Begin typing your search above and press return to search.

హనీమూన్ హత్య కేసులో ట్విస్ట్.. పెళ్లి క్యాటరింగ్ బిల్లు ఎవడు కడుతాడు?

ఇదిలా ఉండగా రాజా–సోనమ్ వివాహ వేడుకలకు సంబంధించిన క్యాటరింగ్ సేవలను ఇండోర్‌కు చెందిన హితేష్ రోహిరా నిర్వహించారు.

By:  A.N.Kumar   |   5 Aug 2026 12:24 PM IST
హనీమూన్ హత్య కేసులో ట్విస్ట్.. పెళ్లి క్యాటరింగ్ బిల్లు ఎవడు కడుతాడు?
X

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇండోర్‌కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో మరో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ కేసు హనీమూన్ హత్యగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసుతో పరోక్షంగా సంబంధం ఉన్న వివాహ వేడుకల క్యాటరింగ్ బిల్లు వివాదం తెరపైకి రావడం కొత్త చర్చకు దారితీసింది. వివాహం జరిగి దాదాపు 15 నెలలు గడిచినా తమకు చెల్లించాల్సిన బకాయిలు అందలేదని క్యాటరర్ పోలీసులను ఆశ్రయించడం విశేషంగా మారింది.

2025 మే నెలలో ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీల వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి అనంతరం హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లిన రాజా అక్కడ అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యారు. సోహ్రా ప్రాంతంలోని ఓ లోయలో ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా విచారణలో భాగంగా రాజా భార్య సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహతో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో కొనసాగుతోంది.

ఇదిలా ఉండగా రాజా–సోనమ్ వివాహ వేడుకలకు సంబంధించిన క్యాటరింగ్ సేవలను ఇండోర్‌కు చెందిన హితేష్ రోహిరా నిర్వహించారు. ఇందుకోసం మొత్తం రూ.11,42,550 విలువైన కాంట్రాక్టు కుదిరిందని ఆయన తెలిపారు. అయితే ఆ మొత్తంలో రూ.8,60,000 మాత్రమే చెల్లించారని.. ఇంకా రూ.2,82,550 బకాయి ఉందని పేర్కొన్నారు. ఈ బకాయిల కోసం పలుమార్లు రాజా సోదరుడు విపిన్ రఘువంశీ, సోనమ్ సోదరుడు గోవింద్ రఘువంశీలను సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పష్టమైన స్పందన రాలేదని హితేష్ ఆరోపించారు.

తర్వాత ఏప్రిల్ 1న ఇరు కుటుంబాలకు లీగల్ నోటీసులు పంపిన హితేష్, సమస్య పరిష్కారం కాకపోవడంతో ద్వారకాపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇది క్రిమినల్ అంశం కాదని పూర్తిగా సివిల్ వివాదమని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించినట్లు సమాచారం.

మరోవైపు ఈ ఆరోపణలను రాజా కుటుంబ సభ్యులు పూర్తిగా ఖండిస్తున్నారు. తమ కుటుంబానికి ఎలాంటి బకాయిలు లేవని.. క్యాటరర్‌ను బుక్ చేసినది సోనమ్ కుటుంబమేనని రాజా సోదరుడు విపిన్ రఘువంశీ పేర్కొన్నారు. మరోవైపు సోనమ్ సోదరుడు గోవింద్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వివాహం జరిగి 15 నెలలు పూర్తైన తర్వాత అకస్మాత్తుగా ఈ బిల్లు అంశాన్ని బయటకు తీసుకురావడం వెనుక ప్రచారమే ప్రధాన ఉద్దేశమని ఆయన ఆరోపించారు.

ఇప్పటికే హనీమూన్ హత్య కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కొనసాగుతుండగా, ఇప్పుడు క్యాటరింగ్ బకాయిల వివాదం కూడా అదే కేసు చుట్టూ కొత్త కోణాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ వివాదానికి హత్య కేసు విచారణతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా వివాహానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మళ్లీ వెలుగులోకి రావడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం క్యాటరర్ చేసిన ఆరోపణలు, ఇరు కుటుంబాల వాదనలు చర్చకు దారితీస్తుండగా.. ఈ సివిల్ వివాదం ఎలా ముగుస్తుందన్నది చూడాల్సి ఉంది.