జగన్ కి రాహుల్ గాంధీ ఫోన్ కాల్
దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అంతే కాదు జాతీయ స్థాయి రాజకీయాల ప్రభావం ఏపీ మీద పడబోతోంది అని అంటున్నారు.
By: Satya P | 17 Oct 2026 5:00 AM ISTదేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అంతే కాదు జాతీయ స్థాయి రాజకీయాల ప్రభావం ఏపీ మీద పడబోతోంది అని అంటున్నారు. 2029 ఎన్నికలు టార్గెట్ గా చేసుకుని కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తోంది. అంతే కాదు ఇండియా కూటమీ పటిష్టంగా చేసుకుంటూనే మరింత మంది మిత్రులను ఆకట్టుకోవాలని చూస్తోంది. అంతే కాదు మాజీ కాంగ్రెస్ నేతలను అందరినీ ఇండియా కూటమి గూటికి తీసుకుని రావాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన సంచలనమైన ప్రచారం సాగుతోంది. అదేమిటి అంటే జగన్ కి రాహుల్ గాంధీ ఫోన్ చేసే ఆలోచనలో ఉన్నారు అని. ఈ టాక్ అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ స్థాయిలోనూ పెద్ద ఎత్తున నడుస్తోంది.
జగన్ ని దగ్గరకు తీసుకుని :
ఇండియా కూటమి నేతలు అంతా ఇపుడు ఎన్డీయేతో ఢీ కొడుతున్నారు. దాంతో పాటు ఎన్డీయేకు వైరంగా ఉన్న దూరంగా ఉన్న వారిని తమ వైపు తిప్పుకుంటున్నారు. అదే సమయంలో ఎన్డీయేతో పరోక్షంగా స్నేహం చేసి ఇటీవల కాలంలో కొంత ఎడం పాటిస్తున్న వైసీపీ లాంటి పార్టీలని కాంగ్రెస్ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. సరైన సమయం ఇదేనని ఇండియా కూటమి వైపుగా వైసీపీని ఆకర్షించాలని కూడా కాంగ్రెస్ అగ్ర నేతలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అందుకే త్వరలోనే రాహుల్ గాంధీ జగన్ కి ఫోన్ చేస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. జగన్ కూడా ఒకనాటి కాంగ్రెస్ నాయకుడే కాబట్టి దగ్గరకు తీసుకుంటే అది పవర్ ఫుల్ రాజకీయ వ్యూహం అవుతుందని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భావిస్తోంది అని అంటున్నారు.
ఎన్డీయేకి గుడ్ బై నా :
ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన ఏనాడూ ఎన్డీయేలో లేరు, ప్రత్యక్షంగా కలిసి ఉన్నట్లు కూడా కనిపించలేదు. కానీ 2014 నుంచి 2019 దాకా కేంద్రంలోని బీజేపీతో ఇండైరెక్ట్ చెలిమి నెరిపారు అన్న ప్రచారం ఉంది. ఆనాడు కేంద్రాన్ని బీజేపీని విమర్శించకుండా ఏపీలో టీడీపీనే టార్గెట్ చేస్తూ వచ్చారు అని గుర్తు చేస్తున్నారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నా కేంద్రంలో ఎన్డీయేకు అన్ని బిల్లులలోనూ మద్దతు ఇచ్చింది అని కూడా తలచుకుంటున్నారు. కేంద్రంతో ఎంతో సాన్నిహిత్యంగా మెలిగిన వైసీపీ 2024 ఎన్నికల తరువాత కూడా మౌనంగా ఉంటే దాదాపుగా అదే వైఖరి కనబరచింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అనేక బిల్లులకు మద్దతు ఇచ్చింది. అయితే ఇదంతా 2029లో ఏమైనా మార్పు ఉంటుందేమో అన్న ఆలోచనతోనే అని అంటున్నారు.
మారేది లేదుగా :
అయితే 2029 ఎన్నికల్లోనూ ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలసి పోటీ చేస్తారు అని అంటునారు. ఈ కూటమి బంధం చెక్కు చెదరడం లేదని అంటున్నారు. ఒకరి అవసరాలు మరొకరికి ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు బీజేపీని వీడి ఒకసారి తప్పు చేసి 2019లో ఓటమిని కోరి తెచ్చుకున్న టీడీపీ మళ్ళీ అలా చేయాలని అనుకోవడం లేదని అంటున్నారు. ఇక జనసేన కూడా జాతీయ పార్టీ బీజేపీ అంటే ఎంతో ఇష్టమైన మిత్రుడిగా భావిస్తోంది అని అంటున్నారు. కేంద్రంలో బీజేపీకి ఏపీలో ఎంపీలు కావాలి, మిత్రులు కూడా కావాలి. పైగా 2029 టఫ్ ఫైట్ నడుస్తుంది. దాంతో టీడీపీ అధినేత చంద్రబాబుని పవన్ ని వదులుకునే ఉద్దేశ్యం ఏ కోశానా లేదని అంటున్నారు.
దాంతో ఎన్డీయే కూటమిగా ఈ మూడు పార్టీలు ఉంటే ఏపీలో వైసీపీ ఒంటరిగా చేసే పోరాటం ఒక ఎత్తు అయితే ఎన్నికల వేళ ఎలక్షనీరింగ్ తో పాటు కేంద్ర సాయం కూడా టీడీపీ కూటమికే సానుకూలం అవుతుంది అన్న చర్చ ఉంది. అందుకే తాము కూడా సేఫ్ జోన్ లో ఉండాలని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాలంలో జగన్ ఇండియా కూటమికి అనుకూలంగా ట్వీట్లు వేస్తున్నారు. కాక్రోచ్ పార్టీకి సపోర్టుగా ఉంటున్నారు. దాంతో ఇండియా కూటమి నుంచి ప్రత్యేకించి కాంగ్రెస్ నుంచి జగన్ కి స్నేహ హస్తం అందవచ్చు అని అంటున్నారు. తొందరలో రాహుల్ గాంధీ జగన్ కి ఫోన్ చేస్తారు అన్న వార్తలు అయితే గట్టిగానే ఉన్నాయి. అదే కనుక జరిగితే ఒక్కసారిగా ఏపీ రాజకీయమే కాదు దేశ రాజకీయాల్లో కీలక మార్పులు సంభవించడం ఖాయమని అంటున్నారు.
