రాహుల్ గాంధీ చెవిలో ఏం చెప్పారు...ఈ గుసగుసలేంటి ?
అంతే కాదు దేశమంతా అనేక వర్గాలలో ఇదే రకంగా మోడీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని కూడా ఆయన అంచనా కట్టారు.
By: Satya P | 23 July 2026 11:49 PM ISTలోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చెవిలో పోలీసులు ఒక కీలక విషయం చెప్పారని ఆయన అన్నారు. అయితే అది విషయం కాదు అని ఆయన మాటల తరువాత అర్ధం అయింది. వారు రాహుల్ గాంధీకి అతి పెద్ద బాధ్యత మోపారు అని కూడా తెలుస్తోంది. అదేంటి అంటే కేంద్రంలో బలంగా పాతుకుపోయిన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని దించేయమని. ఈ విషయం తనకు స్వయంగా పోలీసులే చెప్పారని రాహుల్ చెప్పడంతో అది జాతీయ స్థాయిలోనే రాజకీయ రచ్చగానే మారింది.
ప్రభుత్వాన్ని దించేయండి :
ఇదిలా ఉంటే ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర నివాసం వద్ద జరిగిన నిరసనలో భాగంగా తనను ఈడ్చుకెళ్తున్న సమయంలో పోలీసులు తన చెవిలో గుసగుసలాడుతూ ఈ ప్రభుత్వాన్ని దించేయండి తొలగించండి అని తన చెప్పారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా వెల్లడించారు. నిరుద్యోగ సమస్యలు పేపర్ లీకేజీలపై పోరాడుతున్న విద్యార్థులకు మద్దతుగా ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి యత్నించిన సమయంలో ఈ ఘటన జరిగింది అని ఆయన అన్నారు. తనను అక్కడ నుంచి తీసుకెళ్లిన పోలీసులే ప్రస్తుత ప్రభుత్వం వెళ్లిపోవాలని నిశ్శబ్దంగా చెప్పారని ఆయన ఆరోపించారు. దేశ ప్రజలందరికీ వాస్తవ పరిస్థితి తెలుసని ఇదే భావన అన్ని వర్గాల్లో ఉందని కూడా రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయంగా అతి పెద్దగానే చర్చనీయాంశమయ్యాయి.
ఆ రోజు ఏమి జరిగింది :
నిజానికి ప్రధాని నివాసం వద్ద ఆ రోజు ఏమి జరిగింది అన్నది చూసే అది ఢిల్లీలోని ప్రధాని మోదీ అధికారిక నివాసం రోడ్ నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్ అది కాంగ్రెస్ నిరసనలకు అనూహ్యంగా వేదిక అయింది. ఇక దేశంలో విద్యార్థుల సమస్యల మీద కాంగ్రెస్ ఒక్కసారిగా మెరుపు నిరసనను అక్కడ చేపట్టింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నేరుగా ప్రధాని ఇంటినే ఆందోళనకు వేదికగా చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. నీట్ పరీక్షల అవకతవకలు పేపర్ లీకేజీలు అలాగే సీజేపీ నిరసనకారులపై మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా ఆందోళన చేపట్టింది. ఇక అదే నిరసనలో రాహుల్ గాంధీని ఇతర కాంగ్రెస్ ఎంపీలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దాంతో రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీలను పోలీసు స్టేషన్ లకు తీసుకెళ్ళారు.
అనూహ్యంగా రాహుల్ స్పందన:
ఇక ఇది జరిగిన తరువాత రాహుల్ గాంధీ పార్టీ వారితో మాట్లాడుతూ పోలీసులపై తనకు ఎలాంటి కోపం లేదని చెప్పుకొచ్చారు. వారు కేవలం తమ ఉన్నతాధికారుల ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే యూనిఫాంలో ఉన్నప్పటికీ చాలా మంది అధికారులు విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరుతో అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నిరసన సమయంలో పోలీసులు తనను ఈడ్చుకెళ్తూ రహస్యంగా చెవిలో ఈ ప్రభుత్వాన్ని తొలగించాలి అని అన్నారని రాహుల్ గాంధీ తెలిపారు. యూనిఫాం ధరించినప్పటికీ రాజస్థాన్, హర్యానా పోలీసులలో కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్నారు. అంతే కాదు దేశమంతా అనేక వర్గాలలో ఇదే రకంగా మోడీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని కూడా ఆయన అంచనా కట్టారు.
రాహుల్ చేస్తారా మరి :
సరే పోలీసులు రాహుల్ గాంధీ చెవిలో మోడీ సర్కార్ ని గద్దె దించాలని చెప్పారనుకుందాం. మరి దానిని 2029 ఎన్నికల్లో రాహుల్ సాధిస్తారా అన్నదే ఇక్కడ చర్చ. ఇదిలా ఉంటే ఈ రోజున దేశంలో నీట్ మీద జరుగుతున్న ఆందోళన ఏదీ విపక్షాలు నేరుగా చేపట్టింది కాదు, సీజేపీ అనే ఒక వాట్సప్ పార్టీ చేస్తోంది. అంటే విపక్షాలు చేయాల్సిన పని అది చేస్తోంది అన్న మాట. దానికి వచ్చిన ప్రతిస్పందన తరువాతనే విపక్షాలు కదులుతున్నాయి. మరి విపక్షంగా పన్నెండేళ్ల కాలంలో కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఏ మేరకు ఉద్యమిస్తున్నాయన్నది చూడాల్సి ఉంది అలాగే పార్లమెంట్ లోపలా బయటా కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏ మేరకు దూకుడుగా సాగుతోంది అన్నది కూడా సమీక్ష చేసుకోవాలి. అదే సమయంలో ఈ గుసగుసలు రహస్య సందేశాలు చూసుకుని ఇక వచ్చేది తామే అనుకుంటే పొరపాటే అంటున్నారు. బీజేపీకి వ్యతిరేకత ఉందా లేదా అన్నది పాయింట్ ఇక్కడ కాదు, బీజేపీకి బలమైన నాయకత్వం ఉంది. చాణక్య వ్యూహాలు ఉన్నాయి. వాటిని తట్టుకుని ఏకత్రాటిపైన విపక్షం నిలుస్తుందా లేదా అన్నదే ఇక్కడ చర్చ.
