బీహార్ రూట్...మోడీకి రాహుల్ సవాల్
ఇక కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గెని ఎంపిక చేయడం కూడా మరో వ్యూహాత్మకమైన నిర్ణయం.
By: Satya P | 27 Aug 2025 10:00 PM ISTబీజేపీ నేతలు ఎప్పుడూ రాహుల్ గాంధీ గురించి ఒక్క మాట అంటూ ఉంటారు. రాహుల్ ని పప్పుగా కూడా వారు భావిస్తూ వస్తున్నారు. రాహుల్ కి ఏమీ తెలియదని ఆయన ప్రకటనలకు పెద్దగా ప్రజలలో విశ్వసనీయత ఉండదని తలపోస్తూ ఉంటారు. అయితే ఇదంతా 2014 తొలి నాళ్ళలో ఉన్న ఆలోచనలు అంచనాలుగా చెప్పాల్సి ఉంటుంది. నిజానికి చూస్తే రాహుల్ ప్రతీ ఎన్నికకూ రాటు తేలుతున్నారు. కాంగ్రెస్ ప్రతీ ఓటమి ఆయనలో మార్పు తీసుకుని వస్తోంది.
వివేచన అక్కడే ఉంది :
ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే గడచిన ఆరేళ్ళుగా రాహుల్ గాంధీ ఆలోఅనలు నిర్ణయాలలో పరిపక్వత కనిపిస్తోంది అని అంటున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే సుమారు అయిదు నెలల ముందు రాహుల్ గాంధీ అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ ఎన్నికలను ఒక చాలెంజ్ గా తీసుకుని ఆయన పోరాడారు. కలసి వచ్చిన పార్టీలతో బీజేపీకి ముఖా ముఖీ పోరు ఉండాలని తీసుకున్న నిర్ణయాలు కొంతవరకూ ఫలించాయి. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండోసారి ఓడింది. దాంతో రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నిజానికి ఇది వివేచనతో తీసుకున్న నిర్ణయంగానే అంతా చూశారు. ఓటమి చెందిన పార్టీల అధ్యక్షులు ఎక్కడా రాజీనామా చేసిన సందర్భాలు పెద్దగా చరిత్రలో లేవు. గాంధీ వంశంలో అసలు లేదు. కానీ రాహుల్ తాను ప్రత్యేకం అని అక్కడే చాటుకున్నారు.
టఫ్ ఫైట్ గానే సాగింది :
ఇక 2019 నుంచి 2024 మధ్యలో రాహుల్ గాంధీ ఒక ఎంపీగానే ఉంటూ జనం మధ్యలోకి వెళ్ళారు. భారత్ జోడో యాత్రలో ఆయన తనలోని లోపాలను సవరించుకున్నారు. గాంధీలు అంటే జనాలకు దూరంగా రాచ మందిరాలలో ఉంటారు అన్న భ్రమలను తొలగించి సాదర జనానికి ఆయన అతి చేరువగా వెళ్ళగలిగారు. ఆ విధంగా రాహుల్ గాంధీ ఏమిటి అన్నది ఎక్కువ మంది జనాలకు తెలిసింది. అది 2024 ఎన్నికల్లో చాలా మటుకు ప్రతిఫలించింది. పైగా బీజేపీకి ఉత్తరాది దాకా ముఖా ముఖీ పోరుని ఈ ఎన్నికల్లో సాధించింది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి.
