రాహుల్ రాజకీయ పరిణతి...ఆయనే దోస్త్ అంటూ !
రాహుల్ గాంధీ రాజకీయంగా పరిణతి సాధించారు అని అంటున్నారు. ఆయన రాజకీయం నాటికీ నేటికీ చాలా తేడా ఉందని దగ్గరుండి చూసిన వారు చెబుతారు.
By: Satya P | 20 Jun 2026 7:00 AM ISTరాహుల్ గాంధీ రాజకీయంగా పరిణతి సాధించారు అని అంటున్నారు. ఆయన రాజకీయం నాటికీ నేటికీ చాలా తేడా ఉందని దగ్గరుండి చూసిన వారు చెబుతారు. యువకుండిగా రాజకీయ ప్రవేశం చేసిన రాహుల్ ఇపుడు 56 నిండిన పరిపక్వమైన మనిషిగా తాజా పుట్టిన రోజుని జరుపుకున్నారు. గతంలో ప్రతీ దానిని లైట్ తీసుకునే రాహుల్ ఇపుడు మాత్రం అన్నీ ఆలోచించి మరీ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. విపక్షంలో ఉండడం ఆయనకు శిక్ష కాదు రాజకీయంగా అతి పెద్ద శిక్షనాలయంగా మారింది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.
కటీఫ్ అన్న స్టాలిన్ తో :
ఇక తమిళనాడులో డీఎంకే పార్టీ బలంగా ఉందని పొత్తులు పెట్టుకుని రెండున్నర దశాబ్దాలుగా కలసి పనిచేసింది కాంగ్రెస్. అయితే గత నెలలో టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించడంతో సీట్లు తక్కువ పడితే కాంగ్రెస్ చేతులు కలిపి సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఇది రాహుల్ తీసుకున్న గ్రేట్ మూవ్ అని అంతా అన్నారు. అయితే అదే సమయంలో డీఎంకే మాత్రం దూరం జరిగింది. కాంగ్రెస్ మోసం చేసింది అంటూ విమర్శించింది. ఇండియా కూటమి నుంచి వేరుగా చూడాలని స్పీకర్ కి లేఖ రాసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి కూడా డుమ్మా కొట్టింది. అంతటితో ఆగిందా అదీ లేదు, డీఎంకే అధికార పత్రిక మురసోలిలో రాహుల్ గాంధీని పరిపక్వత లేదని కూడా విమర్శించింది. ఇవన్నీ ఇలా ఉండగానే రాహుల్ గాంధీ బర్త్ డే వచ్చింది. దానికి స్టాలిన్ గ్రీట్ చేస్తే థాంక్యూ ని రెస్పాండ్ అయిన రాహుల్ గాంధీ కలసి సాగుదామని చేసిన ట్వీట్ ఇపుడు రాజకీయంగా వైరల్ గా మారుతోంది.
ఆసక్తిని పెంచుతూ :
డీఎంకే అయితే దూరం జరిగింది. రాహుల్ గాంధీ మీద నిప్పులు చెరుగుతోంది. అయినా సరే రాహుల్ మాత్రం స్టాలిన్ తన దోస్త్ అనే అంటున్నారు. కలసి పోరాడుదామని కూడా పిలుపు ఇస్తున్నారు. ‘భారతదేశం అనే భావనను, రాజ్యాంగాన్ని, సమాఖ్య వ్యవస్థను పరిరక్షించాలనే ఉమ్మడి సంకల్పమే మనకు మార్గదర్శకం. ఇందులో విజయం సాధించే వరకు కలిసి పోరాడదాం’ అని రాహుల్ గాంధీ ఆహ్వానించడమే అసలైన కొసమెరుపు అని అంటున్నారు.
ఎన్డీయే కన్ను గీటుతున్న వేళ :
ఒక వైపు ఇండియా కూటమికి దూరంగా జరిగిన స్టాలిన్ ని ఎన్డీయే మరో వైపు కన్ను గీటుతోంది. తమతో కలవమని పరోక్ష సంకేతాలు పంపిస్తోంది అని అంటున్నారు. అంతే కాదు ఎన్డీయేలోకి డీఎంకే వస్తే ఇండియా కూటమి మరింత వీక్ అవుతుందని కూడా ఎత్తుగడలు వేస్తోంది. ఈ కీలక సమయంలో డీఎంకే కాంగ్రెస్ మరి ఇక కలిసేది ఉండదని కూడా అంతా భావిస్తున్న వేళ రాహుల్ వేసిన ట్వీట్ మాత్రం ఆసక్తిని పెంచేలాగానే ఉంది అని అంటున్నారు. పైగా రాహుల్ రాజకీయ పరిణతిని అది చాటుతోంది అని అంటున్నారు. రాహుల్ అయితే తనను గట్టిగా విమర్శిస్తున్న డీఎంకేని పట్టించుకోరు అనే అంతా అనుకుంటారు. రాహుల్ గాంధీ అలాంటి మనస్తత్వం తోనే ఉంటారు అని కూడా భావించే వారు ఉన్నారు. కానీ దానిని భిన్నంగా ఆయన ఈ రకమైనా ట్వీట్ చేశారు అంటే రాహుల్ నాయకుడిగా మరో మెట్టు ఎక్కినట్లే అంటున్నారు. 2029 కి ఇంకా మూడేళ్ళ దాకా సమయం ఉంది. రాహుల్ కొత్త మిత్రులనే కాదు పాత్ర మిత్రుల చేయిని కూడా విడవకుండా ముందుకు సాగితే దేశ రాజకీయాలలో కీలకమైన పరిణామాలే చోటు చేసుకుంటాయని అంటున్నారు.
