బీజేపీ గాలి తీసేలా రాజా సింగ్ షాకింగ్ కామెంట్స్ !
బీజేపీకి ఆయన బద్ధుడైన నాయకుడే. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు.
By: Satya P | 20 July 2026 12:37 AM ISTబీజేపీకి ఆయన బద్ధుడైన నాయకుడే. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. కానీ గెలిచి చూపించిన రాజకీయ మొనగాడు రాజాసింగ్. గోషామహల్ ఎమ్మెల్యేగా 2014 నుంచి వరుసగా బీజేపీ గుర్తుతో గెలిచి వస్తున్న రాజా సింగ్ ని పార్టీ 2023 ఎన్నికల తరువాత సస్పెండ్ చేసింది. ఆయన కొన్ని విషయాల్లో సొంత పార్టీ మీదనే విమర్శలు చస్తున్నారు అన్న కారణంతో పక్కన పెట్టారు. అయితే ఏదో నాటికి ఆయన బీజేపీ గూటికి చేరుతారు అన్న ప్రచారం ఒక వైపు ఉండగానే రాజా సింగ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తన అభిప్రాయాలను ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఆయన బీజేపీకి నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తున్నట్లుగానే అవి ఉంటున్నా అదే సమయంలో ఘాటైన విమర్శలుగా కూడా కనిపిస్తున్నాయి.
బీజేపీ అధికారంలోకి వస్తుందా :
బీజేపీ తెలంగాణాలో అధికారంలోకి వస్తుందా అని రాజా సింగ్ ప్రశ్నించారు. ఆ ఇద్దరు నేతలు కలిస్తే ఏమి జరుగుతుందని ఆయన కీలక ప్రశ్నను సంధించారు. ఆ ఇద్దరు నేతలు ఎవరో కాదు కేంద్ర మంత్రి బండి సంజయ్ అలాగే మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్. ఈ ఇద్దరు నాయకులను తెలంగాణా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అభయ్ సింగ్ పిలిపించి చేతులు కలిపారు. విభేదాలు మరచి కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. దీంతో బీజేపీ తెలంగాణాలో తన వ్యూహాత్మకమైన అడుగులతో ముందుకు సాగుతోంది అన్న సంకేతాన్ని ఇచ్చినట్లు అయింది. ఇపుడు దానిని రాజా సింగ్ తప్పు పడుతున్నారు. ఇద్దరు నేతలు చేతులు కలిపితే బీజేపీ అధికారంలోకి వస్తుందా అని ఆయన నిలదీస్తున్నారు.
వారి సంగతేంటి :
బీజేపీలో ఎంతో మంది సీనియర్ నాయకులు అలాగే కార్యకర్తలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. వారి సంగతి ఏమిటి అని కూడా ప్రశ్నించారు. అంటే పార్టీలో నాయకులందరినీ బీజేపీ ఇంకా కలుపుకొని పోవడం లేదన్న విమర్శ ఆయన మాటలలో కనిపిస్తోంది. అదే సమయంలో కార్యకర్తలకు ఉత్సాహం కలిగించేలా యాక్షన్ ప్లాన్ లేదని కూడా ఆయన చెబుతున్నట్లుగా ఉంది. నిజానికి బీజేపీలో ఇద్దరు కీలక నేతలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్నారు. విభేదాలు తగ్గాయి. ఇది మంచి సంకేతాలను ఇస్తుందని కమలనాధులు ఒక వైపు పొంగుతున్నారు. దాని మీద రాజా సింగ్ తన ఘాటు విమర్శలతో నీళ్ళు జల్లేశరు అని అంటున్నారు.
ఆ ఒక్కటీ చేసి చూపించండి :
కమలం పార్టీ తెలంగాణాలో కదనోత్సాహంతో ఉంది. మూడు కార్పోరేషన్ల మేయర్ పదవులు గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. అలా తన సత్తా చాటాలని చూస్తొంది. అయితే బీజేపీ ఉత్సాహానికి గాలి తీసేశారు రాజాసింగ్ అంటున్నారు. మూడు కార్పోరేషన్ల మేయర్లు గెలవడం కాదు ముందు ఒక్క కార్పోరేషన్ లో అయినా సగం సీట్లు గెలిచి చూపించండి చాలు అని సవాల్ చేసేలా మాట్లాడారు. అంటే బీజేపీకి ఒక్క కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవని రాజా సింగ్ తన ముందస్తు అంచనాను ఇలా బయటపెట్టారా అని చర్చ సాగుతోంది. అంతే కాదు ఆయన బీజేపీ ప్రస్తుత అధ్యక్షుడు రామచంద్రరావు మీద మీద కూడా కామెంట్స్ చేశారు. ఆయన చేతులు కట్టేశారని మరి ఎలా పనిచేస్తారు అని ప్రశ్నించారు ఒక వ్యక్తి కోసమే అధినాయకత్వం ఆలోచించే విధానాలు వద్దు అని హితవు పలికారు. మొత్తానికి దూరంగా ఉంటూనే కమలానికి కఠినమైన తీరులోనే సలహాలు సూచనలతో పాటు దిశా నిర్దేశం చేశారు రాజాసింగ్. దీనిని బీజేపీ అధినాయకత్వం ఏ విధంగా చూస్తుంది అన్నదే ఇపుడు చర్చ మరి.
