ఆటంబాంబ్ అయిపోయింది హైడ్రోజన్ బాంబ్ రాహుల్?
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలు ఎంత ఆచితూచి అన్నట్లు ఉండాలి? అందునా సంచలనం ఖాయమని చెప్పే సందర్భంలో.. మాటల తీవ్రతకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చేతలు ఉండాలి.
By: Garuda Media | 2 Sept 2025 9:25 AM ISTఅత్యున్నత స్థానాల్లో ఉన్న వారి నోటి నుంచి వచ్చే మాటలు ఎంత ఆచితూచి అన్నట్లు ఉండాలి? అందునా సంచలనం ఖాయమని చెప్పే సందర్భంలో.. మాటల తీవ్రతకు ఏ మాత్రం తీసిపోని రీతిలో చేతలు ఉండాలి. కానీ.. కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. దేశంలో ఓట్ల చోరీ జరుగుతుందని తీవ్ర ఆరోపణలు చేయటం.. దీనికి సంబంధించి ఆయన వెల్లడించిన వివరాలు పెద్దగా ప్రభావాన్ని చూపింది లేదు. కొద్దిరోజుల క్రితం ఓట్ల చోరీ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. త్వరలో తాను ఆటంబాంబ్ ను పేలుస్తానని చెప్పటం.. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తే.. ఓట్ల చోరీపై ఆయన చేసిన వ్యాఖ్యలు తుస్సుమనటం తెలిసిందే.
కట్ చేస్తే.. తాజాగా ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను హైడ్రోజన్ బాంబ్ పేల్చనున్నట్లుగా చెప్పారు. ఓట్ల దొంగతనంపై మరిన్ని నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి వస్తుందని.. ఆయన తలెత్తుకోలేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా రిలీజ్ కు ముందు విడుదలయ్యే టీజర్ ఆసక్తికరంగా ఉంటే.. సినిమాకు మరింత హైప్ పెరుగుతుంది. అందుకు భిన్నంగా ఇప్పటికే విడుదలైన పార్ట్ 1 ఆటంబాంబ్ డిజాస్టర్ గా మారిన వేళ.. పార్ట్ 2గా విడుదలయ్యే హైడ్రోజన్ బాంబ్ అంటూ తన మాటలతో హైప్ తెచ్చే ప్రయత్నం చేసినా.. ఎలాంటి ఫలితం లేని పరిస్థితి నెలకొందన్న వాదన వినిపిస్తోంది.
ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని చెబుతున్న రాహుల్ గాంధీ.. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా ఈ ఇష్యూను టేకప్ చేయటం తెలిసిందే. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో నిర్వహించిన కార్యక్రమాన్ని ముగిస్తూ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన రాహుల్.. త్వరలో తాను బయటపెట్టే నిజాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ముఖం చూపించలేని పరిస్థితి నెలకొని ఉంటుందని పేర్కొన్నారు.
ఓటుహక్కును రక్షించేందుకు తాను యాత్ర మొదలు పెట్టినట్లు చెబుతున్న రాహుల్.. తాను చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చేసుకోవటం గమనార్హం. తిరుగులేని అధికారంతో దూసుకెళుతున్న మోడీ లాంటి నేతను ఎదుర్కొనే వేళలో.. మరింత జాగ్రత్తగా కసరత్తు చేసుకోవటం.. తాము అనుకున్న కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని రాహుల్ మరెంత కాలానికి గుర్తిస్తారో చూడాలి.
