రాహుల్ ఓదార్పు యాత్ర...టార్గెట్ బీజేపీ !
ఇప్పటికి 16 ఏళ్ళ క్రితం వైఎస్ జగన్ ఉమ్మడి ఏపీలో ఓదార్పు యాత్ర నిర్వహించారు. అందరికీ గుర్తుండే ఉంటుంది.
By: Satya P | 2 Aug 2026 5:00 AM ISTఇప్పటికి 16 ఏళ్ళ క్రితం వైఎస్ జగన్ ఉమ్మడి ఏపీలో ఓదార్పు యాత్ర నిర్వహించారు. అందరికీ గుర్తుండే ఉంటుంది. తన తండ్రి వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక గుండె ఆగిపోయి మరణించిన వారి కుటుంబాలను స్వయంగా ఓదార్చడానికి ఆయన బయలుదేరి వెళ్ళారు. ఆయనకు కాంగ్రెస్ అధినాయకత్వం అనుమతి ఇవ్వకపోవడంతో ఏకంగా ఆ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చేసి వైసీపీ పేరుతో కొత్త పార్టీని పెట్టుకున్నారు. ఇదంతా ఎందుకు అంటే అలాంటి కార్యక్రమమే ఇపుడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టారు. నీట్ ఆత్మహత్య బాధితులకు రాహుల్ పరామర్శ పేరుతో ఈ కార్యక్రమం సాగింది.
చెన్నై టూర్ అందుకే :
ఇక ఈ ఏడాది మే 3న నీట్ పరీక్ష నిర్వహించారు. అయితే నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయింది అని అదే నెల 12న సంబంధిత నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇక నీట్ పరీక్ష లీకేజి మీద వచ్చిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. పేపర్ లీకేజితో పాటు పరీక్షల రద్దు కారణంగా ఎంతో మంది విద్యార్ధులు ఆనాడు ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా కలిపి ఇరవై మందికి పైగా ఉంటారు అన్నది ఉంది. అయితే వీరి గురించే సీజేపీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించింది. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి డిమాండ్ చేసి సాధించింది. నీట్ మంటలు ఇంకా దేశంలో చల్లారలేదు. పార్లమెంట్ లో దీని మీద ప్రతిపక్షాలు ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆ వేడి మరింతగా ఉంచేలా రాహుల్ గాంధీ నీట్ విద్యార్థులు ఎవరైతే ఆత్మ హత్య చేసుకున్నారో వారి కుటుంబాలను పరామర్శించాలని నిర్ణయించుకున్నారు.
కేంద్రం మీద విమర్శలు :
ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెన్నై పర్యటనలో భాగంగా ఆయా కుటుంబాలని పరామర్శించారు. ఆయన మహాబలిపురం పర్యటన చేపట్టారు. తమిళనాడులోని మహాబలిపురంలో నీట్ ఆత్మహత్యల బాధితుల కుటుంబ సభ్యులను రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా కలిశారు. ఈ సందర్భంగా ఆ కుటుంబాలని ఓదార్చుతూనే కేంద్ర ప్రభుత్వం మీద విద్యా వ్యవస్థపైన రాహుల్ గాంధీ ఘాటైన విమర్శలు చేశారు. విద్యార్థులను నిజాయితీగా కష్టపడి చదవమని చెబుతున్నారని కానీ విద్యా వ్యవస్థ మాత్రం సరిగ్గా లేదని అక్కడ వ్యవస్థ నిజాయితీగా ఉండటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీళ్లు వారి క్షోభను చూసేంత ఆవేదన మరొకటి లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇది పాడైన అవినీతి విద్యా వ్యవస్థ లోపమేనని ఆయన కేంద్ర ప్రభుత్వం తీరు మీద మండిపడ్డారు.
మరిన్ని పరామర్శలు :
రాహుల్ గాంధీ ఇదే తీరున మరిన్ని పరామర్శలు ఓదార్పు యాత్రలు నిర్వహిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. దేశంలో అనేక చోట్ల నీట్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు ఉన్నాయి. దాంతో రాహుల్ గాంధీ విడతల వారీగా ఆయా కుటుంబాలని పరామర్శిస్తారు అని అంటున్నారు. దాంతో నీట్ కి సంబంధించిన వేడి మరింతగా రగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయా కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం చెల్లించినా కూడా వారిది తీరని మనో వేదన అని ప్రతిపక్ష కాంగ్రెస్ అంటోంది. ఒక విధంగా నీట్ చట్రంలో బీజేపీని బంధించి ఉక్కిరిబిక్కిరి చేయడానికి కాంగ్రెస్ పక్కాగా వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు.
