56 ఏళ్ళ రాహుల్.... ప్రధాని అయ్యేదెపుడు ?
గాంధీల వంశంలో అయిదవ తరానికి చెందిన వారు రాహుల్ గాంధీ. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నేత గా వ్యవహరిస్తున్నారు.
By: Satya P | 19 Jun 2026 9:12 AM ISTగాంధీల వంశంలో అయిదవ తరానికి చెందిన వారు రాహుల్ గాంధీ. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ అగ్ర నేత గా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ ర్యాంక్ పదవిలో కుదురుకున్నారు. రాహుల్ గాంధీ రెండున్నర దశాబ్దాల పార్లమెంటరీ జీవితంలో ఆయనకు దక్కిన ఏకైన అధికార పదవి ఇదే. రాహుల్ గాంధీ 34 ఏళ్ల ప్రాయంలో తొలిసారి ఎంపీ అయ్యారు. 54 ఏళ్ళకు మెయిన్ అపోజిషన్ లీడర్ అయ్యారు. ప్రధాని పదవి మాత్రం ఆయనకు అందని పండుగా మారింది. ఇక ఈ రోజు రాహుల్ గాంధీ పుట్టిన రోజు. ఆయన 1970 జూన్ 19న రాజీవ్ గాంధీ సోనియాగాంధీల తొలి సంతానంగా జన్మించారు.
ముత్తాత నెహ్రూ ఆ ఏజ్ లో :
రాహుల్ గాంధీ ముత్తాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సరిగ్గా 58 ఏళ్ళ వయసులో దేశానికి ప్రధాని అయ్యారు. ఇక నాన్నమ్మ శ్రీమతి ఇందిరా గాంధీ 47 ఏళ్ళ వయసులో ప్రధాని అయ్యారు. తండ్రి రాజీవ్ గాంధీ కేవలం నలభై ఏళ్ళ వయసులోనే ప్రధాని అయిపోయారు. రాహుల్ గాంధీ అయితే ఈ ముగ్గురిలో ఇద్దరి వయసుని ఏనాడో దాటేశారు. ముత్తాత నెహ్రూ ప్రధాని అయిన 58 ఏళ్ళ వయసుకు కూడా రాహుల్ ప్రధాని అయ్యే చాన్స్ లేదు. ఎందుకంటే 2028 నాటికి ఆయనకు ఆ వయసు వస్తుంది. 2029 లో ప్రధాని అయితే 59 ఏళ్లకు అయినట్లు లెక్క. మరి ఆ దిశగా రాహుల్ గాంధీ ప్రయత్నాలు సాగుతున్నాయా అన్నదే చర్చ.
దూకుడు నిర్ణయాలతో :
ఇక ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ దూకుడుగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిది చూస్తే తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చీ రాగానే డీఎంకేకి కటీఫ్ ఇచ్చేసి విజయ్ స్థాపించిన టీవీకేతో జట్టు కట్టడం, దీని వల్ల అరవై ఏళ్ల తరువాత తమిళనాడు ప్రభుత్వంలో చేరి రెండు మంత్రి పదవులు కాంగ్రెస్ అందుకుంది. అలాగే ఒక రాజ్యసభ సీటు దక్కింది. ఫ్యూచర్ లో మరిన్ని అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. ఇది రాహుల్ వేసిన తెలివైన ఎత్తుగడగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కర్ణాటకలో ట్రబుల్ షూటర్ డీకే శివ కుమార్ ని సీఎం గా చేయడం ద్వారా అక్కడ 2028 ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి అవసరమైన లీడర్ షిప్ ని తెచ్చి పెట్టామని కాంగ్రెస్ అంటోంది. రాహుల్ గాంధీ తీసుకున్న ఈ నిర్ణయం కూడా బెస్ట్ అని పార్టీ నేతలు చెబుతున్నారు. అలాగే కేరళ సీఎం గా సతీషన్ కి చాన్స్ ఇవ్వడం ద్వారా గ్రౌండ్ లెవెల్ లో పనిచేసే నేతలకు పెద్ద పీట అని రాహుల్ రుజువు చేశారు అని అంటున్నారు. ఇలా దక్షిణాదిన కాంగ్రెస్ కమ్ముకునేలా రాహుల్ కొత్త ప్లాన్స్ తో ముందుకు వచ్చారని అంటున్నారు.
యూత్ తో భేటీలు :
ఇక దేశం దశ దిశను మలుపు తిప్పే విధంగా యువతతో భేటీలు వేస్తున్నారు. ఈ రోజున యువత ఆవేశంగా ఉంది. అసహనంగా ఉంది, వారితో కలసి పోరాటం చేయడం ద్వారా అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ వైపు అనుకూలతగా మళ్ళించాలని రాహుల్ దేశవ్యాప్త పర్యటనలు చేపట్టారు. వివిధ రాష్ట్రాలలో యువతతో కలసి ఉద్యమాలు నిర్వహించడం విద్యార్ధులతో నేరుగా ముఖా ముఖీ సమావేశాలు నిర్వహించడం రాహుల్ కొత్త ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు.
మిత్రుల విషయంలో కచ్చితం :
ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు మారాలని రాహుల్ గాంధీ బలంగా కోరుకుంటున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన కూటమి మీట్ లో ఆయన మాట్లాడుతూ దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో కొత్త విధానం కొత్త వ్యూహాలు, కొత్త ఎత్తుగడలు, కొత్త పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తాను పోరాడుతాను అని మిత్రులు కూడా అదే విధంగా చేయాలని రాహుల్ కోరారు. అంతా కలసి ముందుకు సాగాలన్నది ఆయన ఆలోచనగా ఉంది.
ఆశ అక్కడే మరి :
బీజేపీ 2014 నుంచి అధికారంలో ఉంది. 2029 నాటికి పదిహేనేళ్ళ కాలం పూర్తి అవుతుంది. దాంతో సహజంగానే బీజేపీ మీద ఉండే తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ కి ఇండియా కూటమికి అనుకూలతగా మారుతుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అదే సమయంలో దేశంలోని వివిధ సెక్షన్లు అసంతృప్తిగా మోడీ పాలన మీద ఉన్నాయని ఆయన ఊహిస్తున్నారు. అలాగే యువత ఆగ్రహంగా ఉందని ఇవన్నీ కలసి వచ్చే అంశాలుగా బేరీజు వేసుకుంటున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీ తన రాజకీయ జీవితాన్ని అంతగా సీరియస్ గా తీసుకోకుండా మొదలెట్టారని విమర్శలు వచ్చినా ఇపుడు ఆయన రాటు దేలారని కాబోయే ప్రధాని ఆయనే అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
