ఈ-20 వర్సెస్ 420 : రాహుల్ కొత్త వివాదం!
ఈ-20 పెట్రోల్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. పెట్రోల్‌లో 20 శాతం ఉండాల్సిన ఇథనాల్ వాటా కొన్ని నమూనాల్లో 32.01 శాతంగా ఉందని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఐఓసీ, బీపీసీఎల్ వంటి చమురు కంపెనీలు ఖండించాయి. నిబంధనల ప్రకారమే ఇథనాల్ కలుపుతున్నామని స్పష్టం చేశాయి. ఈ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని రాహుల్ ప్రకటించారు.
By: Garuda Media | 8 Nov 2026 6:00 PM ISTకాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తాజాగా కొత్త వివాదానికి తెరదీశారు. నిన్నటి వరకు ఓట్ చోరీ.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా అంటూ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన రాహుల్.. తాజాగా ఈ-20.. 420 నినాదంతో కొత్త వివాదాన్ని తెరమీదికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పేరుతో ప్రజల రక్తాన్ని జుర్రుకుంటోందని ఆయన వ్యాఖ్యా నించారు. అంతేకాదు.. ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా నిరసన రూపంలో ప్రభుత్వానికి తెలియజేస్తామని కూడాప్రకటించడం గమనార్హం.
ఏం జరిగింది?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలుపుతున్నారు. ఇది వచ్చే 2030 నాటికి 30 శాతం వరకు ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అయితే..విపక్షాల ఆందోళనలు.. ఆటో మొబైల్ రంగ దిగ్గజాల అభ్యర్థనలతో ప్రస్తుతం 20 శాతం ఇథనాల్‌కు మాత్రమే కేంద్రం కట్టుబడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ - 20 పెట్రోల్‌నే విక్రయిస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనూ ఈ విషయాన్ని రికార్డుల్లో స్పష్టం చేస్తున్నారు. ఇక, వాహన తయారీ దారులు కూడా 2018 నుంచి ఈ-బ్లెండెడ్ పెట్రోల్ తో నడిచే వాహనాలనే తయారు చేస్తున్నాయి. అయితే.. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. వాహనాల జీవిత కాలం తగ్గుతుందని.. ఇంజన్లు త్వరగా పాడైపోతాయని కూడా అభ్యంతరాలు వస్తున్నాయి. కానీ, వీటిని కేంద్రం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతోంది.
తాజాగా..
తాజాగా ఈ విషయంపై రాహుల్ గాంధీ స్పందించారు. ఈ-20 పెట్రోల్‌లో ఇథనాల్ శాతం 20 ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం 32.01 శాతం మేరకు ఉందని ఆయన ఆరోపించారు. కర్ణాటకలోని బెంగళూరు, మైసూరు సహా పలు ప్రాంతాల్లోని పెట్రోల్‌ను సేకరించి జరిపిన పరీక్షల్లో ప్రమాదకర స్థాయిలో పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపారని.. ఇది ప్రజలను దోచుకోవడమేనని ఆయన ఆరోపించారు. ''ఈ -20 మాటున 420 పనులు చేస్తున్నారు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్నీ ఆలోచించి.. అనేక పరీక్షలు చేయించిన తర్వాతే ఈ మాట చెబుతున్నాన ని రాహుల్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఆయా రిపోర్టులను కూడా వెల్లడించారు. వీటి ప్రకారంలీటరు పెట్రోల్‌లో 32 శాతం ఇథనాల్ ఉందని లేబొరేటరీలు స్పష్టం చేశాయి.
చమురు కంపెనీల స్పందన..
అయితే.. రాహుల్ వ్యాఖ్యలను చమురు కంపెనీలు ఖండించాయి. రాహుల్ రాజకీయంగా ఏమైనా మాట్లాడొచ్చని.. కానీ, నిజాలను, ప్రయోగ శాలల పరీక్షలను మాత్రం తప్పుదోవ పట్టించలేరని ఐవోసీ, బీపీసీఎల్ వంటి దిగ్గజ కంపెనీలు ప్రకటించాయి. నిబంధనల మేరకే తాము పెట్రోల్‌లొ ఇథనాల్‌ను కలుపుతున్నట్టు పేర్కొన్నాయి. ఇక, బీజేపీ కూడా రాహుల్ వ్యాఖ్యలను ఖండించింది. ఇది పసలేని విమర్శగా బీజేపీ అధికార ప్రతినిధి కొట్టిపారేశారు. కానీ, రాహుల్ మాత్రం ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తామని.. నిరసన తెలుపుతామని అంటున్నారు
