Begin typing your search above and press return to search.

లోక్‌సభను షేక్ చేసిన రాహుల్.. సభలో రచ్చ రచ్చ

ముఖ్యంగా కేంద్ర మంత్రులను ఉద్దేశించి రాహుల్ పరుష పదాన్ని ప్రయోగించారని అధికార కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు.

By:  Tupaki Political Desk   |   30 July 2026 1:09 AM IST
లోక్‌సభను షేక్ చేసిన రాహుల్.. సభలో రచ్చ రచ్చ
X

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ముఖ్యంగా నీట్ పేపరు లీకేజీకి నిరసనగా కాక్రోచ్ పార్టీ నేతృత్వంలో యువత నిర్వహించిన ఆందోళనలు ఉభయసభలను కుదిపేస్తున్నాయి. పరీక్షలలో అక్రమాల నిరోధానికి సంబంధించిన బిల్లును బుధవారం లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీజేపీ ఆందోళన విరమణ సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ రూపకల్పన చేసింది. బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా కేంద్ర మంత్రులను ఉద్దేశించి రాహుల్ పరుష పదాన్ని ప్రయోగించారని అధికార కూటమి ఎంపీలు ఆందోళనకు దిగారు. సభలో ఇరుపక్షాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

లోక్‌సభలో విద్యార్థుల సమస్యపై మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు బల ప్రయోగం చేయడం, లాఠీచార్జీలను ఆయన ప్రస్తావించారు. అయితే, ఈ చర్చ సమయంలో రాహుల్ గాంధీ ఉపయోగించిన ఒక పదం సభలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఆ పదం కారణంగా సభ కాసేపు పూర్తిగా స్తంభించిపోయింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార కూటమి ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశ గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వెంటనే దేశ ప్రజలకు, సభకు క్షమాపణ చెప్పాలని అధికార పక్ష సభ్యులు పట్టుబట్టడంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రధానంగా విపక్ష నేత విమర్శలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అయినప్పటికీ రాహుల్ గాంధీ వెనక్కి తగ్గలేదు. తాను ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నానో వివరణ ఇస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను స్వయంగా ఆ పదాన్ని అనలేదని, పోలీసుల చర్యలతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదనతో వ్యక్తం చేసిన అభిప్రాయంగా మాత్రమే తాను ఆ మాటను సభలో చెబుతున్నానని స్పష్టం చేశారు. బాధితుల గొంతును తాను సభ దృష్టికి తీసుకువస్తున్నానని పేర్కొనడంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. స్పీకర్ వారించినప్పటికీ గందరగోళం తగ్గకపోవడంతో సభ పలుమార్లు వాయిదా పడింది.

ఉద్రిక్త వాతావరణంలో బిల్లు ఆమోదం

సభలో సభ్యుల నిరసనలు, వాగ్వాదాలతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండగా, కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లును ఆమోదింపజేసుకుంది. పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలను నిరోధించేందుకు ఉద్దేశించిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రెవెన్షన్ ఆఫ్ అన్‌ఫేర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు'ను లోక్‌సభ మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచేందుకు, అక్రమాలకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు విధించే నిబంధనలతో కూడిన ఈ బిల్లును ఆందోళనల మధ్యే సభలో గ్రీన్ సిగ్నల్ లభించింది.