రాహుల్ సిద్ధం...సీటు ఎంత దూరం ?
కాంగ్రెస్ అగ్ర నేత గాంధీల వంశంలో అయిదవ తరానికి చెందిన వారు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇలా అనేక విశేషణాలు రాహుల్ గాంధీ పేరు ముందు పెట్టాల్సిందే.
By: Satya P | 3 March 2026 9:13 AM ISTకాంగ్రెస్ అగ్ర నేత గాంధీల వంశంలో అయిదవ తరానికి చెందిన వారు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇలా అనేక విశేషణాలు రాహుల్ గాంధీ పేరు ముందు పెట్టాల్సిందే. రాహుల్ గాంధీ రాజకీయ జీవితం దాదాపుగా 22 ఏళ్ళు దాటింది. అయిదు సార్లు ఆయన ఎంపీగా గెలిచారు. యూపీఏ వన్ యూపీయే టూ ప్రభుత్వాలలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
అదే పెద్ద ఊరట :
కానీ కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదు. అలాగే ప్రధాని కావాలనుకున్నా చిటికలో పని. కానీ నాడు వద్దు అనుకున్నారు. 2014 నుంచి 2024 దాకా మూడు సార్లు వరుస ఓటములు కాంగ్రెస్ ని పట్టి పీడిస్తున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ మార్క్ ని అందుకోకపోవడం కాంగ్రెస్ సీట్ల నంబర్ వందకు చేరువ కావడం అతి పెద్ద ఊరట. అయితే ఈ మధ్యలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటములు అందుకుంటూ వచ్చింది. అయినా 2029 ఎన్నికల మీద కాంగ్రెస్ ఆశలు పదిలంగానే ఉన్నాయి. ఎందుకు అంటే లోక్ సభ ఎన్నికలు వేరు అన్నది ఆలోచనగా ఉంది. అలాగే బీజేపీకి 2024లో వచ్చిన ఎంపీ సీట్ల కంటే మరింత తగ్గుతాయని ఎన్డీయే మిత్రులు కూడా మనసు మార్చుకుంటారు అని అదే విధంగా కాంగ్రెస్ కి సీట్లు పెరుగుతాయని లెక్కలు ఉన్నాయి. దానికి కారణం వరుసగా మూడు సార్లు అధికారంలో ఉన్న బీజేపీ మీద వ్యతిరేకత బాగా ఉంటుంది అన్నదే కాంగ్రెస్ మార్క్ విశ్లేషణ.
ప్రధానికి రెడీ :
నేను ప్రధాని కావడానికి రెడీ అని రాహుల్ గాంధీ తొలిసారి బాహాటంగా అంగీకరించారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ సమావేశం వేదిక మీద. తెలంగాణాలో ఒక రోజు పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీని ఉద్దేశించి డీసీసీ సమావేశంలో సీఎం రాహుల్ గాంధీ అన్న మాటలకు ఆయన తలూపుతూ ఓకే అని చెప్పేశారు. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావడం అవసరం. అందువల్ల రాహుల్ ప్రధాని కావాలి అని రేవంత్ రెడ్డి సభా ముఖంగా కోరారు. దానికి రాహుల్ వేదిక మీద నుంచే తలూపుతూ మోడీతో యుద్ధానికి సిద్ధం అని ప్రకటించడంతో క్యాడర్ లో అయితే జోష్ పూర్తి స్థాయిలో వచ్చింది అని అంటున్నారు.
పీఠం చేరుకోవడానికి :
కాళ్ళ దగ్గర ఉన్నది కాదనుకుంటే కాశీ వెళ్ళినా దొరకదు అని అంటారు. రాహుల్ గాంధీ విషయంలో అదే జరుగుతోందా అంటే అవును అని చెప్పాలని అంటారు ఎందుకంటే యూపీయే వన్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధాని అయినా టూ లో మాత్రం కచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చాలా మంది కోరుకున్నారు పోనీ అనుభవం కోసం అనుకున్నా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కేంద్ర మంత్రిగా చేరి తొలి మూడేళ్ళు పనిచేసి చివరి రెండేళ్ళు ప్రధానిగా పగ్గాలు చేపట్టినా రాహుల్ ఇమేజ్ వేరేగా ఉండేది అన్న మాట కాంగ్రెస్ వర్గాలలో ఉంది. మరి ఆ తరువాత నుంచి చూస్తే కాంగ్రెస్ కి ఇబ్బందులే తప్ప ఎదుగుదల అయితే లేదు,
సీరియస్ పొలిటీషియన్ గా :
ఇదిలా ఉంటే 2029లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలీ అంటే చాలా చేయాల్సి ఉంది అని అంటున్నారు. ఇండియా కూటమిలో మిత్రులు అంతా కలసి రావాలని అంటున్నారు అలాగే రాహుల్ కూడా తన నాయకత్వ పటిమను మరింతగా పెంచుకోవాలని అంటున్నారు. బీజేపీ రాజకీయ విధానాలకు పాలనా విధానాలకు ఆల్టర్నేషన్ పాలసీలను రూపొందించి వాటిని జనంలో పెట్టి ఆమోదం పొందాల్సి ఉంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాల్సి ఉంది. సీరియస్ పొలిటీషియన్ గా రాహుల్ మరింతగా ముందుకు రావాల్సి ఉంది అని అంటున్నారు. అలాగే కూటమిని కలుపుకుని పోయే వ్యూహాలతో పాటు కాంగ్రెస్ ని వీడి వేరే పార్టీలను పెట్టుకున్న వారిని దగ్గరకు తీసే కార్యక్రమాలను చేపట్టాలని అంటున్నారు. చూడాలి మరి రాహుల్ బలంగా ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మరి ఆ పీఠం ఆయనకు చేరువలో ఉందా లేదా దూరంలో ఉందా అన్నది.
