Begin typing your search above and press return to search.

మిష్టర్ మోడీ....రాహుల్ పవర్ ఫుల్ సౌండ్ !

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దూకుడు మామూలుగా లేదు. ఆయన వరుసగా ఢిల్లీలో ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు.

By:  Satya P   |   10 Oct 2026 10:47 PM IST
మిష్టర్ మోడీ....రాహుల్ పవర్ ఫుల్ సౌండ్ !
X

ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దూకుడు మామూలుగా లేదు. ఆయన వరుసగా ఢిల్లీలో ఉద్యమాలు చేస్తూ వస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఉన్న జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ తో పాటు విపక్షాలలోనూ వేడిని పుట్టించారు. ప్రస్తుతం ఈ ఉద్యమం సీజేపీ సహా ఇతర వర్గాలకు పాకింది. న్యాయవాదులు మేధావులు ఇలా అనేక వర్గాలు ఇదే అంశం మీద గొంతు విప్పుతున్నారు. ఢిల్లీలో ఎన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా వేలాది మందిని అరెస్టు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మిష్టర్ మోడీ అంటూ బిగ్ సౌండ్ చేశారు.

మిమ్మల్ని చుట్టుముడతాం :

మీరు ఎంత మందిని అరెస్టు చేసుకుంటారో చేసుకోండి, అంతే కాదు యువతను నిర్భందించండి, నేతలను కూడా వదలవద్దు, అయితే మేము మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. మీరు ఎంత మంది పోలీసు బలగాలని తెచ్చుకున్నా ఆగేది లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పది వేలు ఇరవై వేలు కాదు, యాభై వేల మంది పోలీసులను ఢిల్లీలో దించినా కూడా ఉద్యమాలు ఎక్కడా తగ్గవని ప్రతిపక్ష నేత గట్టిగానే చెప్పేశారు. మా ఆందోళనలు నిరసనలతో మిమ్మల్ని చుట్టుముడతామని రాహుల్ గాంధీ హెచ్చరించారు.

పాలకులను దించుతాం :

ఈ దేశంలోని పాలకులతో పాటు ఆర్ఎస్ఎస్ తో కూడా పోరాడుతున్నాను అని రాహుల్ చెప్పారు. దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గడచిన పది పన్నెండేళ్లలో దేశంలో ఏమి జరిగింది అన్నది అందరికీ తెలుసు అని ఆయన అన్నారు. రాజ్యాంగం మీద దాడి చేస్తున్న పాలకులను అసలు వదిలేది లేదని కూడా రాహుల్ ప్రతిన పూనారు, ఈ దేశ యువతరాన్ని చూసి తాను గర్విస్తున్నాను అని ఆయన అన్నారు. యువత తమ పోరాటాలను ఆపవద్దు అని ఆయన సూచించారు. మీ వెనక మేము ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు.

నిరసనల హోరు :

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఇంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వడం బట్టి చూస్తూంటే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలను చేయడానికి సిద్ధమని అర్ధం అవుతోంది. అరెస్టులను తాము మెడళ్స్ కింద భావిస్తామని తాజాగా రాహుల్ చెప్పారు. రాహుల్ గాంధీ జెన్ జీ యువతతో సమానంగా రంగంలోకి దిగి పోరాటం చేస్తున్నారు. ఆయన బారికేళ్లను చేదించుంటూ మరీ నిరసనకారులకు కొత్త ఉత్సాహం ఇస్తున్నారు. అదే సమయంలో వీధి పోరాటాలే కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని దారికి తేవడానికి పరిష్కార మార్గాలుగా కాంగ్రెస్ భావిస్తోంది అని అంటున్నారు. అందుకే ఎన్ని రోజులు అయినా మేము రెడీ అని రాహుల్ గాంధీ గట్టిగా చెబుతున్నారని అంటున్నారు.

జంతర్ మంతర్ వద్దకే :

ఇక జంతర్ మంతర్ వద్ద మరో భారీ నిరసనకు ఇండీ కూటమి నేతలు ఎంపీలు అంతా సిద్ధమవుతున్నారు. ఈ నెల 12న అక్కడకు నేతలు అంతా చేరుకుని భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తారు అని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా తప్ప మరోటి తమకు ఆమోదం కాదని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మిష్టర్ మోడీ అంటూ రాహుల్ విడుదల చేసిన వీడియో బైట్ అయితే సర్వత్రా వైరల్ అవుతోంది. రానున్న రోజులలో ప్రతిపక్షాల పోరాటం కూడా కొత్త రూపు దాల్చనుంది అని అంటున్నారు.