Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ 'పరశురాముడు'.. రాహుల్ 'అవతారం' వెనుక అసలు కథ ఏంటి?

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పరశురాముడి రూపంలో చిత్రీకరిస్తూ వెలువడిన ఒక పోస్టర్ దేశవ్యాప్త చర్చకు తెరలేపింది.

By:  Tupaki Political Desk   |   19 Jun 2026 6:55 PM IST
కాంగ్రెస్ పరశురాముడు.. రాహుల్ అవతారం వెనుక అసలు కథ ఏంటి?
X

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పరశురాముడి రూపంలో చిత్రీకరిస్తూ వెలువడిన ఒక పోస్టర్ దేశవ్యాప్త చర్చకు తెరలేపింది. రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ చిత్రాన్ని ఆవిష్కరించడం వెనుక ఉన్న వ్యూహకర్తల ఆలోచనలేమిటి? ఇది కేవలం భక్తి భావమా లేక మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమ అగ్రనేత పుట్టినరోజు సందర్భంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, పరుశురాముడి రూపంలో ఉన్న రాహుల్ ఫొటోకు పాలాభిషేకం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవ్వగా, సోషల్ మీడియాలో భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.

రాహుల్ ఆధ్యాత్మిక అడుగులు

గత కొంతకాలంగా రాహుల్ గాంధీ తన రాజకీయ శైలిని మార్చుకుంటూ వస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. శివాలయ సందర్శనలు, హిందూ ఆచారాలపై ఆసక్తి ప్రదర్శించడం వంటి చర్యల ద్వారా రాహుల్ తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నంతోపాటు బీజేపీకి బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న హిందుత్వ అనుకూల వాదులను ఆకట్టుకునే ఎత్తుగడ అనుసరిస్తున్నారని చెబుతున్నారు. బీజేపీ ప్రభావంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి దూరం జరుగుతున్న హిందూ ఓటర్లను తిరిగి దగ్గర చేసుకోవడానికి, పార్టీ అనుసరిస్తున్న 'సాఫ్ట్ హిందుత్వ' వ్యూహంలో భాగంగానే రాహుల్‌ను ఈ విధంగా చిత్రించారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పక్కా వ్యూహమా?

హిందూ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి ఇది ఒక పక్కా వ్యూహాత్మక అడుగు అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. పరశురాముడు హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన అవతారంగా చెబుతారు. రాహుల్ గాంధీని ఆ రూపంలో చూపించడం ద్వారా, తాము కూడా హిందూ సంప్రదాయాలకు గౌరవం ఇస్తామనే సంకేతాన్ని కాంగ్రెస్ పంపాలని చూస్తోందని అంటున్నారు. ఇది బిజెపికి ఉన్న 'హిందుత్వ' ఇమేజ్‌కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా కూడా చూడవచ్చు అని అంటున్నారు.

మరోవైపు, పరశురాముడిని కేవలం భక్తుడిగానే కాకుండా, అన్యాయం, అసహనం, అవినీతిపై తిరుగులేని పోరాటం చేసే వీరుడికి ప్రతిరూపంగా కూడా చూస్తారు. దేశంలో పెరిగిపోతున్న అసహనం, అవినీతి వ్యవస్థలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడతారని, ఆ పోరాటానికి పరశురాముడే ప్రతీక అని చెప్పడానికి ఈ చిత్రాన్ని ఎంచుకుని ఉంటారని అంటున్నారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దే యోధుడిగా రాహుల్ గాంధీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఈ చిత్ర రూపకర్తల ఆంతర్యం అయి ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.

అయితే, ఈ వ్యూహం వెనుక ఉన్న ప్రతికూలతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని అంటున్నారు. పరశురాముడు తన ఆగ్రహానికి, క్షాత్ర శక్తికి ప్రతీక. కానీ, రాహుల్ గాంధీని ఆ రూపంలో చూపించడంపై భక్తుల నుంచి, రాజకీయ ప్రత్యర్థుల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవతల రూపాలను రాజకీయ నాయకులకు అన్వయించడం హిందూ ధర్మాన్ని అగౌరవపరచడమేనని కొందరు హిందుత్వవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, గతంలో హిందూ ఆచారాలను విమర్శించిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు ఇలాంటి పనులకు పూనుకోవడం ద్వంద్వ వైఖరి అని, ఇది ఓటర్లలో వ్యతిరేకతను కూడా పెంచవచ్చని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. మొత్తానికి, రాహుల్ గాంధీని పరశురాముడిగా చూపించడం ద్వారా కాంగ్రెస్ ఒక సాహసోపేతమైన ప్రయోగానికి తెరలేపిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.