వ్యూహాలలో పదును :
ఇక కాంగ్రెస్ అఖిల భారత అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గెని ఎంపిక చేయడం కూడా మరో వ్యూహాత్మకమైన నిర్ణయం. దక్షిణాదికి చెందిన ఈ దళిత నాయకుడు సీనియర్ మోస్ట్ లీడర్ గా కాంగ్రెస్ లో ఉన్నారు. విషయ పరిజ్ఞానంతో పాటు రాజకీయంగా ధీటైన నేతగా ఖర్గె ఉన్నారు. ఆయన ఎంపికతో కాంగ్రెస్ సామాజిక న్యాయం సాధించింది అని జనాలకు చెప్పుకునే అవకాశం ఏర్పడింది. ఇక ఓబీసీలకు రాజ్యాధికారం అంటూ కాంగ్రెస్ చేస్తున్న పోరాటం కూడా కాంగ్రెస్ మరింత విస్తృతంగా జనంలోకి పోవడానికి అవకాశం ఇస్తోంది. బీసీల కుల గణన అన్నది రాహుల్ గాంధీ ఎత్తుకున్న మరో నినాదం. ఇది కూడా దేశంలో చర్చకు తావిచ్చింది ఆఖరుకు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా కుల గణనకు సై అంది అంటే కాంగ్రెస్ పోరాటం ఫలించినట్లే అంటున్నారు.
ఓటు అధికార యాత్రతో :
ఇక 2024 తరువాత రాహుల్ గాంధీ హోదా మారింది లోక్ సభలో ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అలా ఆయన జనం నుంచే తన అధికార హోదా సంపాదించుకోవడం ఈ కేబినెట్ ర్యాంక్ ని అందుకునేందుకు ఏకంగా పదేళ్ళ పాటు నిరీక్షించడం ఓపికగా ఓటములను ఎదుర్కొంటూ ముందుకు సాగడం వంటిని ఆయనలోని రాజకీయ పరిణతికి నిదర్శనంగానే చెబుతున్నారు. ఇక లోక్ సభలో బయట రాహుల్ గాంధీ ప్రసంగాలకు జనాలు ఇపుడు ఆకర్షితులు అవుతున్నారు. మార్పు కోరే వారికి ఆయన ఒక బెస్ట్ ఛాయిస్ గా ఉన్నారు. ఈ క్రమంలో బీహార్ నుంచి రాహుల్ ఓటు అధికార్ యాత్రను చేపట్టడం నిజంగా వ్యూహత్మకమే అని అంటున్నారు.
డబుల్ ఇంజన్ కి డబుల్ షాక్ :
కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ ల వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని బీజేపీ పెద్దలు తరచూ చెబుతూంటారు. అంతా బాగున్నపుడు అది ఫుల్ పాజిటివ్ గానే సాగుతుంది. తేడా వస్తే డబుల్ షాక్ తగుతుంది అని అంటున్నారు. అది ఎలా అంటే బీహార్ లో చాలా కాలంగా ఎన్డీయే ప్రభుత్వం ఉంది. దాంతో అక్కడ జనాలు మార్పు కోరుకుంటున్నారు అని అంటున్నారు. అలాగే కేంద్రంలో మూడు సార్లు గెలిచిన బీజేపీ మోడీ ప్రభుత్వం ఉంది. ఎంత కాదనుకున్నా అక్కడ కూడా యాంటీ ఇంకెంబెన్సీ ఉంది. దాంతో ఈ డబుల్ ప్రజా వ్యతిరేకతను ఎన్డీయే ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుర్కోవాల్సి వస్తోంది.
ఈ కీలక సమయంలో రాహుల్ గాంధీ జనంలోకి వచ్చారు. ఆయన మోడీ మీద బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఓటు చోరీ జరిగిందని అంటున్నారు. అన్ని అధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు ఆయన విమర్శలకు ఇప్పటి దాకా ధీటైన జవాబు అయితే ఈసీ నుంచి రాలేదు, బీజేపీ నుంచి కూడా రావడం లేదు దాంతో జనాల్లో అయితే ఒక చర్చను ఆయన రేకెత్తించగలిగారు. ఈ క్రమంలో దేశంలో ఉత్తరాదిన కీలక రాష్ట్రంగా ఉన్న బీహార్ లో కనుక ఇండియా కూటమి గెలిస్తే ఆ క్రెడిట్ కచ్చితంగా రాహుల్ గాంధీ ఖాతాలోనే పడుతుంది. అదే సమయంలో జాతీయ స్థాయిలో మోడీకి రాహుల్ నుంచి పెను సవాల్ ఎదురవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
