పోలీసుల దర్యాప్తుపై రాజమండ్రి మెడికో తండ్రి సంచలన ప్రకటన.. రాజకీయాలు చేయొద్దంటూ రిక్వెస్ట్
హోంమంత్రి అనిత మాటలను కొందరు వక్రీకరించారని, అందుకే తాను తప్పుగా భావించానని తెలిపారు. దయచేసి రాజకీయాలు చేయొద్దని వేడుకున్నారు.
By: Tupaki Political Desk | 10 Aug 2026 11:45 AM ISTరాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న రాజమండ్రి మెడికో ప్రియాంక మరణానికి సంబంధించి పోలీసుల దర్యాప్తుపై ఆమె తండ్రి వెంకటేశ్ సంచలన ప్రకటన చేశారు. ఈ కేసులో తమకు అన్యాయం జరుగుతుందనే భావన తొలుత కలిగిందని, న్యాయం కోసం హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చాక అసలు విషయం తెలిసిందని వెంకటేశ్ మీడియాకు వీడియో విడుదల చేశారు. తన కుమార్తె డాక్టర్ ప్రియాంకపై అత్యంత పాశవికంగా దాడి జరిగినా, ప్రభుత్వం స్పందించలేదని ఆదివారం హైదరాబాద్ లో మీడియా సమక్షంలో ఆయన ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై ప్రభుత్వం జోక్యం చేసుకుని ఘటన తర్వాత ప్రభుత్వం తరఫున ఏం చేసింది వివరించడంతో ఆయన తాజాగా మరో వీడియో విడుదల చేశారు.
డాక్టర్ ప్రియాంకకు జరిగిన అన్యాయంపై రాజకీయాలు చేయొద్దని ఆమె తండ్రి వెంకటేశ్ వేడుకున్నారు. అందరికీ రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా, కుమార్తెను కోల్పోయి తీవ్ర దు:ఖంలో ఉన్నాను. ‘‘ఈ కేసులో నిందితులను చిన్న సెక్షన్లు పెట్టినట్లు ముందు అనుమానించాను. కానీ, రాజమండ్రి వచ్చిన తర్వాత ఈ విషయంలో పోలీసులు ఎంత కఠినంగా ఉన్నారో తెలిసింది.’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. నిందితులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పారు. తాను ఇప్పటివరకు ఫిర్యాదు చేయనందున కేసు తప్పుదారి పట్టిస్తారేమోనని అనుమానం ఉండేదని, కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత తన అనుమానాలు అన్నీ తీరిపోయాయని తెలిపారు.
హోంమంత్రి అనిత మాటలను కొందరు వక్రీకరించారని, అందుకే తాను తప్పుగా భావించానని తెలిపారు. దయచేసి రాజకీయాలు చేయొద్దని వేడుకున్నారు. ఘటనను రాజకీయం చేసి తమకు మరింత మరోవేదన కల్పించొద్దని అభ్యర్థించారు. తాను ఫిర్యాదు చేయకపోయినా పోలీసులు అద్భుతంగా పనిచేశారని, హంతకులు తప్పించుకునే మార్గం లేకుండా ఆధారాలు సేకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసింది. ఇప్పుడు డాక్టర్ ప్రియాంక మరణంతో కేసును హత్య కేసుగా మార్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
మరోవైపు డాక్టర్ ప్రియాంక మరణంపై విద్యార్థి లోకం విషాదంలో మునిగిపోయింది. ఆదివారం ఆమె మరణవార్త తెలియగానే రాజానగరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ విద్యార్థినులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి సైతం హాజరయ్యారు. డాక్టర్ ప్రియాంకకు నివాళులర్పించారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హతురాలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున రూ.20 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. వైద్య ఖర్చులను కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.
