Begin typing your search above and press return to search.

ఫారిన్ టూర్ కు మరోసారి రాహుల్? ఈసారైనా అందరికి చెప్పే వెళతారా?

మిగిలిన రంగాల్ని వదిలేస్తే.. ప్రజా జీవితంలో ఉన్న వారు.. అందునా అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు పలుజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

By:  Garuda Media   |   20 Jun 2026 4:00 PM IST
ఫారిన్ టూర్ కు మరోసారి రాహుల్? ఈసారైనా అందరికి చెప్పే వెళతారా?
X

మిగిలిన రంగాల్ని వదిలేస్తే.. ప్రజా జీవితంలో ఉన్న వారు.. అందునా అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు పలుజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ లాంటి పార్టీకి అగ్రనేతగా ఉన్న వ్యక్తి.. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాల్ని వేలెత్తి చూపే అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా వ్యవహరించే తీరు ఆ స్థాయి నేతల్ని ఇరుకున పడేసేలా చేస్తుంది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు తరచూ చర్చకు తెర తీస్తుంటాయి? ఎన్నో ప్రశ్నలకు.. సందేహాలకు తావిచ్చేలా చేస్తాయి. తాజాగా ఆయన మరోసారి విదేశీ పర్యటనకు వెళుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అధికారికంగా రాహుల్ గాంధీ విదేశాలకు వెళుతున్నట్లుగా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాకుంటే ఒకట్రెండు ప్రముఖ మీడియా సంస్థలు మాత్రం రాహుల్ గాంధీ విదేశీ పర్యటన కోసం శనివారం ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో నిజమెంత? అన్నది ఈ రోజు చివరి నాటికి స్పష్టత వచ్చే వీలుంది. అయితే.. సమస్య అంతా ఆయన తన విదేశీ పర్యటనల గురించి అధికారికంగా చెప్పేస్తే సరిపోతుంది. అందుకు భిన్నంగా గుట్టుచప్పుడు కాకుండా పలుమార్లు వెళ్లి రావటమే రాహుల్ తో ఉన్న ఇబ్బంది అంతా.

మే లో రాహుల్ గాంధీ ఒమన్ టూర్ కు వెళ్లినప్పుడు ఆయన విదేశీ ప్రయాణాలపై బీజేపీ తీవ్రమైన ఆరోపణలు చేయటమే కాదు.. పలు ప్రశ్నలను సంధిస్తూ కొత్త చర్చ(రచ్చ)కు తెర తీశారు. నిజానికి గతంలోనూ రాహుల్ గాందీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు.. ఆయన వ్యక్తిగత పర్యటనల్ని రహస్యంగా ఉంచుతారు.కాకుంటే..రాహుల్ లాంటి అగ్రనేతలు రహస్యంగా ఉంచటం ద్వారా మరిన్ని అనుమానాలకు.. సందేహాలకు తావిచ్చే పరిస్థితి. దీని కంటే.. ఫలానా కారణంతో ఫలానా దేశానికి వెళుతున్న విషయాన్ని ప్రకటిస్తే.. చర్చ అక్కడితో ఆగుతుంది. అందుకు భిన్నంగా ఎవరికి తెలియకుండా వెళ్లటం.. ఆ విషయంలో ఏదో అంశంలో బయటకు రావటం.. పలు ఊహాగానాలకు అవకాశం ఇస్తున్న పరిస్థితి.

రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ముగిసిన రెండో రోజునే విదేశాలకు ప్రయాణం పెట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. అధికారికంగా మాత్రం ఇప్పటివరకు షెడ్యూల్ విడుదల కాలేదు. మేలో విదేశీ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన విదేశీ ప్రయాణాల గురించి బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. 22 ఏళ్లలో 54 విదేశీ పర్యటనలు చేశారని..అందుకు భారీగా ఖర్చు అయినట్లుగా పేర్కొంటూ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ 54 టూర్లకు రాహుల్ చేసిన ఖర్చు రూ.60 కోట్లుగా పేరర్కొంటూ.. ఆయన ఇచ్చిన పన్ను డిక్లరేషన్ లో మాత్రం చూపించిన ఆదాయం రూ.11 కోట్లుగా పేర్కొన్నారు. మిగిలిన నిధులకు సంబంధించిన మూలాల్ని వెల్లడించాలని డిమాండ్ చేసిన పరిస్థితి.

ఈ ఇష్యూ ఇప్పటికి ఒక కొలిక్కి రాని వేళలో.. మరోసారి విదేశీ టూర్ కు రాహుల్ వెళుతున్నట్లుగా వస్తున్న వార్తల్ని చూస్తే.. ఈసారైనా అనవసరమైన రచ్చకు అవకాశం ఇవ్వకుండా రాహుల్ టీం జాగ్రత్తలు తీసుకుంటుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. మేలో రాహుల్ విదేశీ పర్యటన మీద కేంద్ర ప్రభుత్వం సైతం.. ‘ఆయన తన విదేశీ పర్యటనల వివరాల్ని దాచటం జాతీయ భద్రత పరంగా ఆందోళనకరం’ అని పేర్కొన్న తీరు చూస్తే..రాహుల్ తన తీరును కాస్త మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ప్రజాజీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరాలని తపించేవారు.. తమ వ్యక్తిగత అంశాల విషయంలో మరింత పారదర్శకంగా ఉంటూ.. ప్రజలకు ఎలాంటి సందేహాలకు అవకాశం ఇవ్వకుండా ఉండేలా వ్యవహరించటం చాలా అవసరం. మరి.. రాహుల్ ఈ విషయాన్ని గుర్తిస్తారా? అన్నదే అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.