Begin typing your search above and press return to search.

రాజ్ భవన్ కాదు లోక్ భవన్

రాజ్ భవన్ అంటే ఏమిటో అందులో ఎవరు ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. గవర్నర్లు ఉండేది రాజ్ భవన్ లో. చిరకాలంగా ఈ పేరు కొనసాగుతూ వస్తోంది.

By:  Satya P   |   3 Dec 2025 9:29 AM IST
రాజ్ భవన్ కాదు లోక్ భవన్
X

రాజ్ భవన్ అంటే ఏమిటో అందులో ఎవరు ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. గవర్నర్లు ఉండేది రాజ్ భవన్ లో. చిరకాలంగా ఈ పేరు కొనసాగుతూ వస్తోంది. అయితే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్ భవన్ ల పేరు మారుస్తూ కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం రాజ్ భవన్ ల పేరు ఇక మీదట లోక్ భవన్ గానూ లోక్ నివాస్ గానూ మారుస్తున్నట్లుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు.

సేవా తీర్ధంగా :

అంతే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆఫీస్ గా ఉండే ప్రధానమంత్రి కార్యాలయాన్ని సేవా తీర్థంగా పేరు మార్చారు. సేవ సుపరిపాలన కీలక ప్రాధాన్యతలుగా అభివృద్ధి చెందిన ఉన్నతమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా దేశం సాగుతున్న ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా హోం మంత్రి అమిత్ షా అభివర్ణించారు. గత పదకొండేళ్ళుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం కంటే సేవకు పర్యాయపదంగా ఉందని ఆయన గుర్తు చేస్తున్నారు. అందుకే , ప్రధానమంత్రి తనను తాను ప్రధాన సేవక్‌గా భావిస్తూ వచ్చారని ఆయన వారంలో ఏడు రోజులూ రోజుకు ఇరవై నాలుగు గంటలూ ప్రజల కోసం పనిచేస్తూ వస్తున్నారని హోంమంత్రి చెబుతున్నారు.

తెలంగాణాలో మార్పు :

ఇదిలా ఉంటే తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం ఇకపై రాజ్ భవన్ కు బదులుగా లోక్ భవన్ గా పిలువబడుతుంది అని చెబుతున్నారు. పేరు మార్పును అధికారిక ప్రకటనలో గవర్నర్ ఆఫీసు వర్గాలు ప్రకటించారు. అన్ని సూచనలు, రికార్డులు ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఈ మార్పు తక్షణమే అమల్లోకి వచ్చిందని గవర్నర్ ప్రెస్ సెక్రటరీ తెలియజేశారు. ఈ ప్రకటన ప్రకారం పేరు మార్పు భారతదేశ ప్రజాస్వామ్య విలువల బలం ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా ఉద్దేశించబడిందని గవర్నర్ ఆఫీసు పేర్కొంది ఈ మార్పు వికసిత్ భారత్ వైపు పురోగమించాలనే విస్తృత జాతీయ ఆకాంక్షకు అనుగుణంగా ఉందని తెలంగాణా ప్రభుత్వం సైతం పేర్కొంది.

ఇంకా మార్పులు ఉంటాయా :

కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా పేర్ల మార్పు కూడా మొదలైంది. అయితే అతి ముఖ్యమైన వాటికి పేర్లను మారుస్తూ వస్తున్నారు. రాజ్‌పథ్‌ను 2022 సెప్టెంబర్ 2022లో కర్తవ్య పథంగా మార్చారు. ఈ పేరు మార్పు భారతదేశం యొక్క వలసరాజ్యాల అనంతర గుర్తింపులో మార్పును కూడా ప్రతిబింబిస్తుంది అని ఎన్డీయే పాలకులు చెప్పారు. అలా కర్తవ్య పథ్ అనేది ఆంగ్లంలో డ్యూటీ పథ్ గా అనువదించబడింది. ఢిల్లీలో మాజీ ప్రధానుల స్మారక భవనాల పేరు మార్చారు. భారతదేశ మాజీ ప్రధానులందరికీ ప్రాథమిక జాతీయ స్మారక చిహ్నం న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయంగా చేస్తూ కీలకమైన స్థానంలో ఉంచారు. అలా మాజీ ప్రధానమంత్రుల మ్యూజియం గ్రంథాలయం వంటివి అక్కడ ఉంచారు.

కీలకంగానే :

అంతే కాదు మరణించిన చాలా మంది మాజీ ప్రధానుల వ్యక్తిగత స్మారక చిహ్నాలు వారి సమాధులు ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో ఉన్నాయి. తరచుగా రాజ్ ఘాట్ కాంప్లెక్స్ చుట్టూ ఉన్నాయి, అయితే స్థల పరిమితుల కారణంగా 2013 నాటికే అన్ని భవిష్యత్ స్మారక చిహ్నాల కోసం స్మృతి స్థల్ అనే సాధారణ స్థలాన్ని నియమించారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఆ తరువాత అనేక కీలక నిర్ణయాలే తీసుకుంటూ వస్తోంది. దీంతో ముందు ముందు ఏ మార్పులు ఉంటాయో చూడాల్సి ఉంది.