Begin typing your search above and press return to search.

రఘురామ ఉండలేకపోతున్నారా..కొత్త ఆలోచనలు దేనికి ?

ఆయన మళ్ళీ ఢిల్లీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఆ దిశగా ఆయన ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. నరసాపురం నుంచి ఆయన 2029 ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ కావాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

By:  Satya P   |   25 Nov 2025 8:00 AM IST
రఘురామ ఉండలేకపోతున్నారా..కొత్త ఆలోచనలు దేనికి ?
X

ఉప సభాపతిగా మంచి పొజిషనే కూటమి ప్రభుత్వం రఘురామకు ఇచ్చింది. ఆయన కేబినెట్ ర్యాంక్ తో కొనసాగుతున్నారు. నిజానికి రఘురామ ఉండి అసెంబ్లీ సీటు నుంచి చివరి నిముషంలో పోటీకి దిగారు. అయితే ఆయన అసెంబ్లీకి అనగానే మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. ఆయన అనుచరులు అయితే అదే నిజం అని ఎంతో ఉత్సాహపడ్డారు. కానీ జరిగింది వేరుగా ఉంది. రఘురామకు తొలి ఏడాది అయితే పెద్దగా ఏమీ కలసిరలేదు. ఆ తరువాత ఆయనకు ఉప సభాపతి పదవి దక్కింది. అయితే ఆయనకు ఈ పదవిలో కొనసాగుతున్నా మనసు మాత్రం మంత్రి పదవి మీదనే ఉందని ప్రచరం సాగుతోంది. కానీ మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది చూస్తే అది ఆలోచించాల్సిన విషయమే. ఎన్నో లెక్కలు మరెన్నో సమీకరణలు చూడాల్సి ఉంటుంది.

కీలకంగా మారినా :

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉంటే అందులో రఘురామ ఒక కారణం అని అంటారు. జగన్ సర్కార్ మీద వ్యతిరేకతను ఆయన రగిల్చారు. దానిని టీడీపీ కూటమి సొమ్ము చేసుకోగలిసింది. ఇక ఇంత చేసిన తనకు మంత్రి పదవి దక్కలేదని బాధ అయితే సహజంగా ఆయనలో ఉంటుంది. ఇక ఏణ్ణర్థం కూటమి పాలన ముగిసింది. మరో మూడున్నరెళ్ళు ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మినిస్టర్ పొస్టు అన్నది దక్కడం కష్టమే. ఈ అంచనాకు దాదాపుగా వచ్చిన రఘురామ 2029 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ఆలోచన చేస్తున్నారు అని అంటున్నారు.

మరోసారి ఎంపీగా :

ఆయన మళ్ళీ ఢిల్లీ వైపు చూస్తున్నారు అని అంటున్నారు. ఆ దిశగా ఆయన ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. నరసాపురం నుంచి ఆయన 2029 ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ కావాలని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఎంపీ అయితే ఢిల్లీ స్థాయిలో తన పలుకుబడి హవా బాగుంటాయని తనకు అక్కడే సరిగ్గా సరిపోతుందని ఆయన భావిస్తున్నారు అని చెబుతున్నారు. అయితే నరసాపురం నుంచి కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఉన్నారు. ఆయనకే మరోసారి టికెట్ ని బీజేపీ కోరవచ్చు అని అంటున్నారు. ఎందుకంటే బీజేపీ వచ్చే ఎన్నికల నాటికి తన బలాన్ని మరింత పెంచుకోవాలని చూస్తుంది అని అంటున్నారు దాంతో గెలిచిన సీట్లతో పాటు కొత్త సీట్లు కోరుతుంది తప్ప ఉన్న వాటికి త్యాగం చేయదని అంటున్నారు. అయితే టీడీపీ అధినాయకత్వం కనుక తలచుకుంటే బీజేపీకి వేరే చోట అడ్జస్ట్ చేసి తనకు సీటు దక్కేలా చూడవచ్చు అన్నది రఘురామ ఆలోచనగా చెబుతున్నారు. పైగా బీజేపీ పెద్దలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి సాధ్యం కావచ్చు అన్నది కూడా ఆలోచనగా ఉందిట.

ఉండిలో వేరే రాజకీయం :

ఇక రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉండి అసెంబ్లీ సీటులో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఇప్పటికే త్యాగం చేసిన మంతెన రామరాజు కచ్చితంగా బరిలో ఉంటారని అంటున్నారు. మరో వైపు ఈ సీటు మీద జనసేన కూడా కన్నేసిందని అంటున్నారు. ఆ పార్టీ నుంచి కూడా గట్టి నాయకులు ఉన్నారు. దాంతో రఘురామ ఈసారి ఎంపీకే పోటీ అని భావిస్తున్నారు. దాంతో ఇప్పటి నుంచే ఆయన క్షేత్ర స్థాయిలో తాకంటూ అంతా రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారం ఏ మేరకు వాస్తవ రూపం దాలుస్తుందో.