అదిగో 'ద్రోహి' వస్తున్నాడు: కేంద్ర మంత్రిపై రాహుల్ వ్యాఖ్యలు
రాజకీయాల్లో హద్దులు దాటడం ప్రాంతీయ పార్టీలకే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ చోటు చేసుకుంటున్నారు.
By: Garuda Media | 4 Feb 2026 5:00 PM ISTరాజకీయాల్లో హద్దులు దాటడం ప్రాంతీయ పార్టీలకే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ చోటు చేసుకుంటున్నారు. పార్లమెంటు వేదికగానే `అరె యార్`.. `ఖాముష్` అంటూ.. తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇవి మరింత హద్దులు మీరాయి. పార్లమెంటు ముందు.. ధర్నా చేస్తున్న రాహుల్‌గాంధీ.. బుధ వారం కేంద్రమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ సైనికాధ్యక్షుడు జనరల్ నరవణే.. రాసిన పుస్తకంలో చైనాతో వివాదం నేపథ్యంలో ప్రధాని మోడీ చేతులు ఎత్తేశారని.. వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపైనే కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావే శాల్లో ఈ పుస్తకం(ప్రచురితం కాలేదని బీజేపీ నాయకులు అంటున్నారు. ప్రచురించారని పుస్తకాలతో సహా రాహుల్‌గాంధీ వచ్చారు) గురించిన చర్చే కీలకంగామారింది. ఇరు పక్షాల మధ్య మాటల తూటాలు కూడా పేలుతున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంటు ముందు కాంగ్రెస్ నేతలు.. ధర్నాకు దిగారు. ఇదిలావుంటే.. ఈ సమయంలో కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు(గతంలో కాంగ్రెస్‌లో ఉండేవారు. ప్రస్తుతం బీజేపీనేత) అటుగా వస్తూ.. పార్లమెంటులోకి వెళ్తున్నారు.
ఈయనను చూసిన రాహుల్‌గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ``అదిగో అటు చూడండి.. ఓ ద్రోహి నడుచు కుంటూ వస్తున్నాడు`` అన్నారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు.. సదరు కేంద్ర మంత్రి వైపు చూస్తూ.. అవహేళ నగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. రాహుల్ ఆయన దగ్గరకు వెళ్లి.. ``విష్ యూ ద్రోహి స్నేహితుడా`` అని కరచాలనం చేయబోయారు. అయితే.. సదరు కేంద్ర మంత్రి చిరు నవ్వు నవ్వుతూ.. ``మీరే అసలైన ద్రోహులు. దేశానికి ద్రోహం చేస్తున్నారు`` అని వ్యాఖ్యానించారు.
ఈ సమయంలో రాహుల్ నవ్వుతూ.. ఎప్పటికైనా నువ్వు కాంగ్రెస్ లోకి తిరిగి రావాల్సిందే.. అని వ్యాఖ్యానించగా.. అది ఎప్పటికీ జరగదంటూ.. ఆయన లోపలికి వెళ్లిపోయారు. అయితే.. రాహుల్ చేసిన వ్యాఖ్యలను జాతీయ మీడియా సహా.. పరిశీలకులు... మేధావులు కూడా తీవ్రంగా తప్పుబట్టారు. ఒక కేంద్ర మంత్రిని ద్రోహి అని అనడం ద్వారా రాహుల్ తన ఔన్నత్యాన్ని మరిచిపోయారని.. ఆయనను లోక్‌సభ నుంచి అనర్హుడిని చేసే అవకాశం ఉందని హెచ్చరించారు.
