Begin typing your search above and press return to search.

బీహార్ దంగల్ : కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే ?

బీహార్ దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రంగా ఉంది. హిందీ బెల్ట్ లో ఉన్న ఈ రాష్ట్రం ఉత్తరాదిన రాజకీయంగా ప్రాముఖ్యత కలిగినది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.

By:  Satya P   |   7 Oct 2025 8:00 AM IST
బీహార్ దంగల్ : కొత్త ముఖ్యమంత్రి ఎవరంటే ?
X

బీహార్ దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రంగా ఉంది. హిందీ బెల్ట్ లో ఉన్న ఈ రాష్ట్రం ఉత్తరాదిన రాజకీయంగా ప్రాముఖ్యత కలిగినది అని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా చేయూతను ఇచ్చి గాంధీ నెహ్రూ కుటుంబాలను కేంద్రంలో అధికారంలో ఉండేలా చూసిన రాష్ట్రాలలో బీహార్ అద్వితీయమైన పాత్ర పోషించింది. ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రెండు రాష్ట్రాలలో కలిపి మొత్తం 123 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే మొత్తం లోక్ సభ సీట్లలో 28 శాతం అన్న మాట. ఈ రెండు రాష్ట్రాలను పట్టుకుంటే చాలు ఢిల్లీ పీఠం తమదే అని ప్రతీ జాతీయ పార్టీ భావిస్తుంది.

కాంగ్రెస్ కి దూరం :

ఇక రాజకీయ చరిత్ర చూస్తే కాంగ్రెస్ ఈ రెండు రాష్ట్రాలలో కోలుకోలేని దెబ్బ తిన్నది మండల్ కమండల్ ఉద్యమాల మధ్యనే. బీజేపీ రామజన్మ భూమి ఉద్యమం చేయడం ద్వారా అగ్ర వర్ణాలు ఇతర వర్గాలలో బలం సంపాదించుకుంటే మండల్ ఇష్యూతో మధ్యేవాద పార్టీలు అయిన ఎస్పీ ఆర్జేడీ బీఎస్పీ వంటివి పాగా వేశాయి. దాంతో కాంగ్రెస్ కి 1989 నుంచి ఈ రెండు రాష్ట్రాలలో ఉనికి పోరాటమే శరణ్యం అయింది. యూపీలో ఎస్పీతో కలసి సబ్ జూనియర్ పార్టీగా ఉంటోంది. బీహార్ కి వస్తే ఆర్జేడీ తో కలసి జూనియర్ పార్టనర్ గా తన ఉనికి చాటుకుంటోంది.

దేశ దశను మార్చేలా :

అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఒక విషయం స్పష్టంగా గుర్తించారు. యూపీ బీహార్ లలో కాంగ్రెస్ దశ తిరగకుండా దేశంలో కాంగ్రెస్ కి ఎప్పటికీ అధిక ఎంపీ సీట్లు రావని, అందుకే ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టగా తీసుకున్నారు. చాలా కాలం నుంచే తెర వెనక వర్క్ స్టార్ట్ చేశారు. తనకు నమ్మకమైన నాయకులను బీహార్ కి పంపించి సామాజిక రాజకీయ కోణంలో వివిధ సమీకరణలను అంచనా కట్టారు. ఓబీసీ ఉద్యమం కూడా అందులో భాగమే. అలాగే ఓటర్ అధికార యాత్రతో చాలా వర్గాలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నం చేశారు. ఈసారి బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ కూడా ముఖ్య పాత్ర పోషించాలన్నది రాహుల్ ఆలోచన. తద్వారా వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి బలం పుంజుకుని గణనీయమైన ఎంపీ సీట్లు సాధిస్తే కనుక జాతీయ స్థాయిలో బీజేపీ తగ్గిపోతుంది. తమకు మంచి అవకాశాలు ఉంటాయని రాహుల్ ప్లాన్ చేశారు.

మహా ఘట్ బంధన్ జోరు :

ఇక చూస్తే కనుక మహా ఘట్ బంధన్ జోరు అయితే బీహార్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా యూత్ లో రాహుల్ అండ్ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఫీవర్ స్టార్ట్ అయింది అని అంటున్నారు. అదే సమయంలో మైనారిటీ వర్గాల బలం ఈ ఘట్ బంధన్ కి దక్కడం కూడా విశేషంగా ఉంది. దాంతో ఈసారి ఎన్నికల్లో గెలిచేస్తామన్న ధీమా అయితే మహా ఘట్ బంధన్ లో కనిపిస్తోంది. గతంలోనే అత్యధిక సీట్లు సాధించిన ఆర్జేడీ ఈసారి వంద మార్క్ ని సొంతంగా సాధిస్తామని ధీమాగా ఉంది. కాంగ్రెస్ కూడా అత్యధిక సీట్లలో పోటీకి సిద్ధపడుతోంది.

నితీష్ గ్రాఫ్ ఏంటి :

బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కి యాంటీ ఇంకెంబెన్సీ ఉంది అని అంటున్నారు. ఆయన సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉండడం వల్లనే ఇది జరిగింది అని అంటున్నారు. కొత్త ముఖాన్ని ఎన్డీయే తీసుకుని వస్తే బాగుండేది అన్న చర్చ ఉంది. అయితే జేడీయూకు కోపం వస్తుందని బీజేపీ ఎన్నికల దాకా నితీష్ ఫేస్ తోనే పోవాలని అనుకుంటోంది అంటున్నారు. నితీష్ కుమార్ కి రిటైర్మెంట్ ఇచ్చేస్తారు అని మరో వైపు ఆర్జేడీ విస్తృతమైన స్థాయిలో ప్రచారం చేస్తోంది. అంతే కాదు ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని విమర్శిస్తోంది. బీజేపీ ప్లస్ జేడీయూ మ్యాజిక్ 2020లో అధికారాన్ని కట్టబెట్టింది. ఈసారి సాధ్యమేనా అంటే హోరా హోరీ పోరు మాత్రం ఖాయమనే జవాబు వస్తోంది.

మార్పు తప్పదా :

బీహార్ లో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు అని ప్రీ పోల్ సర్వేలు అయితే తెలియచేస్తున్నాయి. బీహార్ లో ఎంపీ ఎన్నికల్లో ఎన్డీయే కి మద్దతు ఇచ్చిన జనాలు ఈసారి కనుక మహా ఘట్ బంధన్ వైపు చూస్తే కనుక చాలా మార్పులు వచ్చేస్తాయని అంటున్నారు. తేజస్వి యాదవ్ ఫ్రెస్ ఫేస్ కావడం గతంలో ఓటమి చెందారు అన్న సానుభూతి ఉంది, ఆయన వస్తే ఏమి చేస్తారో అన్న కుతూహలం వంటివి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని చెబుతున్నారు. నితీష్ విషయం అయితే ఆయన అనుభవం సమర్ధత నిజాయతీ వంటివి ప్లస్ పాయింట్లుగా ఉన్నాయి. అయితే ఏడున్నర పదుల వయసులో ఉన్న నితీష్ ఎన్డీయే కూటమి సీఎం అభ్యర్ధిగా ఉండగా మూడున్నర పదుల వయసు కలిగిన యువ నేత తేజస్వి యాదవ్ మహా ఘట్ బంధన్ సీఎం అభ్యర్థిగా ఉన్నారు. ఈ రకమైన పోలిక కనుక జనాల్లో ఉంటే మాత్రం అనూహ్యమైన ఫలితాలే వస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా అనుక్షణం ఉత్కంఠ భరితంగా బీహార్ ఎన్నికలు సాగనుందని అంటున్నారు.