మోడీ ఓపెన్ డిబేట్ విత్ రాహుల్...జనం కోరిక కూడానా ?
ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆయన అనేక అంతర్జాతీయ వేదికలు పంచుకున్నారు.
By: Satya P | 4 Nov 2026 7:00 AM ISTప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఆయన అనేక అంతర్జాతీయ వేదికలు పంచుకున్నారు. ఈ రోజున ప్రపంచ అగ్ర నేతలలో ఒకరిగా ఉన్నారు. పన్నెండేళ్లుగా దేశ ప్రధానిగా కొనసాగుతున్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కూడా మోడీ గురించే చెబుతారు. అయితే మోడీ ఎక్కువగా బహిరంగ సభలలోనే మాట్లాడుతారు, అలాగే సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఆయన మీడియా ముందుకు రారు అని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తారు. మోడీ ఇన్నేళ్ళ ప్రధాని పదవీ కాలంలో మీడియాతో ఇంటరాక్ట్ అయినది బహు తక్కువగానే అంటారు. అలాంటి మోడీని లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తనతో ఓపెన్ డిబేట్ కి రావాలని కోరుతున్నారు.
మోడీ ఆరోపణలకు కౌంటర్ :
తన మీద విపక్షం మీద మోడీ చేసిన విమర్శలకు కౌంటర్ గానే రాహుల్ గాంధీ మోడీని బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేస్తున్నారు. ఢిల్లీలో నవంబర్ 1న ప్రతిపక్షాలు నిర్వహించిన నిరసనల అనంతరం ప్రతిపక్షాలు దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నాయని విదేశీ శక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. దీనికి కౌంటర్‌గా రాహుల్ గాంధీ స్పందిస్తూ అసలు ఎవరికి విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నాయో తేల్చుకుందామని మోదీకి సవాల్ విసిరారు. అంతే కాదు ఈ విషయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఏ వేదికైనా ఏ సమయమైనా చర్చకు తాను సిద్ధమేనని ప్రకటించారు. ఇద్దరం ఒకే టేబుల్ పై కూర్చుని చర్చిద్దామని కూడా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.
జడ్జిగా మోహన్ భగవత్ :
ఇక ఈ ఓపెన్ డిబేట్‌కు ప్రధాని మోదీకి నచ్చిన వారిని జడ్జిగా పెట్టుకోవచ్చని కూడా రాహుల్ అంటున్నారు. అంతగా బీజేపీ వారికి కావాలంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను కూడా న్యాయనిర్ణేతగా నియమించుకోవచ్చని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం విశేషం. దేశ ఆర్థిక వ్యవస్థ అమెరికా డీల్స్, అదానీ వ్యవహారం, విదేశీ శక్తుల జోక్యం వంటి పలు కీలక అంశాలపై ప్రధాని మోడీ తో బహిరంగంగా చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు రాహుల్ గాంధీ తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంతే కాదు ఆయన సోషల్ మీడియా పోల్ ని కూడా పెట్టారు. రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ ఓపెన్ డిబేట్ చూడాలనుకుంటున్నారా అని యువతను అడుగుతూ ఈ పోల్ పెట్టారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగి ఆదిత్యనాథ్ వంటి సీనియర్ బీజేపీ నేతలను ట్యాగ్ చేస్తూ తనతో చర్చకు ప్రధానిని చర్చకు ఒప్పించాలని కూడా కోరారు.
బిగ్ డిబేట్ గానే :
నిజానికి ఈ తరహా ఓపెన్ డిబేట్ ప్రధానికి విపక్ష నేతకు మధ్య జరిగితే అంది ఆహ్వానించదగిన పరిణామమే అని అంటున్నారు. ఎందుకంటే ప్రజలకు నేరుగా అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు. నిజంగా ఒకే ఫ్రేమ్ లో మోడీని రాహుల్ ని చూడాలని దేశ జనం కూడా కోరుకుంటున్నారు. కానీ అది జరిగే అవకాశాలు అయితే తక్కువ అని అంటున్నారు.
పార్లమెంట్ లోనే చర్చ :
అయితే రాహుల్ గాంధీ ఓపెన్ డిబేట్ డిమాండ్ కి బీజేపీ గట్టిగానే స్పందించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఏ అంశంపైన అయినా చర్చించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సమావేశాలు సాగనివ్వకుండా గొడవ చేస్తారని విమర్శించారు. రాహుల్ ఇప్పటికైనా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. అలాగే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇతర బీజేపీ నేతలు రాహుల్ గాంధీ మోడీకి చేసిన సవాల్‌ను తప్పుబడుతూ విమర్శించారు.
