రాజకీయాన్ని వేడెక్కించి...విదేశీ విమానమెక్కిన రాహుల్ !
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల మీద ఎపుడూ అధికార బీజేపీ విమర్శలు చేస్తూనే ఉంటుంది.
By: Satya P | 20 Oct 2026 8:59 AM ISTకాంగ్రెస్ అగ్ర నేత గత కొంతకాలంగా దూకుడు రాజకీయం చేస్తున్నారు. ఆయన ఇటీవల కాలంలో డోస్ పెంచేశారు. అలుపెరగని తీరులో ఆయన ఢిల్లీలో వరుస ఉద్యమాలను నిర్వహించారు. అంతే కాదు దేశంలో పలు చోట్ల్ల విద్యార్ధులతో సదస్సులు నిర్వహించారు. ఇక కేంద్ర ఎన్నికల సంఘం మీద నిప్పులు కురిపించారు. ఏకంగా సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ని రాజీనామా చేయమంటూ డిమాండ్ చేశారు. ఈ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. మోడీ అమిత్ షాల మీద కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలా చూస్తే ఒక్కసారిగా దేశ రాజకీయం వేడెక్కిపోయింది. అంతలా హీట్ పెంచేసిన రాహుల్ గాంధీ సడెన్ గా విదేశీ విమానం ఎక్కి పర్యటనకు వెళ్లడం మీద చర్చ సాగుతోంది.
వియత్నాం టూర్ లో :
రాహుల్ గాంధీ వియత్నాం టూర్ కి వెళ్లారు అని అంటున్నారు. ఆయన గోవాలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం నేరుగా వియత్నాం కి వెళ్ళారని అంటున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన లేదా అధికారిక పర్యటన అన్నది అయితే తెలియడం లేదు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా దీని మీద ఎలాంటి ప్రకటన చేయలేదని అంటున్నారు. వియంత్నాంలో అధికారిక కార్యక్రమాలలో రాహుల్ గాంధీ పాల్గొంటారా అన్నది కూడా తెలియడం లేదని చెబుతున్నారు. ఏది ఏమైనా సడెన్ గా రాహుల్ గాంధీ విదేశీ టూర్ పెట్టుకోవడం మాత్రం జాతీయ స్థాయిలో చర్చగా ఉంది.
బీజేపీకి చాన్స్ :
రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల మీద ఎపుడూ అధికార బీజేపీ విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఆయన చెప్పా పెట్టకుండా టూర్స్ పెట్టుకుంటారని ఆయన విదేశీ గడ్డ మీద నుంచి భారత్ వ్యతిరేక విమర్శలు చేస్తూ ఉంటారని పలు మార్లు బీజేపీ నేతలు హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. తాజాగా రాహుల్ వియత్నాం పర్యటన నేపథ్యంలో కూడా బీజేపీ మళ్లీ విమర్శలు చేసింది. దేశంలో కీలకమైన సందర్భాలలో అలాగే రాజకీయంగా పరిస్థితులు తీవ్రంగా ఉన్నపుడల్లా రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చేయడం అలవాటుగా మారింది అని బీజేపీ నేతలు అంటున్నారు.
బయట పెట్టాల్సిందే :
రాహుల్ గాంధీ విదేశీ పర్యటన వివరాలను కాంగ్రెస్ పార్టీ బయట పెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆయనను విదేశాలకు ఎవరు ఆహ్వానిస్తున్నారో కూడా చెప్పాలని కమలం పార్టీ కోరుతోంది. పారదర్శకంగా ఉండాలంటే వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ ని బీజేపీ నాయకులు పట్టుబడుతున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ విదేశీ టూర్ మీద ప్రకటనలు చేయడంలేదు. మరి రాహుల్ గాంధీ వియత్నాం పర్యటన దేని కోసమో తెలియాల్సి ఉంది. ఆయన అక్కడ ఏ కార్యక్రమాలలో పాల్గొంటారో కూడా చూడాల్సి ఉంది. ఒకవేళ అక్కడి దేశ సంస్థలు ఆయన్ని ఆహ్వానించి ఉంటే ఆయన పాల్గొనే కార్యక్రమాలు కచ్చితంగా అంతర్జాతీయ మీడియా ద్వారా బయటకు వస్తాయని అంటున్నారు.
