ఆదివాసీలు దళితులు అర్హులు కారా...రాహుల్ సంధించిన సూటి ప్రశ్న !
భారత దేశంలో ఆదివాసీలు దళితుల పరిస్థితులు అందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఇంకా వారి జీవితాలకు అసలైన ఉదయం రాలేదని అంతా అంటారు.
By: Satya P | 29 Aug 2025 11:55 AM ISTభారత దేశంలో ఆదివాసీలు దళితుల పరిస్థితులు అందరికీ తెలిసిందే. స్వాతంత్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఇంకా వారి జీవితాలకు అసలైన ఉదయం రాలేదని అంతా అంటారు. దానికి పాలకుల వైపు నుంచి ఉదాశీనత ఒక కారణం అని వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో వారి కోసం ఎన్ని చట్టాలు చేసినా కూడా అమలులో లోపాలా లేక వారు అందుకోవడంలో అవరోధాలా అన్నది తెలియదు కానీ ఇంకా అత్యధిక శాతం మంది అలాగే పేదరికంలోనే ఉంటున్నారు. కొన్ని అత్యున్నత అందలాలు వారికి ఇంకా దక్కడం లేదు అన్నది కళ్ళకు కట్టిన దృశ్యం.
ఎంత మంది సీఈవోలుగా ఉన్నారు :
దేశంలో అయిదారు వందల పెద్ద కంపెనీలు ఉన్నాయనుకుంటే అందులో ఎంతమంది దళితులు ఆదీవాసులు సీఈవోలుగా ఉన్నారు అన్న ప్రశ్నను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంధించారు. ఆయన బీహార్ రాష్ట్ర పర్యటనలో చాలా విషయాల మీద మాట్లాడుతున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న బడుగులు దళితులు ఇంకా అలాగే ఉన్నారు అన్నది ఆయన తాజాగా వ్యక్తం చేసిన ఆవేదనగా కనిపిస్తోంది. దేశంలో ఎన్నో ఆసుపత్రులు ఉన్నాయని కానీ దళితులు ఆదివాసుల చేతులలో ఎన్ని ఉన్నాయని కూడా ఆయన ప్రశ్నించారు ఎంతసేపూ వారు తమకు వచ్చిన జబ్బులని నయం చేసుకునేందుకు ఆసుపత్రుల వెంట తిరుగుతూ లక్షలలో బిల్లులు కట్టడమేనా అని కూడా ఆయన అన్నారు. అంత డబ్బు వారి వద్ద ఉంటుందా అని కూడా రాహుల్ ప్రశ్నించారు.
ఓబీసీల నుంచి దళితుల దాకా :
రాహుల్ గత కొన్నాళ్ళుగా ఓబీసీల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు కుల గణన చేయాలని ఆయన చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఆ విధంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అంటే ఒక విధంగా అది రాహుల్ గాంధీ సాధించిన విజయం అని కాంగ్రెస్ వర్గాలు గొప్పగా చెబుతూ వస్తున్నాయి ఇపుడు కాంగ్రెస్ కి సంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఉన్న దళితులు ఆదీవాసుల గురించి రాహుల్ మాట్లాడుతున్నారు వారి జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని ఆయన విమర్శిస్తున్నారు. దేశం ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా దళితులు ఆదీవాసులు అలాగే మిగిలిపోవడం కంటే ఆవేదన ఏమి ఉంటుందని అంటున్నారు.
మరింత దగ్గరగా :
ఇదిలా ఉంటే దళితులు ఆదీవాసులకు మరింత దగ్గర అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది ఒకనాడు ఈ వర్గాలు అన్నీ కాంగ్రెస్ కి ఎంతో వెన్ను దన్నుగా ఉంటూ వచ్చేవి. ఇపుడు కొన్ని ప్రాంతీయ పార్టీల వైపు అవి మళ్ళిపోతున్నాయి. దాంతో ఆయా వర్గాలను తిరిగి అక్కున చేర్చుకునే క్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత ఈ విధంగా వ్యాఖ్యానించారు అని అంటున్నారు నిజానికి ఆయన లేవనెత్తిన ప్రశ్న సహేతుకంగా ఉంది. ఎంతో ఆలోచింప చేస్తున్నట్టుగా ఉంది. ఈ దేశంలో జరిగే అభివృద్ధిలో వారి పాత్రని కూడా మరోసారి చర్చించుకునేలా ఉంది. ఇది పాలకులకు సూటి ప్రశ్నగానే చూడాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ రాజకీయంగానే కాదు సామాజికపరంగా సిద్ధాంతపరంగా కూడా గట్టిగా నిలదీస్తున్న నేపథ్యం కూడా ఇందులో కనిపిస్తోంది. మరి ఈ ప్రశ్నలకు బదులు ఏలికలే ఇవ్వగలరు మరి బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
