బ్యాట్ పట్టుకోలేని వ్యక్తి ప్రపంచ క్రికెట్ చీఫా?
భాగల్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, ప్రస్తుత ఐసీసీ (ICC) ఛైర్మన్ జై షాపై విమర్శల దాడి చేశారు.
By: A.N.Kumar | 8 Nov 2025 3:51 PM ISTబీహార్‌లో రెండో దశ ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాక, క్రికెట్ అభిమానుల్లోనూ పెద్ద చర్చకు దారితీశాయి.
అమిత్ షా కుమారుడే లక్ష్యంగా రాహుల్ పంచ్
భాగల్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుమారుడు, ప్రస్తుత ఐసీసీ (ICC) ఛైర్మన్ జై షాపై విమర్శల దాడి చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యల సారాంశం ఒక్కటే "క్రికెట్ నైపుణ్యం లేకపోయినా, కేవలం రాజకీయ పలుకుబడితోనే జై షా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నారు." అని విమర్శించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ... “మీరు అదానీ, అంబానీ లేదా అమిత్ షా కొడుకు అయితేనే ఈ దేశంలో పెద్ద కలలు కనగలరు. అమిత్ షా కుమారుడు జై షాకు బ్యాట్ పట్టుకోవడమే తెలియదు, పరుగెత్తడం మర్చిపోండి. కానీ ఆయన ఇప్పుడు ప్రపంచ క్రికెట్ చీఫ్. క్రికెట్‌లో ప్రతి వ్యవహారాన్ని ఆయన నియంత్రిస్తున్నాడు. ఎందుకంటే డబ్బు కారణంగా!” అని ఘాటుగా విమర్శించారు.
* వివాదాలకు కేంద్ర బిందువు: జై షా పదవులు
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అంశం జై షా పదవుల పరంపర. ప్రస్తుతం జై షా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన గత ఏడాది డిసెంబర్‌లో ఈ అత్యున్నత పదవిని చేపట్టారు. అంతకుముందు ఆయన బీసీసీఐ (BCCI) కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా కూడా 2021 నుంచి 2024 వరకు కొనసాగారు.
క్రికెట్ నైపుణ్యం లేదా క్రీడా నేపథ్యం పెద్దగా లేకపోయినా, జై షా అనతికాలంలోనే ప్రపంచ క్రికెట్‌లోని అత్యున్నత పదవులకు చేరడం రాజకీయ సంబంధాల వల్లేనని ప్రతిపక్షాలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. రాహుల్ గాంధీ ఈ ఎన్నికల వేళ ఆ అంశాన్నే బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు.
* బీహార్ ఎన్నికల ప్రచారంలో వేడి
బీహార్ రెండో దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఈ కీలక సమయంలో రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో అసంతృప్తిని పెంచగా, కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.
కుటుంబ రాజకీయాలు, రాజకీయ పలుకుబడి వంటి అంశాలను టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ చేసిన ఈ 'పంచ్'లు బీహార్ ఎన్నికల ప్రచారంలో కొత్త చర్చకు, మరింత రాజకీయ వేడికి కారణమయ్యాయి. ఈ అంశం ఓటర్లపై ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
ఈ అంశంపై జై షా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఆయన పేరు.. ఈ వివాదం ట్రెండింగ్‌లో ఉన్నాయి.
