Begin typing your search above and press return to search.

రాహుల్ బాబు : మోడీకి ఫుల్ హ్యాపీయేనా ?

మోడీని తక్కువ అంచనా వేస్తున్నారా లేక తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారా అన్నది తెలియదు కానీ రాహుల్ గాంధీ మాత్రం వ్యూహాల లేమితో సతమతం అవుతున్నారని అంటున్నారు.

By:  Satya P   |   18 Oct 2025 9:00 AM IST
రాహుల్ బాబు : మోడీకి ఫుల్ హ్యాపీయేనా ?
X

గాంధీల వంశానికి రాజకీయంగా తిరుగులేదని ఈ దేశం ఎన్నో సార్లు నిరూపించింది. ఈ దేశానికి తొలి ప్రధానిగా నెహ్రూ ఏకంగా పదిహేడేళ్ళ పాటు పాలించారు. ఆయన కుమార్తెగా తండ్రి ఉండగానే రాజ్యసభకు నెగ్గిన వారు శ్రీమతి ఇందిరాగాంధీ. ప్రధాని నెహ్రూకి రాజకీయ కార్యదర్శిగా ఆయన మూడవ టెర్మ్ ప్రధానమంత్రిత్వంలో ఇందిరాగాంధీ రాజకీయంగా చురుకైన పాత్ర పోషించారు. నెహ్రూ మరణానంతరం లాల్ బహుదూర్ శాస్త్రి ప్రధాని అయితే ఆయన కేబినెట్ లో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. కేవలం రెండేళ్ళు తిరగకుండానే 1966 జనవరిలో ఆమె ఈ దేశానికి ప్రధాని అయిపోయారు.

అత్యున్నత పీఠం అలా :

ఇక గాంధీల చరిత్ర చూస్తే అత్యున్నత పీఠం అయిన ప్రధాని పదవిని వారు అందుకోవడం అన్నది ఒక బిగ్ టాస్క్ గా ఎపుడూ మారలేదు. ఆ వరమాల వారి మెడలోకి అలా వచ్చిపడింది. అయితే తమ సమర్ధతను నిరూపించుకుని వారు పూర్తిగా ఆ బాధ్యతలతో నిరూపించుకున్నారు. పండిట్ నెహ్రూ 58 ఏళ్ళ వయసులో స్వతంత్ర్య భారతానికి తొలిసారి ప్రధాని అయ్యారు. ఇక ఇందిరాగాంధీ 49 ఏళ్ళ వయసులో ప్రధానిగా పగ్గాలు అందుకున్నారు. రాజీవ్ గాంధీ కేవలం నలభై ఏళ్ళకే ప్రధాని అయిపోయి ఈ దేశానికి యంగెస్ట్ పీఎం గా తిరుగులేని రికార్డుని స్థాపించి ఈ రోజుకీ దానిని అలాగే ఉంచగలిగారు.

రాహుల్ పొలిటికల్ కెరీర్ :

రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్ చూస్తే ఆయన 2004లో రాజకీయ అరంగేట్రం చేశారు. మొదట్లో రాజకీయాల మీద ఆసక్తి లేదని ఆయన దూరంగా ఉన్నారని ప్రచారం సాగింది. ఆయన ఎంపీ అయిన నాటికి వయసు 33 ఏళ్ళు. ఒక విధంగా చూస్తే కాస్తా లేట్ అనే చెప్పాలి. ఇక 2004, 2009లలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే ప్రభుత్వాలు ఏర్పడి దశాబ్దం పాటు ఈ దేశాన్ని ఏలాయి. ఆ సమయంలో అయినా రాహుల్ గాంధీ కేంద్ర మంత్రిగా తొలి దఫాలో అప్పటి కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్ వద్ద పనిచేసి ఉంటే 2009లో రెండవ టెర్మ్ లో కచ్చితంగా ప్రధాని అయి ఉండేవారు. అంతే కాదు తన ముత్తాత నాయనమ్మ తండ్రి బాటలో త్వరగానే అత్యున్నత పీఠం అందుకునేవారు. ఇంకా చెప్పాలి అంటే 2009లో రాహుల్ ప్రధాని అయి ఉంటే 38 ఏళ్ళకే పీఎం అయి తన తండ్రి రాజీవ్ గాంధీ రికార్డుని సైతం బద్ధలు కొట్టేవారు. కానీ అలా జరగలేదు అంటే చేతిలో ఉన్న అవకాశాన్ని రాహుల్ గాంధె వాడుకోలేదనే అంతా అంటారు.

