Begin typing your search above and press return to search.

రాహుల్ చేతిలో మరో బాంబు...పేల్చేది అపుడేనా ?

ఆగస్టు నెలలో అతి పెద్ద రాజకీయ సంచలనానికి కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెర తీశారు.

By:  Satya P   |   28 Aug 2025 7:36 PM IST
రాహుల్ చేతిలో మరో బాంబు...పేల్చేది అపుడేనా ?
X

ఆగస్టు నెలలో అతి పెద్ద రాజకీయ సంచలనానికి కాంగ్రెస్ అగ్ర నేత లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు తెర తీశారు. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం మీద తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి ఆయన పెట్టిన పేరు ఓటు చోరీ. బీజేపీకి ఈసీ ఎన్నికల్లో సాయం చేస్తోంది అని ఆయన తన దగ్గర ఉన్న ఆధారాలను అన్నింటినీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. దాంతో ఒక్కసారిగా దేశంలోనే కలకలం రేగింది. ఓట్ల చోరీ అంటూ రాహుల్ అందుకున్న నినాదం మీద మేధావులు ఇతర వర్గాలు చదువరులలో సైతం ఆలోచనలు రేకెత్తించాయి. సరి కొత్త చర్చలు అయితే అంతటా మొదలయ్యాయి.

అదే ఊపుతో అలా :

ఇక చూస్తే కనుక ఆగస్ట్ 7న ఢిల్లీ వేదికగా మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ ఓట్ల చోరీ మీద ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ తరువాత ఏ మాత్రం ఆలస్యం చేయలేదు. పార్లమెంట్ ఒక వైపు జరుగుతూంటే ఎంపీలతో కలసి ఆయన ఈసీ కార్యాలయం దాకా ప్రదర్శన నిర్వహించారు అదే ఊపులో ఆయన బీహార్ రాష్ట్రమంతా ఓటర్ అధికార్ యాత్రను చేపట్టారు. దానికి జనంలో మంచి స్పందన లభిస్తోంది. ఆయన దాదాపుగా ప్రతీ రోజూ ప్రతీ సభలోనూ ఈసీని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కలిపి ఎండగడుతున్నారు ఓట్ల చోరీ జరిగింది అన్నది అంతా నమ్ముతున్నారని కూడా అంటున్నారు

మరో బాంబు రెడీనా :

ఇదిలా ఉంటే ఇదే స్పీడ్ లో రాహుల్ గాంధీ బీహార్ నుంచి ఒక సంచలన ప్రకటన చేశారు. ఓట్ల చోరీ పెద్ద ఎత్తున జరిగిందని నిరూపిస్తాను అని కూడా రాహుల్ గాంధీ గర్జిస్తున్నారు. ఒక్క బీహార్ లోనే ఏకంగా 65 లక్షల ఓటర్ల పేర్లు లేకుండా పోయాయని రాహుల్ ఆరోపించారు బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం కలసి ఈ విధంగా ఓట్లు తొలగించారని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఓట్లు పోగొట్టుకున్న వారిలో ఎక్కువగా బాధితులుగా ఉన్నది బడుగు బలహీన వర్గాలవారేనని రాహుల్ అంటున్నారు.

మరిన్ని ఆధారాలున్నాయి :

ఓట్ల చోరీ జరిగింది అనడానికి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ అంటున్నారు. రానున్న రోజులలో 2024 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ ఏ విధంగా జరిగింది అన్నది కూడా వివరిస్తాను అని ఆయన చెప్పడం విశేషం. ఇప్పటిదాకా కర్ణాటక హర్యానా, మహారాష్ట్రలలో ఓట్ల చోరీ జరిగింది అని మాత్రమే చెబుతూ వచ్చిన రాహుల్ గాంధీ ఇపుడు దేశవ్యాప్తంగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో సైతం ఓట్లు గల్లంతు అయ్యాయని వాటి పూర్తి సమాచారం తన దగ్గర ఉందని అంటున్నారు.

మరో పవర్ పాయింట్ ప్రజంటేషన్ :

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్ర పేరుతో బీహార్ లో యాత్ర నిరహిస్తున్నారు. అది ఈ నెల 17న ప్రారంభం అయింది. ఈ నెల చివరి దాకా కొనసాగుతుంది. సెప్టెంబర్ 1న పాట్నాలో జరిగే బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుంది ఆ తరువాత రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికల్లో జరిగిన ఓట్ల చోరీ గురించి మరో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటికే ఓట్ల చోరీ ఆరోపణల మీద ఈసీ వివరణ ఇచ్చినప్పటికీ అది ఏ మాత్రం సరిపోవడం లేదు రాహుల్ గాంధీ జనంలోకి వెళ్తున్నారు వారి మధ్యనే అంతా చర్చకు పెడుతున్నారు. జనాల నుంచి వస్తున్న ఆదరణతో మరింత సమాచారం ఉందని అంటున్నారు రాహుల్ గాంధీ మరో పవర్ పాయింట్ ప్రజంటేషన్ తో ఎన్ని సంచలనాలు దేశ రాజకీయాల్లో నమోదు అవుతాయో అన్న చర్చకు తెర లేస్తోంది.