రాహుల్ తో ఉన్న ఆ మహిళ ఎవరు? కేంద్ర మంత్రి ఆసక్తికర ట్వీట్!
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెకేషన్ టూర్ పై అధికార బీజేపీ షేర్ చేసిన ఒక ఫొటో వైరల్ అవుతోంది. విశ్రాంతి కోసం రాహుల్ గాంధీ ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లగా ఆయన పక్కన ఒక మహిళ, బాలుడు ఉన్నారు.
By: Tupaki Political Desk | 11 Aug 2026 6:24 PM ISTప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వెకేషన్ టూర్ పై అధికార బీజేపీ షేర్ చేసిన ఒక ఫొటో వైరల్ అవుతోంది. విశ్రాంతి కోసం రాహుల్ గాంధీ ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లగా ఆయన పక్కన ఒక మహిళ, బాలుడు ఉన్నారు. ఆ ఇద్దరికి అంతగా గుర్తింపు లేకపోవడం, ప్రతిపక్ష నేత పక్కన కూర్చున్న ఆ ఇద్దరూ ఎవరని ప్రశ్నిస్తూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ‘ఎక్స్’ ద్వారా ట్వీట్ చేశారు. విపక్ష నేతను ట్యాగ్ చేస్తూ ఆ ఇద్దరు ఎవరో తెలుసుకోవాలని ఉందని కేంద్ర మంత్రి ట్వీట్ చేయడంతో జాతీయ రాజకీయాల్లో ఒక్కసారి హాట్ టాపిక్ మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో అపరిచితులను కలుస్తుంటారని బీజేపీ ఎక్కువగా విమర్శలు చేస్తుంటుంది. దీనికి కొనసాగింపుగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తాజా ట్వీట్ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాహుల్ గాంధీ ఒక పడవలో ప్రయాణిస్తున్న ఫోటోను కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో రాహుల్ గాంధీ పక్కన ఒక మహిళ హెడ్ స్కార్ఫ్, సన్ గ్లాసెస్ ధరించి ఉండగా, మధ్యలో ఒక బాలుడు కూర్చుని ఉన్నారు. ఈ ఫోటోను ఉద్దేశించి గిరిరాజ్ సింగ్, ‘రాహుల్ జీ, ఈ ఫోటో ఎక్కడ తీశారు? ఎప్పుడు తీశారు? మీతో ఉన్న ఈ వ్యక్తులు ఎవరు? తెలుసుకోవాలని ఉంది.’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తన పర్యటనల్లో ఎవరిని కలుస్తున్నారు, ఎందుకు రహస్యంగా ఉంటున్నారనే అంశాన్ని హైలెట్ చేసేలా బీజేపీ ఈ ఫొటోను వాడుకుందని చెబుతున్నారు.
ఇక కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ట్వీటుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ స్పందిస్తూ, ఆ ఫోటోలో ఉన్నది రాహుల్ గాంధీ స్నేహితుడి భార్య, కుమారుడు అని, వారు కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉన్నారని స్పష్టం చేశారు. ‘ఒక పురుషుడు, స్త్రీ కలిసి ఉన్న ఫోటోను చూసి అసభ్యకరమైన ఆలోచనలు చేసేంత నీచమైన మనస్తత్వం మీది. మీ నిరాశ, అసహనం మీ మాటల్లో కనిపిస్తోంది’ అంటూ కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ కేంద్రమంత్రిపై మండిపడ్డారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ అవి దండియా స్పందిస్తూ, ఈ ఫోటో టెక్సాస్‌లోని 'లేక్ రే రాబర్ట్స్' వద్ద తీసినదని, దీని నిజానిజాలు గిరిరాజ్ సింగ్ స్వయంగా తెలుసుకోవచ్చని సవాలు విసిరారు.
ఇలాంటి ఆరోపణలు, విమర్శల ద్వారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలను విస్మరించి, తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్లడాన్ని ఎత్తిచూసేలా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని అంటున్నారు. గతంలో రాహుల్ చేసిన 54 విదేశీ పర్యటనలపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, వాటికి నిధులు ఎవరు ఇస్తున్నారని, ఆయన ఎవరిని కలుస్తున్నారని ప్రశ్నించిందని గుర్తు చేస్తున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉండి కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆయన రాజకీయ విశ్వసనీయతను దెబ్బతీయడమే బీజేపీ వ్యూహంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
