డిప్యూటీ స్పీకర్ గా ఉండి ఈ మాటలేంది రఘురామ?
అలాంటి మొహమాటాలు.. మర్యాదల్ని ఎప్పుడో మానేసిన తెలుగు ప్రాంతాల నేతలు.. ఎవరికి వారు తమకు తోచినట్లుగా రాజకీయాల్ని.. వాటికుండే విలువల్ని అంతకంతకూ తగ్గించే ప్రయత్నమే చేస్తున్నారని చెప్పాలి.
By: Garuda Media | 27 Dec 2025 11:15 AM ISTతెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల స్వరూపం ఎంతలా మారిందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా ఏ స్థాయికి ఆ స్థాయి నేతల మధ్య రాజకీయ ప్రత్యర్థితనం పోయి శత్రుత్వం వచ్చేసింది. దీంతో.. రాజకీయాల్లో రచ్చ మరింత పెరిగింది. గతంలో కొన్ని పదవుల్లో ఉండే వారు.. రాజకీయంగా మాట్లాడాల్సి వస్తే ససేమిరా అనేవారు. తాను చేపట్టిన పదవికి మరక అంటకుండా.. దాని హుందాతనం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకునే వారు. అలాంటి మొహమాటాలు.. మర్యాదల్ని ఎప్పుడో మానేసిన తెలుగు ప్రాంతాల నేతలు.. ఎవరికి వారు తమకు తోచినట్లుగా రాజకీయాల్ని.. వాటికుండే విలువల్ని అంతకంతకూ తగ్గించే ప్రయత్నమే చేస్తున్నారని చెప్పాలి.
హుందాతనం గురించి..విలువల గురించి.. మర్యాదల గురించి.. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ ఉప సభాపతి చెప్పే సూక్తులు అన్ని ఇన్ని కావు. అలాంటి ఆయన తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప సభాపతి అన్న విషయాన్ని వదిలేసి.. రాజకీయాల గురించి.. విపక్ష నేత గురించి మాట్లాడటం కనిపిస్తుంది. పదవులకు వన్నె తేకున్నా ఫర్లేదు. మరింతగా దిగజార్చాల్సిన అవసరం లేదు కదా? నిజమే.. వ్యక్తిగతంగా ఆయనకు గతంలో ఎదురైన పరిస్థితులు అత్యంత కఠినమైనవే.. సహించలేనివే.
అయినప్పటికి ఒకరు తప్పు చేశారు కదా? అని ఆయన కూడా తప్పు చేయకూడదు కదా? అలాంటప్పుడు ఇద్దరి మధ్య తేడా ఉండదు కదా? ఒకరు చెడ్డోళ్లు అంటే.. ఆ మాట అనే వ్యక్తి మంచోడిగా ఉండాలి కదా? తన ప్రత్యర్థిని చెడ్డోడు.. అతడి చెడ్డతనం ఎంత ఎక్కువ అంటే అనే మాటలు చెబుతూ.. తాను కూడా విలువలకు.. పద్దతుల్ని పక్కన పెట్టేస్తే ఏం బాగుంటుంది? రఘురామ రాజు ఇప్పుడు అలాంటి పనే చేస్తున్నారు.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమిరంలోని తన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ నేతగా ఆయన ఏమైనా మాట్లాడొచ్చు.కానీ.. ఉప సభాపతి హోదాలో మాట్లాడటం సమంజసంగా ఉండదు. ఇంతకూ ఆయన ఏమన్నారంటే.. జగన్ తీరులో మార్పు వస్తే ప్రతిపక్ష హోదా వస్తుందని తాను భావించినట్లు చెప్పారు. తాజా పరిస్థితుల్ని చూస్తే.. ఈసారి ఆయనకు ప్రతిపక్ష నేత హోదా రావటం కష్టమేనని పేర్కొన్నారు.
2020 నుంచి తనపై జగన్ బురద జల్లుతూనే ఉన్నారని.. ఆయనపై పోరాటం ఎవరినీ అడిగి మొదలుపెట్టలేదన్నారు. ఒంటరి పోరు చేశానని.. చంపాలని చూసినా పోరాడిన వైనాన్ని గుర్తు చేశారు. తనపై మూడు కేసులు ఉన్న కారణాన్ని చూపి ఉపసభాపతి హోదా నుంచి తొలగించాలని తన ప్రత్యర్థులు కోరుతున్నారని.. మరి జగన్ మీద 11 కేసులు ఉన్నాయని.. ఆయన గతంలో సీఎంగా ఎలా పని చేశారు? అని ప్రశ్నించారు.
విద్యుత్తు ప్లాంటు విషయంలో తనను చాలా ఇబ్బందులకు గురి చేశారని.. ఆర్థికంగా ఎంతో నష్టపోయినట్లు చెప్పారు. తాను బంగారు స్పూనుతోనే పుట్టినట్లు చెప్పిన రఘురామ.. ‘‘నా జీవన శైలిలో మార్పు లేదు. ఒకప్పుడు పంది మాంసాలు అమ్ముకోలేదు. రాజకీయాల్లో కన్నాలేసి సంపాదించుకోలేదు. ఇది ఎవరికి చెబుతున్నానో వారికి అర్థమవుతుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో వైసీపీ వాళ్లు రప్పరప్పా అంటూ చేస్తున్న చేష్టలతో మరోసారి జగన్ కు ప్రతిపక్ష హోదా రావటం కూడా కష్టమేనని పేర్కొన్నారు. ఇలాంటి మాటలన్ని ఉప సభాపతి పదవిలో ఉన్నప్పుడు కాకుండా ఉంటే బాగుండేదని చెప్పాలి.
