హాట్ టాపిక్ : మోడీ వారసుడిని రెడీ చేస్తున్నారా ?
ఆయనకు ప్రజలలో ఉండే ఆకర్షణ అలాగే ఆయన వ్యూహాలు ఆయన చేసే ప్రసంగాలు సొంత కుటుంబం లేకపోవడం అవినీతికి వ్యతిరేకం అన్న ఇమేజ్ ఇవన్నీ ఆయనకు రక్షణ కవచాలు
By: Satya P | 20 Aug 2026 5:00 PM ISTప్రధాని నరేంద్ర మోడీ బీజేపీలో అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఆయనకు ప్రజలలో ఉండే ఆకర్షణ అలాగే ఆయన వ్యూహాలు ఆయన చేసే ప్రసంగాలు సొంత కుటుంబం లేకపోవడం అవినీతికి వ్యతిరేకం అన్న ఇమేజ్ ఇవన్నీ ఆయనకు రక్షణ కవచాలు. ఏ ప్రధానికీ లేనంత ఆదరణ ఆయనకు దేశ ప్రజలు ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలీ అంటే తమ ఇంట్లో మనిషిగా ఆయనను భావించారు. మోడీ సైతం దేశం కోసమే తన జీవితం అంకితం అని చెబుతూ వచ్చారు. ఆ విధంగా 2013 లో ఎన్డీయే తరఫున ప్రధాని అభ్యర్ధిగా దేశ రాజకీయాల్లోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ రోజు వరకూ తిరుగులేని నేతగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే మోడీ ప్రభ తగ్గిపోతోంది అని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడమే అందుకు ఉదాహరణ అని చెబుతున్నారు.
ఇటీవల సంఘటనలతో :
ఇక ఇటీవల విద్యార్ధులు చేపట్టిన ఆందోళనలు జంతర్ మంతర్ వద్ద రోజుల తరబడి జెన్ జీ యువత భారీ నిరసనలు దాని ఫలితంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం ఇవన్నీ కూడా బీజేపీకి ప్రత్యేకించి మోడీకి ఇబ్బందిగా మారాయని అంటున్నారు. ఆ తరువాత కూడా యువత కేంద్ర పాలకుల పట్ల తన అసహనాన్ని అలా కొనసాగిస్తూనే ఉండడం కూడా ఎన్డీయే ప్రభుత్వానికి రెడ్ సిగ్నల్స్ కిందనే లెక్క అని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జరిగిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో కాంగ్రెస్ పై చేయి సాధించినట్లుగా అనిపించింది. బీజేపీ ఆమోదించుకోవాలనుకున్న బిల్లులు డీ లిమిటేషన్, మహిళా బిల్లు లాంటివి వెనక్కి వెళ్ళాయి. ఇది కూడా బీజేపీకి గతంలో ఎన్నడూ జరగని చూడని అనుభవమే అని అంటున్నారు.
రాహుల్ సంచలన వ్యాఖ్యలు :
ఇదిలా ఉంటే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోడీని గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా ప్రచారం అవుతోంది. కాంగ్రెస్ అత్యున్నత విధాయక మండలి సీడబ్ల్యూసీలో రాహుల్ గాంధీ మోడీ రాజకీయం ముగింపునకు వచ్చింది అని వ్యాఖ్యానించారు అని అంటున్నారు. మోడీకి దేశ ప్రజలు ఇచ్చిన సమయం అయిపోయింది అని కూడా రాహుల్ అన్నారు. ఆయన పరిపాలన కూడా దాదాపుగా చివరి దశకు చేరింది అని రాహుల్ వ్యాఖ్యానించడం విశేషం. మోడీ నిర్ణయాల మీద ఎన్డీయే పాలన పట్ల జనంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని రాహుల్ అన్నట్లుగా చెబుతున్నారు. సరిగ్గా ఇదే సమయం అని కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు అని అంటున్నారు.
మోడీ వారసుడి ఎంపిక :
మోడీకి వారసుడిని వెతికే పనిలో బీజేపీ నాయకత్వం నిమగ్నమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో వ్యాఖ్యానించారని చెబుతున్నారు. ప్రధాని మోదీ స్థానంలో మరొకరిని ఎంపిక చేసే ప్రక్రియ లేదా చర్చలు బీజేపీలో తెర వెనుక జోరుగా జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మరి రాహుల్ గాంధీ చేసిన ఆ వ్యాఖ్యల వెనక ఆయనకు ఉన్న సమాచారం ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. మోడీ ఈ రోజుకు ప్రధానిగా ఉన్నారు. ఆయన చేతిలో ఇంకా మూడేళ్ల దాకా అధికారం ఉంది. 2029లో ఒక వేళ బీజేపీ ఓడితే అపుడు మోడీ పక్కకు తప్పుకుంటారు అన్నది అయితే ఉంది. అలా కాకుండా ఇంతలోనే మోడీని మార్చి బీజేపీ ఏమి చేస్తుంది అన్నది కూడా మరో చర్చ. ఏది ఏమైనా రాహుల్ గాంధీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చేశారు అని ప్రచారంలో ఉన్న ఈ వ్యాఖ్యలు అయితే రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి.
