తన పెళ్ళి గురించి నవ్వులు పూయించిన రాహుల్ !
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత. గాంధీల వంశంలో ఐదవ తరం వారు గత పదిహేను నెలలుగా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ తో ఉన్నారు.
By: Satya P | 25 Aug 2025 9:28 AM ISTరాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్ర నేత. గాంధీల వంశంలో ఐదవ తరం వారు గత పదిహేను నెలలుగా లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ తో ఉన్నారు. ఇక ఆయన ఎన్డీయేని దానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీని గట్టిగానే ఢీ కొంటున్నారు. అదే సమయంలో ఆయన సరదాగా వ్యాఖ్యలు చేస్తూ మీడియా ముందు ఆహ్లాదకర వాతావరణాన్ని కూడా కల్పిస్తున్నారు. ఇదే సమయంలో అనుకోని విధంగా రాహుల్ గాంధీ తాజాగా మరోసారి తన పెళ్లి గురించి మీడియాతో మాట్లాడుతూ నవ్వులు పూయించారు.
చిన్నోడు తేజస్వీ యాదవ్ అలా :
ఇక బీహార్ కి భావి ముఖ్యమంత్రిగా ఇండియా కూటమి తరఫున ఉన్న ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్ చిన్న వయసులోనే పెళ్ళి చేసుకుని స్థిరపడ్డారు. తాజాగా ఆయన ఆర్జేడీ మీద ఆధారపడి కాంగ్రెస్ బీహార్ లో బతుకుతోంది అన్న చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలకు బదులిస్తూ.ఎన్డీయేలో తనకు అన్న లాంటి వారు అంటూ కేంద్ర మంత్రి తన రాష్ట్రానికే చెందిన చిరాగ్ పాశ్వాని మీద విమర్శలు చేస్తూనే పెళ్ళి చేసుకో పెద్దన్నా అంటూ సెటైర్లు వేశారు. తన మీద విమర్శలు చేయడం కాదు ఎన్డీయేలో చిరాగ్ తన పాత్ర ప్రాధాన్యత ఏమిటో చూసుకోవాలని కూడా సలహా ఇచ్చారు. ఇదే సందర్భంలో చిరాగ్ కి వయసు అయిపోతోందని తొందరగా పెళ్ళాడి ఒక ఇంటివారు కావాలని అపుడు తాను కూడా సంతోషిస్తాను అని తేజస్వి యాదవ్ కామెంట్స్ చేశారు.
తనకు కూడా వర్తిస్తుందన్న రాహుల్ :
ఇలా రాజకీయ విమర్శలు హాట్ కామెంట్స్ కాస్తా పెళ్ళి దాకా రావడం ఆ విధంగా తేజశ్వి యాదవ్ మీడియా ముందు మాట్లాడడంతో రాహుల్ గాంధీ మైక్ అందుకుని తన పెళ్ళి గురించి తానే చెప్పారు. తేజస్వి యాదవ్ తండ్రి ఆర్జేడీ అధినేత అయిన లాలూ యాదవ్ కూడా తనను పెళ్ళి చేసుకోమని తరచూ కోరుతూంటారు అని రాహుల్ విషయం చెప్పుకొచ్చారు. చిరాగ్ ని పెళ్ళి చేసుకోమని అన్న తేజస్వి యాదవ్ సూచన నాకు కూడా వర్తిస్తుందని అన్నారు. అయితే తాను ఇంతకీ పెళ్ళి చేసుకుంటానో లేదో మాత్రం రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పలేదు. మొత్తానికి తానుగానే తన పెళ్లి ప్రస్తావన రాహుల్ తేవడం అయితే విశేషం.
బీజేపీ మీద మండిపడుతూ :
ఇదే మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ బీజేపీ మీద మండిపడ్డారు. బీజేపీ ఓటు చోరీకి పాల్పడుతోంది అన్నారు. మహారాష్ట్ర కర్ణాటక హర్యానాలలో ఇదే జరిగింది అన్నారు. ఈసీ మీద తాము విమర్శలు చేస్తూంటే బీజీపీ వారు తమ మీద విమర్శలు చేస్తున్నారు అని దీని బట్టి ఎవరు ఎవరికి సహకారంగా ఉన్నారో అర్ధం అవుతోంది అని రాహుల్ లాజిక్ గా విమర్శించారు. మొత్తం మీద చూస్తే తొలి విడతగా ఓటు అధికార్ యాత్రను రాహుల్ గాంధీ బీహార్ లో పూర్తి చేశారు. జన బాహుళ్యంలోకి వెళ్ళి తాను చెప్పాల్సింది వారికి చెప్పారు. జనాలలో కూడా స్పందన బాగానే వచ్చింది అని ఇండియా కూటమి నేతలు అంటున్నారు.
