భారీకేడ్లు దూకిన రాహుల్, అగ్రనేతలో ఊహించని మార్పు.. కాంగ్రెస్‌లో కొత్త జోష్!
పోలీసుల వలయాలను, భారీ బారికేడ్లను సైతం లెక్కచేయకుండా ఆయన ఏకంగా బారికేడ్ల పైకి ఎక్కి, చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుని నిరసన తెలపడం దేశవ్యాప్తంగా మీడియాలో ప్రధానాంశంగా మారింది.
By: Tupaki Political Desk | 6 Oct 2026 4:25 PM ISTకాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనుసరిస్తున్న తీరు ఇప్పుడు సర్వత్ర ఆసక్తి రేపుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు, ప్రత్యక్ష ఆందోళనల్లో ముందుండి నడిపిస్తున్న విధానం జాతీయ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ 'ఇండియా' కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ వైపు సాగిన కవాతు సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన రీతిలో స్పందించారు. పోలీసుల వలయాలను, భారీ బారికేడ్లను సైతం లెక్కచేయకుండా ఆయన ఏకంగా బారికేడ్ల పైకి ఎక్కి, చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుని నిరసన తెలపడం దేశవ్యాప్తంగా మీడియాలో ప్రధానాంశంగా మారింది.
ప్రధాన ప్రతిపక్ష నేతగా, రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాహుల్ గాంధీ ఒక సామాన్య కార్యకర్తలా క్షేత్రస్థాయిలో పోలీసులను ఎదుర్కొన్న వైనం కాంగ్రెస్ కేడర్‌కు పూనకం తెప్పిస్తోందని అంటున్నారు. కేవలం పార్లమెంటరీ చర్చలు, ప్రసంగాలు, విమర్శలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై నేరుగా రోడ్డెక్కి పోరాడటమే తమ వ్యూహమని ఆయన ఈ ఘటన ద్వారా నిరూపించినట్లుగా భావిస్తున్నారు. బారికేడ్లపై ఆయన నిలబడి నినాదాలు చేస్తున్న దృశ్యాలు, పోలీసులతో వాగ్వాదానికి దిగిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2014లో కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయింది. పార్టీని మళ్లీ పూర్వవైభవం దిశగా నడిపించేందుకు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాహుల్ గాంధీ గత కొన్నేళ్లుగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే చారిత్రాత్మక 'భారత్ జోడో యాత్ర' దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి మైలురాయిగా నిలిచింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్ల మేర నడిచిన రాహుల్ ప్రజలతో మమేకమయ్యారు. రాహుల్ చేపట్టిన ఈ యాత్ర తర్వాతే దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ, కేరళం రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెబుతున్నారు. భారత్ జోడో యాత్రతో ప్రారంభమైన రాహుల్ దూకుడు, ఆ తర్వాత నుంచి పార్లమెంట్ లోపల బయటా కూడా స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
కేవలం ఎన్నికల వేళల్లోనే కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారీ తాను ముందుంటానని రాహుల్ సంకేతాలిస్తున్నారని చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల సమయంలో ఏకంగా పోలీస్‌స్టేషన్ బయట బైఠాయించి మెరుపు ధర్నా చేయడం, ఇప్పుడు ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ నేరుగా రోడ్లపైకి వచ్చి పోరాడటం కాంగ్రెస్ అగ్రనేత శైలిలో వచ్చిన మౌలిక మార్పునకు నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న ఈ తెగువ కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతుండగా, అధికార బీజేపీకి మాత్రం ఇది రాజకీయంగా గట్టి సవాల్‌గా మారుతోందని విశ్లేషిస్తున్నారు.
