Begin typing your search above and press return to search.

రాహుల్ హై టీ....పొలిటికల్ హీట్

రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని తన నివాసంలో నిర్వహించిన హై-టీ సమావేశానికి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి నేతలు, విద్యార్థి సంఘాలు, పౌర సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఓట్ల చోరీ ఆరోపణలు, ఎన్నికల సంఘం వ్యవహారంపై భవిష్యత్తు కార్యాచరణతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం.

By:  Satya P   |   7 Nov 2026 8:15 AM IST
రాహుల్ హై టీ....పొలిటికల్ హీట్
X

కాంగ్రెస్ అగ్ర నేత చాలా కాలంగా తన రూట్ మార్చేశారు. ఆయన దూకుడునే రాజకీయంగా మార్చుకున్నారు. వీధి పోరాటాల నుంచి విశ్వవిద్యాలలో డిబేట్స్ చేస్తున్నారు. యూత్ తో ఇంటరాక్ట్ అవుతూనే జనంతోనూ కలసి అడుగులు వేస్తున్నారు. బహిరంగ సభలలో ప్రసంగాలు చేస్తూనే మీడియా ముందూ గట్టిగా సౌండ్ చేస్తున్నారు. ఇక ప్రధాని మోడీని తనతో చర్చకు రావాలని సవాల్ చేస్తున్నారు. ఇలా రాహుల్ గాంధీ ఏ ఒక్క అవకాశాన్ని ఏ ఒక్క నిమిషాన్ని కూడా మిస్ కాకుండా చేస్తున్న పోరు కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం నింపుతోంది. అదే విధంగా ఇండియా కూటమికి పెద్దన్నగా కాంగ్రెస్ ని నాయకుడిగా రాహుల్ గాంధీని బలంగా నిలబెడుతోంది. ఎంతో మంది సీనియర్లు కాంగ్రెస్ బయటా మిత్ర పక్షాలలోనూ ఉన్నారు. అయితే ఇపుడు వారంతా రాహుల్ బాటలో నడుస్తున్నారు. ఢిల్లీలో రామ్ లీలా మైదానానికి మార్చ్ చేయడం అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ వ్యూహాలు రాహుల్ ఎత్తుగడలు ఫలించాయి. కాంగ్రెస్ ఎక్కడా తగ్గేది లేదని ఎన్డీయేకు రాహుల్ స్పష్టం చేయగలిగారు.

హై టీతో ఫ్యూచర్ స్ట్రాటజీ :

ఇదిలా ఉంటే తాజాగా ఢిల్లీలోని తన సునేరీ బాగ్ నివాసంలో రాహుల్ గాంధీ హై-టీ పేరుతో వేడి తేనీటి విందుని ఏర్పాటు చేశారు. ఈ హై టీకి కాంగ్రెస్ సీనియర్లు అంతా హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్ర నేత్రి సోనియా గాంధీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అలాగే ఇండియా కూటమికి చెందిన నేతలు, ఎంపీలు, అలాగే విద్యార్ధి సంఘాల నాయకులు, వివిధ పౌర సంఘాలకు చెందిన ప్రతినిధులు కూడా హాజరు కావడం విశేషం. ఇలా అందరినీ ఒక చోట చేర్చి కేంద్రం మీద పోరాటానికి ఎన్నికల సంఘం విషయంలో ఓట్ల చోరీ మీద భవిష్యత్తు కార్యాచరణకు రాహుల్ గాంధీ రంగం సిద్ధం చేశారు.

ఓట్ల చోరీ అంటూ :

ఇప్పటికే దేశంలో ఓట్ల చోరీ జరిగింది అని ప్రతీ ఏడుగురు పౌరులలో ఒకరికి ఓటు హక్కు పోయింది అని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటు హక్కు అన్నది పౌరులకు ఇచ్చిన ప్రాధమిక హక్కుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం తప్పుడు విధానాల వల్ల ఎంతో మందికి ఓట్లు లేకుండా పోయాయని ఆయన ఆక్షేపించారు. ఇప్పటికే ఈ అంశం మీద కాంగ్రెస్ సహా అంతా కలసి ఉద్యమించడం జరిగింది. ఇపుడు ఈ ఉద్యమాన్ని మరో రూపునకు తీసుకెళ్ళేందుకు చూస్తున్నారు. అందుకోసమే రాహుల్ గాంధీ నివాసంలో హైటీ సమావేశం జరిగింది అని అంటున్నారు.

రాజీనామాపైనే :

సీఎసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే అన్నది కాంగ్రెస్ విధానంగా ఉంది. అందుకే ఈ విషయంలో రాజీ పడడం లేదు, కాంగ్రెస్ ఒంటరిగా ఈ పోరు చేయడం లేదు, ఇండియా కూటమితో కలసి వస్తోంది. అలాగే పౌర సంఘాలను వెంట ఉంచుకుంటోంది. యూత్ విద్యార్ధి సంఘాలతో కూడా కొత్త చెలిమి చేస్తోంది. అందుకే ఎన్నడూ లేని విధంగా రాహుల్ నివాసంలో వారికి కూడా ఆహ్వానం లభించింది. దాంతో రానున్న రోజులలో మరింత దూకుడుగా ఓట్ల చోరీ మీద పోరు సాగనుంది అని అంటున్నారు.

అయిదు రాష్ట్రాలలో :

ఇక మరి కొద్ది నెలలలో మొదలు కానున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచేందుకు తగిన రాజకీయ కార్యాచరణను రూపొందించే విషయం మీద కూడా ఈ హై-టీ మీటింగ్ లో డిస్కషన్ సాగింది అని అంటున్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి పై చేయి సాధించాలని చూస్తోంది. ఇక్కడ నుంచే ఎన్డీయేకి చెక్ పెడితే 2029 ఎన్నికల్లో గెలుపునకు దారులు సులువు అవుతాయన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. మొత్తానికి రాహుల్ గాంధీ గతానికి భిన్నంగా కొత్త వేదికలను నిర్మిస్తున్నారు. రాజకీయ నేతలకు భిన్నంగా కొత్త ట్రెండ్ లో వెళ్తున్నారు. అందుకే హై టీ వంటి కార్యక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు.