Begin typing your search above and press return to search.

ఢిల్లీలో టెన్షన్.. చెన్నైలో అటెన్షన్ : రాహుల్, సీఎం విజయ్ కీలక భేటీ

విద్యార్థులతో సమావేశం నిమిత్తం చెన్నై వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుగా సీఎం విజయ్ నివాసానికి వెళ్లారు.

By:  Tupaki Political Desk   |   10 Oct 2026 10:22 PM IST
ఢిల్లీలో టెన్షన్.. చెన్నైలో అటెన్షన్ : రాహుల్, సీఎం విజయ్ కీలక భేటీ
X

దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు హల్ చల్ చేస్తున్న వేళ మొత్తం దేశ రాజకీయాలు అన్నీ అటువైపు కేంద్రీకృతం కాగా, కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తమిళనాడులో ప్రత్యక్షమయ్యారు. ‘‘ఛాత్రోస్ కీ గూంజ్’’ (విద్యార్థుల ప్రతిధ్వని) పేరిట ముందస్తుగా ఖరారు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ చెన్నై వచ్చారు. ఈ పర్యటనలో ఆయన ముఖ్యమంత్రి దళపతి విజయ్ తో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపింది. ఇద్దరి మధ్య సుమారు గంటన్నపాటు చర్చలు జరిగాయి. సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్న వేళ ఇద్దరు ముఖ్య నేతల సమావేశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు.

విద్యార్థులతో సమావేశం నిమిత్తం చెన్నై వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందుగా సీఎం విజయ్ నివాసానికి వెళ్లారు. నగరంలోని నీలాంకరైలో ఉన్న తన నివాసానికి రాహుల్ రావడంతో సీఎం దళపతి సాదర స్వాగతం పలికారు. ఇద్దరు అనేక అంశాలపై చర్చించిన అనంతరం వెలుపలికి వచ్చి సమీపంలో ఉన్న కేప్ కి వెళ్లారు. అక్కడ కాఫీ, తిరమిసు, కుకీస్ రుచి చూశారు.కేప్ లో ఇద్దరు నేతలు అభిమానులతో మాట్లాడుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇద్దరు ముఖ్యనేతలు ఇలా ఒక కేఫ్ లో సాధారణ కస్టమర్లు మాదిరిగా రావడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బలపడుతున్న బంధం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి దళపతి మధ్య తాజా భేటీ రెండు పార్టీల మధ్య బంధం బలపడుతున్న సంకేతాలిస్తోందని అంటున్నారు. గత ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ డీఎంకే కూటమితో కలిసి పోటీ చేయగా, దళపతి విజయ్ పార్టీ టీవీకే సింగిల్ గా పోటీ చేసింది. అయితే ఎన్నికల అనంతరం టీవీకే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించగా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు కూడగట్టే క్రమంలో కాంగ్రెస్ తో చేతులు కలిపింది. ఆ తర్వాత తమిళనాడులో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగ్గా, ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీకే వదిలేశారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సఖ్యత పెరుగుతున్న సంకేతాలు వెలువడుతుండగా, ఆ మధ్య దేశ ప్రధాని అభ్యర్థిగా విజయ్ కి 9 శాతం ప్రజలు మద్దతు ఇస్తున్నారనే ప్రచారం రెండు పార్టీల మధ్య గ్యాప్ తీసుకువచ్చిందని అంటున్నారు. అయితే, ఈ విషయంలో కాంగ్రెస్ సంయమనం పాటించడంతో అప్పట్లో వివాదం సమసిపోయింది. ఇక తాజాగా రాహుల్, విజయ్ భేటీ తర్వాత రెండు పార్టీల మధ్య సంబంధాలు సజావుగా ఉన్నట్లుగా సంకేతాలు అందుతున్నాయని అంటున్నారు.

ఇద్దరు ప్రధాన అభ్యర్థుల భేటీ : డీఎంకే ట్వీట్

కాగా, రాహుల్, సీఎం విజయ్ భేటీపై ప్రతిపక్షం డీఎంకే వ్యంగ్యాస్త్రాలు సంధించింది. చెన్నైలో ఇద్దరు పీఎం అభ్యర్థులు కలుసుకుంటున్నారని ఆ పార్టీ ఎంపీ దయానిధి మారన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. సీఈసీ రాజీనామా డిమాండ్ తో ఢిల్లీలో ఆందోళన చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అరెస్టు కాగా, సీఎం విజయ్ ఆ అరెస్టును ఖండిస్తూ ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ లో ఆయన నేరుగా బీజేపీని విమర్శించకపోవడంపై డీఎంకే ఎత్తి చూపింది. రాహుల్ అరెస్టు విషయంలో సీఎం విజయ్ చేసిన ట్వీట్ పై మారన్ తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయమై సీఎం విజయ్ బహిరంగంగా మాట్లాడకపోవడం, బీజేపీ అనే పదం లేకుండా ఓదార్పునిచ్చే పదాలతో అస్పష్టంగా అత్యంత సాధారణంగా ట్వీట్ చేశారని ఇది చూశాక తన అనుమానాలు నిజమయ్యాయని మారన్ దెప్పిపొడిచారు. సీఎం విజయ అత్యంత తెలివిగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తనతో ఉంచుకోడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.