ఇంట్రస్టింగ్ మూవ్... విజయ్ 'జన నాయగన్' కోసం రంగంలోకి రాహుల్ గాంధీ!
తమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సారి ఎన్నికల్లో అధికార డీఎంకే, విపక్ష అన్నా డీఎంకేలతో పాటు సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పోటీ చేయబోతోంది
By: Raja Ch | 13 Jan 2026 5:36 PM ISTతమిళనాడులో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ సారి ఎన్నికల్లో అధికార డీఎంకే, విపక్ష అన్నా డీఎంకేలతో పాటు సినీ నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పోటీ చేయబోతోంది. ఇకపై తన జీవితం ప్రజలకు సేవచేయడానికే అంకితం అని విజయ్ ప్రకటించారు. "జన నాయగన్" తన చివరి చిత్రం అని వెల్లడించారు. అయితే జనవరి 9న విడుదల కావాల్సిన ఆ చిత్రానికి ప్రభుత్వం నుంచి సమస్యలు వచ్చాయని అంటున్నారు! ఈ సమయంలో రాహుల్ గాంధీ స్పందించారు.
అవును... విజయ్ నటించిన జన నాయగన్ సినిమా విడుదల విషయం ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాల్లోనూ కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా విడుదల ఆగడాన్ని బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ స్పందించారు.. విజయ్ కు మద్దతుగా వాయిస్ వినిపించారు. దీంతో ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
'జన నాయగన్ ను నిరోధించడానికి ఐ&బీ మంత్రిత్వ శాఖ చేసిన ప్రయత్నం తమిళ సంస్కృతిపై దాడి.. మిస్టర్ మోడీ, తమిళ ప్రజల గొంతును అణచివేయడంలో మీరు ఎప్పటికీ విజయం సాధించలేరు' అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. దీంతో.. ఈ విషయం ఇప్పుడు సినిమా, రాజకీయాలతో పాటు సాంస్కృతికంగానూ చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు! నేరుగా జన నాయగన్ సినిమా ఆగడాన్ని తమిళ సంస్కృతిపై దాడిగా రాహుల్ అభివర్ణించడంతో ఈ విషయం మరింత పెద్దదైందని అంటున్నారు.
కాగా... 'జన నాయగన్' సమస్య సినిమా వివాదం కంటే పెద్దదిగా మారిందనే సంగతి తెలిసిందే! ఈ సినిమా సర్టిఫికేషన్ అడ్డంకులు, చట్టపరమైన పరిశీలన, దాని కంటెంట్ కు సంబంధించిన అభ్యంతరాలు, వివాదాల కారణంగా ఆలస్యమైంది. దీనిపై కోర్టులో సినిమా నిర్మాతలు, అధికారుల మధ్య వాదనలు జరిగాయి. ఈ సినిమాను కావాలనే అడ్డుకుంటున్నారంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ వాయిస్ ను బలంగానే వినిపించారు!
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా సినిమాలను అన్యాయంగా లక్ష్యంగా చేసుకోకూడదనే వాదనను సమర్థించారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. రాహుల్ గాంధీ కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఇది రాజకీయంగా మరింతగా చర్చనీయాంశం అయ్యిందని అంటున్నారు. పైగా టీవీకే తో జత కట్టాలని, అది పార్టీకి మంచి చేస్తుందని కాంగ్రెస్ లోని ఓ వర్గం పట్టుబడుతుందనే చర్చా నడుస్తుంది. విజయ్ కు ప్రత్యేకంగా యువతలోనూ, తొలిసారి ఓటు వేసే వారిలోనూ ఫుల్ క్రేజ్ ఉందని గుర్తుచేస్తున్నారు.
అయితే, కాంగ్రెస్ లోని కొంతమంది సీనియర్లు మాత్రం టీవీకేతో జతకట్టే విషయంపై ఏకీభవించడం లేదని అంటున్నారు. డీఎంకేతో ఉన్న దీర్ఘకాలిక పొత్తుకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ భాగస్వామ్యం చాలా సంవత్సరాలుగా రాజకీయ ప్రయోజనాన్ని తెచ్చిపెట్టిందని వారు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా.. జన నాయగన్ కోసం రాహుల్ కల్పించుకుని, మోడీని టార్గెట్ చేయడం మాత్రం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతుందని మాత్రం చెప్పొచ్చు!