నాలుగు సార్లు ఎంపీగా :

రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో దేశానికి ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఆయన కెరీర్ లో ఇదొక మేలి మలుపు. ఒక విధంగా ప్రజాస్వామ్యంలో విపక్ష నేత అంటే వెయిటింగ్ ప్రైం మినిస్టర్ అని చెబుతారు. కానీ రాహుల్ ఆ విధంగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారా అంటే ఒకింత నిరాశనే కలుగుతోంది అని అంటున్నారు. ఆయన మోడీ మీద వేస్తున్న ట్వీట్లు చేస్తున్న విమర్శలు కూడా లాజిక్ కి అందకుండా ఉంటున్నాయి అని అంటున్నారు. ఒక సగటు నాయకుడు చేసే విమర్శలను గాంధీల వారసుడు, ప్రధాని కావాలని చూస్తున్న రాహుల్ గాంధీ చేయడం మీద కూడా చర్చ సాగుతోంది.

వ్యూహాల లేమితో :

మోడీని తక్కువ అంచనా వేస్తున్నారా లేక తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారా అన్నది తెలియదు కానీ రాహుల్ గాంధీ మాత్రం వ్యూహాల లేమితో సతమతం అవుతున్నారని అంటున్నారు. ఆయన ఈ రోజుకీ సీరియస్ పొలిటీషియన్ గా జనాల మెదళ్ళలో రిజిష్టర్ కాలేకపోతున్నారు అంటే తేడా ఎక్కడ ఉందో విశ్లేషించుకోవాలని కూడా అంటున్నారు. ప్రధాని మోడీ విషయం తీసుకుంటే ఆయన చేసే ప్రతీ విమర్శ వెనక ఒక వ్యూహం అర్ధం ఉంటాయి. మరి రాహుల్ లో అవి కనిపిస్తున్నాయా అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది.

ఈ లాజిక్ మరిచారా :

మోడీ ట్రంప్ కి భయపడుతున్నారు అని విపక్ష స్థానంలో ఉండి రాహుల్ ఎలా అనగలుగుతారు అన్నది ఒక డౌట్. ఎందుకంటే ట్రంప్ మీద దేశం మొత్తం ఆగ్రహంగా ఉంది. అధిక సుంకాలు విధించారని దేశ ప్రజలు అంతా గుర్రుగా ఉన్నారు. అలాంటపుడు అమెరికా పెద్దన్నకు మోడీ భయపడుతున్నారు అనడం ద్వారా రాహుల్ గాంధీ మోడీనే విమర్శించాను అని అనుకుంటున్నారు కానీ దాని వెనక దాగి ఉన్న భారతీయుల సెంటిమెంట్ ని ఏ విధంగా గుర్తించలేకపోతున్నారు అని అంటున్నారు. అందుకే ఆయన కామెంట్స్ బూమరాంగ్ అవుతున్నాయని అంటున్నారు. అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్‌ కూడా ఇపుడు రాహుల్ కామెంట్ మీద తనదైన విమర్శలు చేస్తూ అవి బాధ్యతా రాహిత్యం అని అంటున్నారు. ఇది వైరల్ అవుతోంది.

రాహుల్ హెల్ప్ చేస్తున్నారా :

దేశాధినేతగా కావాలనుకునే వారు ట్వీట్లు చేస్తూ లైట్ గా ప్రతీ ఇష్యూ మీద మాట్లాడుతూ ఉండరని అంటారు. దేశంలో ప్రజా సమస్యల మీద అధికార పార్టీని నిలదీయాలి. అదే సమయంలో దేశం బయట ఉన్న సమస్యల మీద ఆచీ తూచీ స్పందించాలి. కానీ రాహుల్ గాంధీ దేశం వెలుపల భారత దేశ నాయకత్వాన్ని విమర్శించాను అనుకుంటున్నారు. అనేక సార్లు ఆయన దేశ నాయకత్వం మీద విమర్శలు చేశారు. ఇది రాజకీయంగానే ఆయన ఆలోచిస్తునారు అన్న భావనను కలిస్తున్నాయి. అదే సమయంలో దేశ ప్రజలు కూడా వాటిని మెచ్చరని ఆయన గ్రహించలేకపోతున్నారు అని అంటున్నారు. ఈ తరహా అపరిపక్వతతో కూడా విమర్శల వల్ల రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి ఎంతో హెల్ప్ చేస్తున్నారు అన్నది కూడా బీజేపీ వర్గాలలో ఉంది. అందుకే వారు రాహుల్ అపొజిషన్ లో తమకు ప్రత్యర్ధిగా ఉండాలని కోరుకుంటున్నారు.