10 శాతం చేతుల్లోనే ఆర్మీ.. రాహుల్ వ్యాఖ్యలపై కలకలం
బిహార్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ రాహుల్ గాంధీలో ఫ్రస్టేషన్ కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి.
By: Tupaki Political Desk | 5 Nov 2025 5:00 PM ISTబిహార్ పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ రాహుల్ గాంధీలో ఫ్రస్టేషన్ కొట్టచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. పదే పదే రాహుల్ వ్యాఖ్యలతో విసిగిపోయిన మిత్ర పక్షాలు కాంగ్రెస్ ను దూరం పెడుతూవస్తున్నాయి. బిహార్ లో మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ రాహుల్ ను సంప్రదించకుండానే తానే సీఎం అభ్యర్థినని ప్రకటించారు. తేజస్వి నిర్ణయం.. అందరూ ఒకే చెప్పడంతో రాహుల్ కేవలం ప్రేక్షకపాత్ర వహించడం మాత్రమే జరిగింది. బిహార్ ఎన్నికల పోరులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు దారితీశాయి. ఎన్నికల ప్రచార వేదికలపై ‘దేశ సైన్యం కూడా కేవలం 10 శాతం జనాభా చేతుల్లోనే ఉంద’న్న వ్యాఖ్య ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. ఈ వ్యాఖ్యను అగ్రకులాలపై వ్యంగ్యంగా చేసినట్లు భావించిన బీజేపీ, ఆయనపై తీవ్రమైన విమర్శలు ప్రారంభించింది.
‘90 శాతం ప్రజలకు ప్రాతినిధ్యం లేదు’
బిహార్‌లోని కుటుంబలో జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. ‘దేశ జనాభాలో 90 శాతం మంది దళితులు, మహాదళితులు, వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, మైనారిటీ వర్గాలవారే ఉన్నారు.. కానీ 500 పెద్ద కంపెనీల్లో వారి ప్రాతినిధ్యం లేదు. అన్ని కీలక పదవులు, అవకాశాలు, సైన్యంలోనూ ఆధిపత్యం ఆ టాప్ 10 శాతం ప్రజలదే’ అన్నారు. ఈ వ్యాఖ్యలో ఆయన ఉద్దేశం సామాజిక సమానత్వంపై దృష్టి సారించడమా లేక సైన్యాన్ని తక్కువ చేసి చూడడమా అని ఎవరికి వారు వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆయన వాక్యాలు సైన్యం లాంటి జాతీయ సంస్థలను ‘కులం’తో అనుసంధానం చేయడంపై వివాదం రేగింది.
దేశాన్ని కులాలుగా విభజిస్తున్నారు.
బీజేపీ నేత సురేష్ నఖువా మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ సాయుధ దళాల్లో కులం కోసం వెతుకుతున్నారు. ఇది కేవలం రాజకీయ అజ్ఞానం కాదు.. దేశ భద్రతా వ్యవస్థలపై అవమానకరమైన వ్యాఖ్య. ప్రధాని మోదీపై ద్వేషంలో ఆయన దేశాన్నే దూషిస్తున్నారు.’ అన్నారు. బీజేపీ వర్గాలు ఈ వ్యాఖ్యను జాతీయ ఏకతను దెబ్బతీసే ప్రయత్నంగా విమర్శిస్తున్నాయి.
ఇతర నాయకులు కూడా ‘సైన్యం మన దేశ గౌరవానికి చిహ్నం దానిని కులాల ఆధారంగా విభజించడం అనైతికం’ అని పేర్కొన్నారు.
సామాజిక అసమానతలపై రాజకీయ లెక్కలు
రాహుల్ గాంధీ మాటల వెనుక ఉద్దేశం.. బిహార్ రాజకీయ వాస్తవాలతో ముడిపడి ఉంది. అక్కడి ఓటర్లలో దళితులు, వెనుకబడిన వర్గాలే ఆధికం. కాబట్టి ఆయన ప్రసంగం ఆ వర్గాలకు నచ్చేలా సమానత్వం.. హక్కుల పంపిణీపై కేంద్రీకృతమైంది. కానీ సైన్యం వంటి సున్నితమైన అంశాన్ని ఉదాహరణగా తీసుకోవడం ఆ భావనను బలపరచకముందే వివాదంగా మార్చేసింది.
వ్యాఖ్యల్లో హద్దులు అవసరం
సమాజంలో అసమానతలపై చర్చ అవసరం.. కానీ ఆ చర్చ దేశ భద్రతా సంస్థల గౌరవాన్ని తాకకూడదు. సైన్యంలో ఎవరు ఏ కులానికి చెందిన వారన్నది కాదు.. వారు దేశానికి ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు అన్నదే ముఖ్యం. రాజకీయ వేదికపై సమానత్వం కోసం పోరాడే నాయకుడు.. తన మాటల్లో సమన్వయం కూడా చూపించాలి. రాహుల్ గాంధీ ఉద్దేశం నిస్వార్థమై ఉండొచ్చు. కానీ మాటల రూపం ప్రజల్లో విభజన భావన కలిగించేలా మారింది. దేశానికి సమానత్వం కావాలి.. కానీ అది విభజనలతో కాదు. సమన్వయంతో రావాలి. ప్రజా నాయకులు తమ మాటలతో వర్గాలను కాదు.. విలువలను కలపాలి.
