‘రాహుల్ మిస్సింగ్, డే-59’ నిజమేనా? కాంగ్రెస్ అగ్రనేత ఎక్కడున్నారు?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కనబడుట లేదు అన్న పోస్టర్లు వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Political Desk | 29 Oct 2025 3:06 PM ISTకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కనబడుట లేదు అన్న పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఓటు సాధికార యాత్ర చేపట్టిన రాహుల్ ఆ తర్వాత కనిపించడం లేదని అధికార బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. అంతేకాకుండా రాహుల్ మిస్సింగ్ అన్న పోస్టర్లను సోషల్ మీడియాలో ట్రెండింగుకు పెట్టింది. 59 రోజుల క్రితం చివరిసారిగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బిహార్ లో కనిపించారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శలు గుప్పించారు.
బిహార్ ఎన్నికల దృష్ట్యా బీజేపీ వైరల్ చేస్తున్న పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ స్థాయిని తగ్గించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. మహాగట్ బంధన్ లో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతోందని, దీనికి రాహుల్ గాంధీ ప్రవర్తనే కారణమని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ బిహార్ వచ్చి రెండు నెలలైంది. ఆ తర్వాత కొలంబియా టూర్ వెళ్లిన ప్రతిపక్ష నేత కొన్ని వీడియోలు చేస్తూ సమయాన్ని గడిపేశారు అంటూ బీజేపీ వ్యాఖ్యానించింది.
బిహార్ కోసం, విపక్ష కూటమి కోసం రాహుల్ తగిన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. ఆయన నిర్లక్ష్యం ఫలితంగానే బిహార్ లో విపక్ష కూటమిలో కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారిందని బీజేపీ ఆరోపించింది. ‘‘కాంగ్రెస్-ఆర్జేడీ పార్టీలకు ఓట్లు వేయడం అంటే బిహార్ కోసం పనిచేయని వాళ్లకు ఓట్లు వేయడమే అన్న విషయం ప్రజలకు తెలుసు, లాలు కుటుంబం బిహార్ ను దశాబ్దాల తరబడి పాలించి తమ ఇంటిని నింపుకుంది. కానీ, బిహారీలు నిర్లక్ష్యానికి గురయ్యారు. పేదలుగా మిగిలిపోయారు’’ అంటూ అమిత్ మాలవీయ తన ఎక్స్ లో పోస్టు చేశారు.
కాగా, బిహార్ లో రాహుల్ గాంధీ బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మహాగఠ్ బంధన్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ తో కలిసి ముజఫరపూర్, దర్భంగల్లో జరగే ఎన్నికల ర్యాలీలో రాహుల్ ప్రసంగిస్తారు. రాహుల్ పర్యటనను పురస్కరించుకునే బీజేపీ నేత అమిత్ మాలవీయ ‘రాహుల్ గాంధీ మిస్సింగ్’ పోస్టులు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరోవైపు విపక్ష కూటమి తమ సీఎం అభ్యర్థిని ప్రకటించడంతో ఎన్డీఏ కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే సీఎం నితీశ్ కుమారే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా నితీశ్ కుమార్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే మూడుసార్లు ప్రకటించారని గుర్తు చేశారు. దీంతో ఎన్డీఏ గెలిచినా ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశం లేదని అంటున్నారు.
