పట్టు దొరికిందా...రాహుల్ జోరు...హుషార్
పప్పు అన్న ట్రోలింగ్ నుంచి నిప్పు మాదిరిగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇపుడు తయారయ్యారు అన్నది ఒక ఘాటు విశ్లేషణ.
By: Satya P | 10 Aug 2026 1:33 PM ISTపప్పు అన్న ట్రోలింగ్ నుంచి నిప్పు మాదిరిగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఇపుడు తయారయ్యారు అన్నది ఒక ఘాటు విశ్లేషణ. రాహుల్ గాంధీ 2014 నాటికి అయితే పప్పు అంటూ బీజేపీ నేతలు ట్రోల్స్ చేసేవారు. ఆయనను గాంధీల వారసుడిగా మాత్రమే చూపించేవారు. నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం లేవని కూడా విమర్శించేవారు. అయితే 2019 నాటికి కొంత రాటు దేలిన రాహుల్ గాంధీ 2024 కి బాగానే సర్దుకున్నారు. ఇపుడు చూస్తే మోడీ మూడవ టెర్మ్ లో రెండేళ్ళ పాలన ముగిసిన తరువాత విపక్షానికి పట్టు దొరికింది అని అంటున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ చాన్స్ ని అసలు మిస్ చేసుకోకూడదని భావిస్తున్నారు. అందుకే ఆయన మోడీ సర్కార్ మీద దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. జెన్ జీతోనే జవాబు చెప్పాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయాగలో రాహుల్ గాంధీ పర్యటన ఆసక్తికరంగా సాగింది. ఆయన బీహార్ యూపీల నుంచి వచ్చిన జెన్ జీ యువతను ఉద్దేశిస్తూ చేసిన స్పీచ్ మోడీ సర్కార్ కి గట్టిగానే తగిలింది అని అంటున్నారు.
చక్రబంధంలో యువత అంటూ :
యువ శక్తిని రాహుల్ గాంధీ బలమైన వనరుగా పేర్కొంటున్నారు. అంతే కాదు వారిని సరిగ్గా వినియోగించుకోకుండా చక్రబంధంలోకి మోడీ ప్రభుత్వం ఇరికించింది అని ఆయన నిప్పులు చెరిగారు. ప్రయాగ్‌రాజ్‌లోని కేపీ గ్రౌండ్‌లో జరిగిన ఛాత్రోం కీ గూంజ్ అనే వినూత్న కార్యక్రమంలో రాహుల్ గాంధీ గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ ప్రభుత్వం మీద విమర్శలు సంధించారు. దేశంలోని జెన్ జీ యువతను నిరుద్యోగ అభ్యర్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగం కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కు పెట్టేలా చేసింది. దేశంలో అడుగడుగునా పేపర్ లీక్‌లు, తగ్గుతున్న ఉపాధి అవకాశాలు, నిరుద్యోగంపై ఆయన లేవనెత్తిన అంశాలు రాజకీయంగా ఇపుడు అతి పెద్ద హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రోజున దేశంలో చదువుకున్నా ఉద్యోగాలు రావడం లేదని ఆ మాటకు వస్తే డిగ్రీ సర్టిఫికెట్లకు విలువ లేకుండా పోయిందని రాహుల్ ఆరోపించారు. ఇక దేశంలోని 40 కోట్ల మంది యువతను ఖరీదైన విద్య, పేపర్ లీక్‌లు, తగ్గిన ఉపాధి అవకాశాలనే చక్రవ్యూహంలో ఇరికించారని రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. రాహుల్ సభకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరు కావడమే కాకుండా ఆయనతో తమ సమస్యలను పంచుకోవడం విశేషం.
మోడీ ఇమేజ్ డ్యామేజ్ :
ఇక ఇదే ఊపుతో రాహుల్ గాంధీ ఒక జాతీయ పత్రికలో రాసిన వ్యాసంలో మోడీతో పాటు అమిత్ షా మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోడీ ఇమేజ్ డ్యామేజ్ అయింది అని ఆయన అన్నారు. దిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్ధుల మీద లాఠీఛార్జ్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఒక జాతీయ వార్తాపత్రికకు రాసిన వ్యాసంలో ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ నాశనమైందని ఆరోపించారు. దానిని తిరిగి పునర్నిర్మించలేరని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మరే ఇతర అధికారులు గానీ వారి చర్యల పర్యవసానాల నుంచి తప్పించుకోలేరని అన్నారు.
యువత ఎప్పటికీ వదిలిపెట్టదని :
ప్రత్యేకించి మోడీ ప్రతిష్ట గురించే ఈ వ్యాసంలో రాహుల్ రాసిన అనేక అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మోడీ రాజకీయ ఇమేజ్ అన్నది పూర్తిగా దెబ్బ తిందని ఇక దానిని తిరిగి నిర్మించడం అన్నది కష్టతరమైన విషయం అని ఆయన అంటున్నారు. అంతే కాదు విద్యార్థుల ఆగ్రహం నుంచి మోడీ అమిత్ షాలు తప్పించుకోలేరని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. విద్యార్ధులను యువతను అణచివేఅయాలని చూశారంటూ మోడీ సర్కార్ మీద తీవ్ర విమర్శలే చేశారు. ఈ క్రమంలో విద్యార్ధులని ఇబ్బంది పెట్టిన వారిని ఈ దేశ యువత ఎప్పటికీ వదిలిపెట్టదని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పడం ద్వారా బీజేపీకి జెన్ జీ నుంచి ముంచుకొస్తున్న పెను ముప్పుని గుర్తు చేశారు. రానున్న రోజులలో దేశంలో 40 కోట్ల మంది ఉన్న యువత మద్దతు బీజేపీకి ఏ మాత్రం దక్కదన్న ధీమాతో రాహుల్ విమర్శలు ఉన్నాయి. మొత్తానికి బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతోందని అది మళ్ళీ పెరిగే సూచనలు లేవని రాహుల్ గ్రహించి తనదైన విశ్లేషణలతో దూకుడు చేస్తున్నారు అని అంటున్నారు.
