Begin typing your search above and press return to search.

మోడీ మీద రాహుల్ స్ట్రాటజీ బూమరాంగ్ ?

ప్రధాని నరేంద్ర మోడీని ఈ రోజు దేశమే కాదు ప్రపంచం కూడా గౌరవిస్తోంది. ఇటీవల ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ సక్సెస్ మీద విదేశీ మీడియావే ఎలుగెత్తి చాటింది.

By:  Satya P   |   21 Sept 2026 9:25 AM IST
మోడీ మీద రాహుల్ స్ట్రాటజీ బూమరాంగ్  ?
X

ప్రధాని నరేంద్ర మోడీని ఈ రోజు దేశమే కాదు ప్రపంచం కూడా గౌరవిస్తోంది. ఇటీవల ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన బ్రిక్స్ సక్సెస్ మీద విదేశీ మీడియావే ఎలుగెత్తి చాటింది. ఇక దేశంలో మోడీ బలమైన నాయకుడిగా ఆవిష్కరించబడ్డారు. బీజేపీలోనూ ఆయన తిరుగులేని ఆధిపత్యంతో కొనసాగుతున్నారు. ఎవరు కాదన్నా మోడీ చరిష్మా అయితే పటిష్టంగానే ఉంది. మోడీకి సరిసాటి నాయకులు ప్రత్యర్ధి శిబిరంలో లేకపోవడం కూడా ఆయన విజయ పరంపర కొనసాగడానికి మరో ప్రధాన కారణంగా ఉంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ ఒంటరిగా మోడీని బీజేపీని ఢీ కొనలేకపోతోంది అన్నది తెలిసిందే. కాంగ్రెస్ కి చివరి సారిగా 1984 లో సొంతంగా మెజారిటీ వచ్చింది. ఇక 200 ఎంపీల మార్క్ ని 1991, 2004, 2009లో మాత్రమే సాధించింది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఆ లోపే ఆగిపోయింది.

బీజేపీ అంతకంతకు :

బీజేపీ విషయం తీసుకుంటే తన బలాన్ని అంతకంతకు పెంచుకుంటూ వచ్చింది. 2014, 2019లలో సొంతంగా మెజారిటీ సాధించింది. 2024లో కూడా సొంతంగా 240 సీట్లు బీజేపీకి వచ్చిన సంగతి మరచిపోరాదు. 2029 లో సైతం బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ని సాధించడానికి తన వంతు వ్యూహాలను రూపొందించుకుంటోంది. అయితే ఈ విషయంలో కనీసం 150 సీట్ల మార్క్ ని సాధించడానికి కాంగ్రెస్ ఏమి చేస్తోంది అన్నదే అతి పెద్ద ప్రశ్న. కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ అగ్ర నేతగా ఉన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలను లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా విమర్శించవచ్చు. కానీ మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మాత్రం తప్పుడు వ్యూహం అవుతుందని అంటున్నారు. అది బూమరాంగ్ కూడా అవుతుందని అంటున్నారు.

జనాలకు రాంగ్ మెసేజ్ ;

రాహుల్ గాంధీ ఆ మధ్యన పార్టీ సమావేశంలో రాహుల్ గాంధీ విదేశాంగ విధానం మీద మాట్లాడుతూ ఆయన ఇతర దేశాల నేతలతో ఆలింగనాలు ఎలా చేసుకుంటారు అన్న దానిని పార్టీ నేతలతో కలిసి చేసి చూపించారు. అది కూడా అపుడు రాజకీయ రచ్చకు దారి తీసింది. ఇపుడు చూస్తే మరోసారి ఇండోర్‌లో చేసిన మోడీ అనుకరణ కార్యక్రమం మీద బీజేపీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడ జరిగిన ఛాత్రోం కీ గూంజ్ కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణితో కలిసి రాహుల్ గాంధీ మోడీ మీద చేసిన వ్యాఖ్యలు, హావభావాలు ఇప్పుడు రాజకీయంగా అతి పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఈ విధంగా దేశ ప్రధానిని వయసులో పెద్ద అయిన మోడీని రాహుల్ గాంధీ కామెడీ అంటూ చేస్తున్న తీరు మీద జనాలకు కూడా రాంగ్ మెసేజ్ వెళ్తుందని అంటున్నారు. దాని వల్ల రాహుల్ గాంధీ మోడీ మీద వ్యక్తిగత అభిప్రాయ భేదాలతోనే విమర్శిస్తున్నారు అన్నది బలంగా వెళ్తుంది అని అంటున్నారు.

సీరియస్ నెస్ ఏదీ :

రాహుల్ గాంధీ సామాన్య నాయకుడు కాదు, ఆయన గాంధీల వంశానికి చెందిన వారసుడు, అంతే కాదు లోక్ సభలో ప్రతిపక్ష నేత. ఆయన కాబోయే ప్రధాని అన్న ట్యాగ్ లైన్ తో ముందుకు సాగుతున్న నేత. ఆయన మోడీ ప్రభుత్వం విధానాలను నిశితంగా విమర్శించవచ్చు. అంతే కాదు బీజేపీ చేసే ప్రజా వ్యతిరేక విధానాలను గణాంకాలతో సహా జనం ముందు పెట్టవచ్చు. ఆ పార్టీ తీరుని ప్రతీ వేదిక మీద రాజకీయంగా ఎండగట్టవచ్చు. అయితే ఒక దేశ ప్రధాని బాడీ లాంగ్వేజ్ విషయం కానీ ఆయన వ్యవహార శైలి గురించి కానీ చేసే విమర్శలు అయితే తేలికగానే జనాలు చూస్తారు. వాటి మీద లాభం కంటే నష్టమే ఎక్కువగా వస్తుందని రాహుల్ గాంధీ గుర్తించాలని అంటున్నారు. ఇప్పటికే రాహుల్ మీద నాన్ సీరియస్ పొలిటీషియన్ అని ఒక ముద్ర బలంగా బీజేపీ వేస్తోంది. దానిని తొలగించుకునే విధంగా వ్యవహరించాలి కానీ ఒక సాధారణ నాయకుడి మాదిరిగా స్టాండ్ కమెడియన్ల తో కలసి ఈ తీరు ఏంటి అని అంటున్నారు. మొత్తానికి చూస్తే మోడీకి ధీటు అయిన నేతగా రాహుల్ అవతరించే క్రమంలో చేస్తున్న తడబాట్లు పొరపాట్లే 2029 ఎన్నికల్లో జనాల పరీక్షకు గురి అవుతాయని గుర్తెరగాలని సూచిస్తున్నారు.