Begin typing your search above and press return to search.

రఘురామకు గట్టి దెబ్బ.. 'ఆటవిడుపు'లో ప్రమాదాలు

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు.. క్రికెట్ ఆడుతూ రనౌట్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రన్ చేస్తూ అదుపుతప్పి కింద పడిపోయారు.

By:  Tupaki Political Desk   |   26 Feb 2026 5:32 PM IST
రఘురామకు గట్టి దెబ్బ.. ఆటవిడుపులో ప్రమాదాలు
X

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతోపాటు బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారథి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా గాయపడ్డారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహిస్తున్న లెజిస్లేచర్స్ గేమ్స్ లో ప్రమాదవశాత్తూ ఈ ముగ్గురు గాయాల బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం పోటీలు ప్రారంభం అవగా, తొలి రెండు రోజులపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు చాలా హుషారుగా గడిపారు. ముఖ్యంగా తొలిరోజు దాదాపు అన్ని క్రీడాపోటీల్లో పాల్గొని రఘురామ సందడి చేశారు. అయితే రెండో రోజు నిర్వహించిన క్రికెట్ పోటీలో రఘురామ ప్రమాదవశాత్తూ జారిపడటంతో మోచేయికి గాయమైంది.

ఎంతో ఆహ్లాదంగా సాగుతున్న శాసనసభ్యులు, ఎమ్మెల్సీల క్రీడాపోటీల్లో రెండో రోజు ముగ్గురు నేతలు గాయపడటంపై విచారం వ్యక్తమవుతోంది. గత ఏడాది ప్రారంభమైన ఈ పోటీలలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చురుగ్గా పాల్గొంటున్నారు. మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు సైతం బిజీ లైఫ్ ను కాసేపు పక్కన పెట్టి క్రీడోత్సాహంతో సందడిగా గడిపేందుకు ముందుకు వస్తున్నారు. ఏడు పదుల వయసు దాడి ఎనభయ్యో వడికి దగ్గరగా ఉన్న సీనియర్ నేతలు నంధ్యాల వరదరాజులురెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొమ్మినేని శ్రీనివాస్, గద్దె రామ్మోహన్ రావు, రఘురామరాజు వంటి వారు సైతం క్రీడాపోటీల్లో తలపడి తమ సత్తా చాటుతున్నారు.

అయితే తొలి రోజు పోటీలు ఎలాంటి ఇబ్బంది లేకుండగా సాగిపోగా, రెండో రోజు మాత్రం ముగ్గురు నేతలు గాయపడటం విచారానికి గురిచేసింది. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు.. క్రికెట్ ఆడుతూ రనౌట్‌ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రన్ చేస్తూ అదుపుతప్పి కింద పడిపోయారు. శరీర భారమంతా ఎడమ భుజంపై పడటంతో ఆయన చేతి మణికట్టు వద్ద గాయాలయ్యాయి. దీంతో వెంటనే సహాయ సిబ్బంది మణిపాల్‌ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. అదేవిధంగా భుజం, చేతి బొటన వేలికి కూడా గాయమైందన చెబుతున్నారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయన హైదరాబాద్‌ వెళ్లారు.

ఇక కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే పార్థసారథి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ గాయపడ్డారు. పార్థసారథికి పాదం భాగంలో, శ్రీకాంత్‌కు భుజం వద్ద కాలర్‌ బోన్‌ ఫ్రాక్చర్‌ అయ్యాయి. ఎమ్మెల్సీ శ్రీకాంత్ భుజానికి కట్టు వేశారు. ఆ కట్టుతోనే ఆయన శాసనమండలి సమావేశాలకు హాజరవుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా చాలా ప్రొఫెషనల్‌గా ఆడుతూ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేతలు అంతా తమ హోదాలను పక్కన పెట్టి ఆటల పోటీలలో సరదాగా గడుపుతున్నారు. ప్రధానంగా రఘురామరాజు ప్రతి ఆటలోనూ యాక్టివ్ పార్టిసిపెంట్ గా సందడి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. దురదృష్టవశాత్తూ ఆయన గాయపడటంపై సహచరులు అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.