Begin typing your search above and press return to search.

రాహుల్ ప్రియాంక సక్సెస్...తెలుగు నీళ్ళలో తేడా ఉందా ?

తెలుగు నీళ్ళలో తేడా ఏమైనా ఉందా అన్నదే ఇపుడు ఒక గమ్మత్తు అయిన చర్చ. దేని గురించి అంటే బంధాలు అనుబంధాల గురించే మరి.

By:  Satya P   |   17 Aug 2026 9:33 AM IST
రాహుల్ ప్రియాంక సక్సెస్...తెలుగు నీళ్ళలో తేడా ఉందా ?
X

తెలుగు నీళ్ళలో తేడా ఏమైనా ఉందా అన్నదే ఇపుడు ఒక గమ్మత్తు అయిన చర్చ. దేని గురించి అంటే బంధాలు అనుబంధాల గురించే మరి. ముఖ్యంగా అన్నా చెల్లెళ్ళ బంధాలు తెలుగు నాట రాజకీయ బాటన పడి నలిగిపోతున్నాయి అన్నది ఉంది. అన్న చెల్లెళ్ళ మధ్య అగాధం ఏర్పడుతోంది. రాజకీయమే విడదీస్తోంది అన్నది కూడా ఉంది. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు ప్రాంతీయ పార్టీలలో ఒకే రకమైన సన్నివేశం కనిపిస్తోంది. అందుకే ఉత్సాహం ఆపుకోలేని ఒక ప్రముఖ తెలుగు టీవీ చానల్ యాంకర్ తాను చేసిన ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవితను అడిగేశారు. దేశంలో అన్నా చెల్లెళ్ళ రాజకీయాలు బాగానే ఉన్నాయి కదా ఇక్కడేంటని. దానికి తెలుగు నీళ్ళలోనే తేడా ఉందేమో అని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు తీరు చూస్తే అదే నిజం అనిపిస్తోంది అని అంటున్నారు.

ఆదర్శంగా వారిద్దరూ :

ఇక జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ వంటి అతి పెద్ద పార్టీలో శతాబ్దాల చరిత్ర ఉన్న సంస్థలో ఎంచక్కా రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేస్తున్నారు. అన్నా చెల్లెలు ఇద్దరూ లోక్ సభలో సభ్యులుగా ఉన్నారు. సభలో చెల్లెలు బాగా మాట్లాడితే అన్న మెచ్చుకుని కితాబు ఇవ్వడం జరుగుతోంది. అలాగే అన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూంటే పక్కన చెల్లెలు నిలబడి సహకరించడమూ అంతా చూస్తున్నారు. ఇద్దరూ పార్టీ తరఫున దేశమంతా పర్యటిస్తున్నారు. పార్టీ నాయకులతో భేటీలు వేస్తున్నారు. కలసికట్టుగా కాంగ్రెస్ ని నడిపిస్తున్నారు. ఎక్కడా ఆధిపత్య పోరు అన్న సమస్య లేకుండా చూసుకుంటున్నారు. మరి అక్కడ కుదిరిన ఒద్దిక తెలుగు రాజకీయాల్లో అన్నా చెల్లెళ్ళ మధ్య ఎందుకు కుదరడం లేదు అన్నదే అందరికీ కలుగుతున్న ధర్మ సందేహంగా ఉంది.

నాడు కలసి నేడు వేరుగా :

ఇక తెలంగాణాలో చూస్తే బీఆర్ఎస్ పార్టీలో కవిత కేటీఆర్ కలసి పనిచేశారు. ఆమె ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. పార్టీలో మహిళా నేతగా ఆమెకు గౌరవం ఇస్తే కేటీఆర్ కీలక నేతగా ఉంటూ వచ్చారు, మరి ఎక్కడ తేడా వచ్చిందో ఒక్కసారిగా కవితను సస్పెండ్ చేశారు. దాంతో ఆమె వేరు పార్టీ పెట్టుకున్నారు. తనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అన్న మీద ఆమె విమర్శలు కూడా ఎక్కుబెడుతున్నారు. ఇక ఏపీలో చూస్తే షర్మిల జగన్ ల కధ కూడా డిటోగానే ఉంది అని అంటున్నారు. రాజకీయ పోరు ఆస్తుల వివాదాలుగా ఎవరికి తోచిన విధంగా వారు వ్యాఖ్యానిస్తున్నారు.

వైసీపీకి పునాదిగా :

షర్మిల వైసీపీకి పునాదిగా ఉంటూ వచ్చారు. జగన్ పదహారు నెలల పాటు జైలులో ఉంటే షర్మిల అన్న లేని అండ లేని పార్టీకి అన్నీ తానే అయి ముందుకు నడిపించారు. ఆమె సుదీర్ఘమైన పాదయాత్ర చేయడం ద్వారా వైసీపీకి ఊపిరి నిలిపారు. ఆ సమయంలో 18 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే రెండు తప్పించి మిగిలిన పదహారు సీట్లను వైసీపీ గెలుచుకోవడం వెనక జగన్ ఇమేజ్ ఉన్నా షర్మిల పాదయాత్ర కూడా దోహదపడింది అని అంటారు. 2019 ఎన్నికల వేళ కూడా ఆమె పార్టీకి ప్రచారం చేసి పెట్టారు. అయితే ఆమెకు పార్టీలోనే సరైన చోటు లేదని ఆవేదన చెందారని అంటారు. ఇక ఆస్తుల వివాదాలు తోడు అయ్యాయని చెబుతారు. ఏది ఏమైనా షర్మిల వల్ల వైసీపీకి జగన్ కి 2024 ఎన్నికల్లో రాజకీయంగా నష్టం వచ్చింది అన్నది ఒక కఠిన విశ్లేషణగా ఉంది.

విమర్శణ బాణాలతో :

ఇక్కడ అన్నా చెల్లెళ్ళు విడిపోవడం రాజకీయ ప్రత్యర్ధులకు అంది వచ్చిన అస్త్రంగా మారుతోంది. సొంత చెల్లెలుని ఆదరించి అభిమానించలేని నాయకుడు ప్రజలను ఏమి ఉద్ధరిస్తారు అని తెలంగాణాలో రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏపీలో చంద్రబాబు మంత్రులు ఇతర నాయకులు అదే మాట అంటున్నారు. ఆ విధంగా విమర్శల జడివానలో అన్నలు చిక్కుకుంటే సొంతంగా రాజకీయ అస్తిత్వ పోరాటం చేస్తూ చెల్లెళ్ళు అలసిపోతున్నారు. మరి రాహుల్ ప్రియాంక సక్సెస్ స్టోరీ తెలుగు నాట వర్కౌట్ కావడం లేదా అన్నదే అందరికీ పెద్ద డౌట్.