‌కు దారి తీస్తోంది.

By:  Garuda Media   |   11 Sept 2026 10:00 PM IST
రాజ‌మండ్రి స్థానికంలో రాజ‌కీయం సెగ‌.. !
X

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలో కీల‌క‌మైన రాజ‌మండ్రి నియోజ‌క‌వ‌ర్గంలో స్థానిక ఎన్నిక‌ల వ్య‌వ‌హారం కూట‌మి పార్టీల నాయ‌కుల మ‌ధ్య రాజ‌కీయ సెగ‌కు దారి తీస్తోంది. పైకి అంద‌రూ క‌ల‌సి క‌ట్టుగానే ఉన్నామని చెబుతున్నా.. అంత‌ర్గ‌తంగా ఎవ‌రికి వారు.. పైచేయి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీంతో కూట‌మిలో రాజ‌కీయ వేడి పెరుగుతోంది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ, జనసేన, బీజేపీల రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి పార్టీల మధ్య అంతర్గత సమీకరణాల విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మేయర్ స్థానం కోసం అంతర్గత పోటీ నెల‌కొంది కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే, కూటమిలో మేయర్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకోవాలనే దానిపై అంతర్గత చర్చలు, పోటీ మొదలయ్యాయి. రాజమండ్రి సిటీ (ఆదిరెడ్డి శ్రీనివాస్) మరియు రూరల్ (గోరంట్ల బుచ్చయ్య చౌదరి) స్థానాల్లో టీడీపీ బలంగా ఉండటంతో, మేయర్ స్థానం తమకే దక్కాలని ఆ పార్టీ స్థానిక నేతలు పట్టుబడుతున్నారు.

ఇక‌, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేనకు బలమైన క్యాడర్ ఉండటంతో, రాజమండ్రి మేయర్ స్థానాన్ని లేదా మెజారిటీ డివిజన్లను త‌మ‌కు ఇవ్వాల‌ని ఆ పార్టీ నాయ‌కులు కోరుతున్నారు. తాజాగా తాడేప‌ల్లి గూడెం జ‌న‌సేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఇదే డిమాండ్ చేశారు. ఇక‌, రాజమండ్రి ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో, కార్పొరేషన్ పరిధిలో బీజేపీ కూడా తమకు సముచిత స్థానాలు దక్కాలని కోరుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి కలిసే పోటీ చేస్తుందని బీజేపీ నేత పురందేశ్వరి స్పష్టం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో సీట్ల సర్దుబాటు (వార్డుల కేటాయింపు) కూటమి నేతలకు పెద్ద సవాలుగా మారింది. మొత్తం 50కి పైగా ఉన్న డివిజన్లలో టికెట్ల కోసం మూడు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టికెట్ల కేటాయింపులో అసంతృప్తి రాకుండా అధిష్టానాలు సమన్వయ కమిటీల ద్వారా చర్చలు జరుపుతున్నాయి.

గ్రేటర్ రాజమండ్రి ప్రతిపాదన ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేసి 'గ్రేటర్ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్' ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఎంపీ పురందేశ్వ‌రి తెర‌మీదికి తెచ్చారు. దానికి సంబంధించిన న్యాయపరమైన వివాదాల వల్ల ఇక్కడ ఎన్నికలు చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల సస్పెన్స్ వీడనుండటంతో, కూటమి పార్టీలు ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునేందుకు క్షేత్రస్థాయిలో వార్డుల పర్యటనలు, కార్యాచరణను ముమ్మరం చేశాయి. కానీ, సీట్ల కేటాయింపు, మేయ‌ర్ పీఠం వంటివి సెగ పెంచుతున్నాయి.