Begin typing your search above and press return to search.

జెన్ జీ కోసం రాహుల్.. ఇండోర్ నుంచి మలివిడత పోరు..

ఇప్పటికే మహారాష్ట్రలోని పుణే వేదికగా విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలపై పెద్దఎత్తున చర్చించిన ఆయన, ఇప్పుడు తన తదుపరి పర్యటనకు మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ విద్యా కేంద్రమైన ఇండోర్‌ను ఎంచుకున్నారు.

By:  Tupaki Political Desk   |   31 Aug 2026 12:00 AM IST
జెన్ జీ కోసం రాహుల్.. ఇండోర్ నుంచి మలివిడత పోరు..
X

దేశంలో జెన్ జీ యువత, విద్యార్థుల దృష్టిని ఆకర్షించేలా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కీలక అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని పుణే వేదికగా విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలపై పెద్దఎత్తున చర్చించిన ఆయన, ఇప్పుడు తన తదుపరి పర్యటనకు మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ విద్యా కేంద్రమైన ఇండోర్‌ను ఎంచుకున్నారు. సెప్టెంబర్ 12న ఇండోర్‌లో ‘ఛాట్రోన్ కీ గూంజ్’ (విద్యార్థుల ప్రతిధ్వని) పేరిట భారీ యువజన సదస్సును నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

పుణే నుంచి ఇండోర్‌.. దేశమంతా సదస్సలు?

గతంలో పుణే వేదికగా జరిగిన సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సమస్యలపై రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించాలని విపక్ష నేత ప్లాన్ చేసుకుంటున్నారని, తద్వారా డిజిటల్ గానే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా జెన్ జీతో మమేకయ్యేలా పావులు కదుపుతున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పుణేలో నిర్వహించిన సమావేశం అవడంతో రెండో సమావేశానికి వేదికగా ఇండోర్ ను ఎంచుకున్నారని చెబుతున్నారు. ఈ వేదిక ఎంపిక కూడా వ్యూహాత్మకంగానే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇండోర్ కేవలం వ్యాపార కేంద్రమే కాకుండా, మధ్య భారతదేశంలో అతి పెద్ద విద్యా కేంద్రమని చెబుతున్నారు. ఇక్కడ లక్షలాది మంది యువతీయువకులు ఉంటారని, వారి దృష్టిని ఆకర్షించడమే లక్ష్యంగా రాహుల్ సభ నిర్వహిస్తున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్రంలో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాంలో భాగంగానే రాహుల్ విద్యార్థుల సమస్యలపై పోరాటంలో దూకుడు చూపుతున్నారని అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్నడూ లేనట్లు జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఉద్యమంతో ఆత్మరక్షణలో పడిందని, ఇదే అదునుగా ప్రభుత్వంపై మరింత ఎక్కువగా దాడి చేయడానికి రాహుల్ రంగంలోకి దిగారని అంటున్నారు. నిరుద్యోగ సమస్యలు, విద్యా రంగంలో వైఫల్యాలను ప్రధాన అస్త్రాలుగా మలచుకోవడం ద్వారా విద్యార్థుల గొంతుకగా తాను మారానని చాటిచెప్పుకునేలా రాహుల్ కార్యక్రమం రూపొందించారని అంటున్నారు.

‘ఛాట్రోన్ కీ గూంజ్’ ద్వారా 'జెన్-జీ' (Gen-Z) తరంతో మమేకం కావాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారని చెబుతున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీల వల్ల నష్టపోయిన లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడమే ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. మున్ముందు రాహుల్ గాంధీ ప్రయాణం మొత్తం ఈ విధంగానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇండోర్ సభ తర్వాత రాహుల్ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించే అవకాశం ఉందని అంటున్నారు. యువతను నేరుగా కలుసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీ పట్ల యువతలో సానుకూల వైఖరి పెంపొందించేలా రాహుల్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి, యువత సమస్యల చుట్టూ జాతీయ రాజకీయాలను కేంద్రీకరిస్తూ రాహుల్ గాంధీ వేస్తున్న ఈ అడుగులు భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.