Begin typing your search above and press return to search.

ఈ ఛాన్స్ మిస్స‌యితే.. ఇక‌, చ‌రిత్ర‌లోకే గాంధీలు!

దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ త‌ర్వాత‌.. ఆయ‌న కుమార్తె ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీలు ప్ర‌ధానులు అయ్యారు.

By:  Garuda Media   |   22 Jun 2026 9:38 AM IST
ఈ ఛాన్స్ మిస్స‌యితే.. ఇక‌, చ‌రిత్ర‌లోకే గాంధీలు!
X

దేశ తొలి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ త‌ర్వాత‌.. ఆయ‌న కుమార్తె ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీలు ప్ర‌ధానులు అయ్యారు. ఆ త‌ర్వాత‌.. కూడా కాంగ్రెస్ పార్టీ 15 సంవ‌త్స‌రాల పాటు.. దేశాన్ని పాలించింది. కానీ.. ఆ స‌మ‌యంలో ప్ర‌ధానులుగా చేసింది.. గాంధీల కుటుంబానికి చెందిన వారు కాదు. ఒక‌రు పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ‌కు చెందిన‌వారు. మ‌రొక‌రు మ‌న్మోహ‌న్‌సింగ్‌. అవిభ‌క్త పాకిస్థాన్‌లో జ‌న్మించిన ఆర్థిక వేత్త‌.

సో.. మొత్తంగా.. 1991 త‌ర్వాత నుంచి అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు 35 ఏళ్లుగా గాంధీల కుటుంబానికి ప్ర‌ధాని ప‌ద‌వి ద‌క్క‌లేదు. మ‌రోవైపు.. గ‌త 12 సంవ‌త్స‌రాలుగా ప్ర‌ధాని పీఠంపై న‌రేంద్ర మోడీనే ఉన్నారు. ఇలా.. గాంధీల కుటుంబానికి ప్ర‌ధాని పీఠం దూర‌మైన నేప‌థ్యంలో మ‌రెప్పుడు.. ఈ ఫ్యామిలీకి ఈ పీఠం ద‌క్కు తుంది? ఎప్పుడు గాంధీలు మ‌రోసారి త‌మ పాల‌న చేస్తారు? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గా మారింది. దీనికి కార‌ణం.. ప్ర‌స్తుతం గాంధీల కుటుంబం నుంచి ఉన్న ఏకైక వార‌సుడు.. రాహుల్ గాంధీకి 56 ఏళ్ల వ‌య‌సు నిండటమే.

తాజాగా ఆయ‌న 57వ సంవ‌త్స‌రంలోని అడుగులు వేశారు. మ‌రో మూడేళ్ల‌పాటు ప్ర‌ధాని మోడీనే కేంద్రంలో చ‌క్రం తిప్ప‌నున్నారు. అంటే.. అప్ప‌టి వ‌ర‌కు రాహుల్‌కు ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం లేదు. ఆ త‌ర్వాత‌... 2029లో జ‌రిగే ఎన్నిక‌ల్లో.. రాహుల్ అదృష్టం.. ప్ర‌జ‌ల ఆశీర్వాదం క‌లిసి వ‌స్తే.. కేంద్రంలో ప‌రిణామాలు మారితే(ఇప్ప‌ట్లో ఆ సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు) అప్పుడు రాహుల్ ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం ఉంది. కానీ, అప్ప‌టికి ఆయ‌న‌కు 60 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చేస్తుంది.

కాగా, గాంధీల కుటుంబం నుంచి ప్ర‌ధానులు అయిన ఇందిర‌మ్మ‌, రాజీవ్‌ల‌ను గ‌మ‌నిస్తే.. వారు 50 ఏళ్ల లోపే ప్ర‌ధానులు అయ్యారు. రాజీవ్ అయితే.. 40 ఏళ్ల లోపు వ‌య‌సులోనే దేశ ప‌గ్గాలు ప‌ట్టారు. అలాంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన రాహుల్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం ఉంటే.. అప్ప‌టికి 60ఏళ్లు నిండుతాయి. ఇక‌, అప్పుడు కూడా ఆయ‌న మిస్ చేసుకుంటే.. మ‌ళ్లీ ఎన్నిక‌ల నాటికి 65 ఏళ్లు ఖాయం. సో.. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌లే రాహుల్‌కు.. ముఖ్యంగా గాంధీల కుటుంబానికి అత్యంత కీల‌కం. అది కూడా విఫ‌ల‌మైతే.. గాంధీల ప్ర‌భ చ‌రిత్ర‌కు ప‌రిమితం అవుతుంద‌న్న చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.