Begin typing your search above and press return to search.

రాహుల్‌ గాంధీ ప్రదర్శించిన ఫొటోపై బ్రెజిల్‌ మోడల్‌ స్పందన

హరియాణాలో జరిగిన ఎన్నికల సందర్భంగా నకిలీ ఓట్ల వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

By:  A.N.Kumar   |   6 Nov 2025 9:00 PM IST
రాహుల్‌ గాంధీ  ప్రదర్శించిన ఫొటోపై బ్రెజిల్‌ మోడల్‌ స్పందన
X

హరియాణాలో జరిగిన ఎన్నికల సందర్భంగా నకిలీ ఓట్ల వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి ఈ వివాదంలోకి నేరుగా ఓ బ్రెజిల్‌ మోడల్‌ రావడం పెద్ద సంచలనం సృష్టించింది. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఒక మహిళ ఫొటోను ప్రదర్శిస్తూ, ఈ ఫొటోతోనే నకిలీ ఓట్లు సృష్టించారని ఆరోపించారు.

* ఎవరా మహిళ?

రాహుల్‌ గాంధీ ప్రెస్‌మీట్‌లో చూపించిన ఆ ఫొటోపై నెటిజన్లు తీవ్రంగా దృష్టి సారించారు. ఇంటర్నెట్‌లో విస్తృతంగా శోధించగా, ఆ మహిళ భారతీయురాలు కాదని, ఆమె పేరు లారిసా నెరీ అని, బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌ మరియు డిజిటల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ అని తేలింది. కొద్ది గంటల్లోనే ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌లోకి వచ్చింది.

* లారిసా నెరీ స్పందన

తన ఫొటో భారత రాజకీయాల్లో చర్చనీయాంశం కావడంపై లారిసా నెరీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వీడియో షేర్‌ చేశారు. ఈ అనూహ్య పరిణామంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తీవ్రంగా స్పందించారు. “నేను పూర్తిగా షాక్‌ అయ్యాను. ఒక్కసారిగా నన్ను భారతీయురాలిగా, ఓట్ల స్కామ్‌లో భాగంగా చూపించారు. అది నా పాత ఫొటో సుమారు 18 లేదా 20 ఏళ్ల వయసులో తీసుకున్నది. అది ఒక స్టాక్‌ ఇమేజ్‌ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుంది. ఎవరైనా దానిని కొనుగోలు చేసి ఉండవచ్చు. కానీ దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం పూర్తిగా తప్పు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

లారిసా మరింతగా వివరిస్తూ, భారత రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. “నేను బ్రెజిల్‌కి చెందిన డిజిటల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను. ఇప్పుడు నా ఫోన్‌ ఆగడం లేదు. అనేక మీడియా సంస్థలు ఇంటర్వ్యూల కోసం సంప్రదిస్తున్నాయి. ఇలా వైరల్‌ అవుతానని జీవితంలో ఎప్పుడూ ఊహించలేదు,” అని ఆమె తెలిపారు.

* రాహుల్‌ గాంధీ ఆరోపణలు

గత సంవత్సరం హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 25 లక్షల నకిలీ ఓట్లు నమోదయ్యాయని, వాటి కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చిందని రాహుల్‌ గాంధీ ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు. ఈ సందర్భంగానే లారిసా ఫొటోను ప్రదర్శిస్తూ, “ఈ ఫొటోతో 22 నకిలీ ఓట్లు సృష్టించారంట. ఈసీఐ (ECI) ఎందుకు దీనిపై చర్య తీసుకోలేదో అర్థం కావడం లేదు” అని ఆయన ఎన్నికల సంఘం (ECI) ని నిలదీశారు.

ఈ మొత్తం వ్యవహారంపై ఫ్యాక్ట్‌ చెకర్‌ మహమ్మద్‌ జుబేర్‌ వంటి వారు లారిసా వీడియోను తన ఎక్స్‌ (X) ఖాతాలో షేర్‌ చేయడంతో ఈ విషయం మరింతగా వైరల్‌ అయింది. ఈ ఘటనతో సోషల్‌మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఒకవైపు రాహుల్‌ గాంధీ ప్రెస్‌మీట్‌పై విమర్శలు వస్తుండగా, మరోవైపు లారిసా నెరీపై చూపిన ఆసక్తి కారణంగా ఆమె పేరు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌లోకి వచ్చింది.