Begin typing your search above and press return to search.

భారత్ 50%, పాక్19%... ట్రంప్ మనసుపై ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు!

భారత్ ఎగుమతులపై అమెరికా 50% భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   10 Dec 2025 9:20 AM IST
భారత్ 50%, పాక్19%... ట్రంప్ మనసుపై ఆర్బీఐ మాజీ గవర్నర్  కీలక వ్యాఖ్యలు!
X

భారత్ ఎగుమతులపై అమెరికా 50% భారీ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. అయితే.. దీనికి కారణం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడమే అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా చెబుతున్నారు. ఈ కారణంగా రష్యాకు బాగా ఆదాయం వస్తుందని.. అది ఉక్రెయిన్ తో యుద్ధానికి మద్దతు ఇస్తుందని చెప్పుకొస్తున్నారు. అయితే అది అసలు కారణం కాదంటూ ఆర్బీఐ మాజీ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... ఇటీవల జ్యూరిచ్ యూనివర్శిటీలోని యూబీఎస్ సెంటర్ ఫర్ ఎకనామిక్స్ ఇన్ సొసైటీలో మాట్లాడిన ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.. భారత్ పై అమెరికా భారీ సుంకాలకు అసలు కారణం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం కానే కాదని అన్నారు. ఈ సందర్భంగా... హంగేరీలో విక్టర్ ఓర్బన్ రష్యా నుంచి చమురు కొనుగోలుపై ట్రంప్ మినహాయింపు ఇవ్వటాన్ని అందుకు ఉదాహరణగా చెప్పారు.

వాస్తవంగా ట్రంప్ నిర్ణయానికి అసలు కారణం.. పాకిస్థాన్, భారత్ మధ్య మే నెలలో జరిగిన నాలుగు రోజుల మినీ యుద్ధంలో కాల్పుల విరమణకు తానే దోహదపడ్డానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనకు, తీసుకున్న క్రెడిట్ కు వ్యతిరేకంగా భారత్ వ్యాఖ్యానించడమే అని అన్నారు! ఈ పరిస్థితికి వైట్ హౌస్ లోని వ్యక్తిత్వమే కారణం అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పాకిస్థాన్ సరైన మార్గంలోనే ఆడిందని వెల్లడించారు.

జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాదులు 26 మంది పౌరులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో... పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది భారత్. ఫలితంగా నాలుగు రోజుల పాటు ఇరుదేశాల మధ్య సరిహద్దు ఘర్షణలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ సమయంలో పై చేయి సాధించిన భారత్.. నేరుగా ఇస్లామాబాద్ సైనిక, అణు సౌకర్యాలపైనే దాడి చేసింది.

దీంతో... పాకిస్థాన్ ప్రభుత్వం మధ్యవర్తిత్వం కోసం అమెరికా దగ్గరకు పరుగెత్తుకు వెళ్లింది! ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో... కాల్పుల విరమణకు ట్రంప్ ను ప్రశంసించిన పాకిస్థాన్.. అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. ఆయన ఈ ప్రపంచ శాంతి దూత అన్న రేంజ్ లో లేపింది! మరోవైపు భారత్ మాత్రం.. న్యూఢిల్లీకి రావల్పిండి రెండుసార్లు ఫోన్ చేసి, సీజ్ ఫైర్ కోరడంతో ఒప్పందం కుదిరిందని పేర్కొంది.

సరిగ్గా ఇక్కడే ట్రంప్ మనసును పాకిస్థాన్ గెలుచుకోగా.. భారత్ వ్యాఖ్యలు ఆయన ఈగోను హర్ట్ చేశాయని అంటున్నారు 2013 - 2016 మధ్య ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన రఘురామ్ రాజన్! ఈ క్రమంలో ఫైనల్ ప్రభావం ఏమిటంటే.. భారతదేశం 50% సుంకాలను పొందితే.. పాకిస్థాన్ 19% మాత్రమే పొందింది అని అన్నారు. అయితే... అమెరికా - భారత్ మధ్య ఏమి జరిగిందో మాత్రం తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు!