Begin typing your search above and press return to search.

రాహుల్ పై ఈసీ యాక్షన్ అదేనా ?

ఓటు చోరీ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం మీద అతి పెద్ద ఆరోపణనే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేశారు.

By:  Satya P   |   18 Aug 2025 2:00 AM IST
రాహుల్ పై ఈసీ యాక్షన్ అదేనా ?
X

ఓటు చోరీ అంటూ కేంద్ర ఎన్నికల సంఘం మీద అతి పెద్ద ఆరోపణనే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేశారు. నిజానికి ఈ ఆరోపణ దేశంలోని అత్యంత కీలకమైన మౌలికమైన వ్యవస్థగా ఉన్న ఈసీ నిబద్ధతనే ప్రశ్నించినట్లు అయింది. దేశంలో ఇప్పటికి ఎనిమిది పదుల స్వాతంత్ర్యం తరువాత ఎన్నో సార్లు లోక్ సభకు ఎన్నికలు జరిగాయి. అలాగే వందల సార్లు వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీలకు జరిగాయి అయితే ఎపుడూ రాని ఆరోపణలు ఎవరూ చేయని ఆరోపణలను రాహుల్ గాంధీ చేశారు. స్వతంత్ర్య భారత చరిత్రలో ఈసీ మీద ఇంత పెద్ద నింద పడింది ఇదే తొలిసారి కావడం విశేషం.

జనాల్లోకి వెళ్ళిపోయింది :

ఇక రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఈసీ మీద పదే పదే వ్యక్తం చేస్తున్న అనుమానాలు అయితే జనంలోకి బలంగా వెళ్ళాయి వాటిని జనాలు ఎంత వరకూ నమ్ముతున్నారు అన్నది పక్కన పెడితే రాహుల్ గాంధీ మాత్రం ఎక్కడా పట్టు విడవకుండా తాను అనుకున్న దానిని నమ్మిన దానిని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. బీహార్ లో ఆయన ఓటు అధికార్ యాత్ర పేరుతో ప్రారంభించిన యాత్ర సైతం జనాల్లోకి మరింతగా ఈ అంశం చర్చకు ఉంచడం కోసమే అంటున్నారు. ఇక గత కొద్ది రోజులుగా మీడియాలో సైతం అతి పెద్ద డిబేట్ గా ఈ అంశం ఉంది.

ఈసీ సీరియస్ గానే :

దాంతో ఈసీ ఈ అంశం మీద అనివార్యంగా స్పందించాల్సిన అవసరం అయితే ఏర్పడింది. ఆదివారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలే చేశారు. ఓట్ల చోరీ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఓటర్లకు అండగా ఈసీ ఎపుడూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈసీకి ఎలాంటి వివక్ష కానీ పక్షపాతం కానీ లేదని కూడా వివరణ ఇచ్చారు. తప్పుడు ప్రచారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యక్తిగత గోప్యత కోసమే :

ఎక్కడైనా ఎపుడైనా ఓటర్లకు సంబంధించిన ఫోటోలను బహిరనంగా ప్రదర్శించడం అన్నది ఈసీ చేయ్దని స్పష్టం చేసారు. అలా చేయడం అంటే వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అని కూడా జ్ఞానేశ్ కుమార్ పేర్కొంటున్నారు. ఎన్నికల్లో తాము ఎలాంటి అంశాల మీద అయినా రాజీ పడేది ఉండదని అన్నారు. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేయలాని చూసినా లేక ఈసీ భుజం మీద తుపాకీ పెట్టి రాజకీయాలు చేయాలని చూసినా తాము వాటికి లొంగిపోయే ప్రసక్తే ఉండదని కూడా గట్టిగానే చెప్పారు.

అందరూ సమానులే :

ఈసీ ముందు అందరూ సమానులే అని కూడా జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. తమకు పేద ధనిక వృద్ధులు మహిళలు యువత అనే తేడా అన్నదే అసలు ఉండదని ఉద్ఘాటించారు. దేశంలోని అన్ని వర్గాల ఓటర్లకు ఈసీ నిర్భయంగా అండగా నిలుస్తుందని కూడా జ్ఞానేశ్ కుమార్ ఉద్ఘాటించారు. అంతే కాదు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా సరే తమ రాజ్యాంగబద్ధమైన విధులను నిర్వర్తించడంలో ఈసీ ఎన్నడూ వెనకడుగు వేసే సమస్య ఉండని కూడా ఆయన తేల్చి చెప్పారు.

బీహార్ మీద సైతం :

ఇక దేశంలో గత కొంతకాలంగా విపక్షాలు బీహార్ లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ మీదనే విమర్శలు చేస్తున్నారు. అయ్హితే ఈ కార్యక్రమంలో పక్షపాతంగా ఈసీ ఉంది అన్న దాని మీద సైతం జ్ఞానేశ్ కుమార్ ఈ తరహా ఆరోపణలను పూర్తి స్థాయిలో తోసిపుచ్చారు. ఈ సవరణలు అన్నీ కూడా క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారులు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కలసి పారదర్శకంగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఇక వారు ధృవీకరించిన పత్రాలు వీడియో ఆధారాలు కూడా ఈసీ వద్దనే ఉన్నాయని తెలిపారు.

తీవ్రంగానే పరిగణిస్తాం :

తమ మీద వస్తున్న ఆరోపణలను తీవ్రంగానే చూస్తామని ఈసీ అంటోంది. కొంత మంది నాయకులు ఓటర్ల ఫోటోలను బహిరంగంగా ప్రదర్శించడంపైన కూడా ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని హెచ్చరించారు. ఎన్నికల సంఘంపైన తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఈ రోజున జరుగుతున్నాయని జ్ఞానేశ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ విషయంలో ఏం చేస్తారు :

ఇక రాహుల్ గాంధీ అయితే ఓట్ల చోరీ అంటూ బీహార్ అంతటా తిరుగుతున్నారు. ఈసీ మాత్రం అధారాలు ఉంటే ఇవ్వాలని కోరుతోంది. అఫిడవిట్ తమకు ఏడు రోజుల వ్యవధిలోగా సమర్పించాలని కోరుతోంది. ఆ గడువులోగా ఇవ్వకుండా రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు అన్నీ నిరాధారమని ఈసీ భావిస్తుందని కూడా పేర్కొంది. అయితే ఇంతటితో ఈసీ సరిపెడుతుందా నిరాధార ఆరోపణలు ఒక స్వతంత్ర్య రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన సంస్థ మీద చేస్తున్నారు అని సీరియస్ యాక్షన్ కి వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈసీ పేరు పెట్టకుండానే రాహుల్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఒక ఇండిపెండెంట్ రాజ్యంగ అధారిటీ. ఆ సంస్థ మీద ఆరోపణలు తప్పు అని తేలినా నిరాధారంగా ఉన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరి ఈసీ ఏమి చేస్తుందో చూడాల్సి ఉంది.