Begin typing your search above and press return to search.

దళిత క్రైస్తవులపై రఘురామ హాట్ కామెంట్స్.. తగ్గేదేలే అంటున్న డిప్యూటీ స్పీకర్

దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని, వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన క్షణం నుంచి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ హక్కును కోల్పోతారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి స్పష్టం చేశారు.

By:  Tupaki Political Desk   |   11 May 2026 10:00 PM IST
దళిత క్రైస్తవులపై రఘురామ హాట్ కామెంట్స్.. తగ్గేదేలే అంటున్న డిప్యూటీ స్పీకర్
X

దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని, వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన క్షణం నుంచి రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ హక్కును కోల్పోతారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి స్పష్టం చేశారు. గత కొంతకాలంగా ఈ అంశంపై వ్యాఖ్యలు చేస్తూ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న రఘురామ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎస్పీ రిజర్వుడు స్థానాల్లో దళిత క్రైస్తవులు పోటీ చేయలేరని, ఒకవేళ ఎవరైనా పోటీ చేయాలని భావిస్తే వారు హిందు మతాన్ని ఆచరిస్తున్నట్లు నిరూపించుకోవాల్సివుంటుందని డిప్యూటీ స్పీకర్ తేల్చిచెప్పారు.

దళిత క్రైస్తవులపై రఘురామ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సోమవారం ఉండి నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. అనధికార ప్రార్థనా మందిరాలు, వాటి నుంచి వెలువడుతున్న ధ్వని కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అనుమతిలేని ప్రార్థనా మందిరాలను మూసివేసినట్లు ప్రకటించారు. దీనిపై ఎవరైనా పోరాటం చేయాలని అనుకుంటే చేయొచ్చని సవాల్ విసిరారు. బలహీనవర్గాల కింద ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తే, వాటిలో చర్చ్ లు నడుపుతున్నారని రఘురామ తెలిపారు. అలాంటి వాటిని ప్రభుత్వం మూసివేయించినట్లు వెల్లడించారు.

హిందు దళితుల కోసమే రిజర్వేషన్లు

ఇక ఎస్సీ రిజర్వేషన్లపైన రఘురామ ఆసక్తికర ప్రకటన చేశారు. హిందు దళితుల కోసమే రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, అలాంటి వారికి దక్కాల్సిన రిజర్వేషన్లను రెగ్యులర్ గా చర్చ్ లకు వెళ్లే క్రిస్టియన్లు వాడుకోవడానికి అనర్హులని రఘురామ వ్యాఖ్యానించారు. దళిత క్రిస్టియన్లు ఎస్సీ రిజర్వేషన్లు పొందడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అలాంటి వారు ఎన్నికల్లో పోటీ చేస్తామంటే అంగీకరించమని తేల్చిచెప్పారు. ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ పార్టీ తరపున అయినా దళిత క్రైస్తవులు రిజర్వేషన్లు అనుభవిస్తామంటే అంగీకరించమని స్పష్టం చేశారు.

ఎవరైనా దళిత క్రైస్తవులు రిజర్వుడు సీట్లలో పోటీ చేస్తారని అనుమానం ఉంటే ముందుగానే ఎస్సీ సర్టిఫికెట్లు తీసుకోవాలని, ఇందుకోసం తల్లిదండ్రుల సమాధి వివరాలతోపాటు చర్చ్ కి వెళ్లే ట్రాక్ రికార్డును పరిశీలించి తహశీల్దార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించారు. పరిశుద్ధ వివాహం చేసుకున్న వారు సైతం దళిత రిజర్వేషన్లను కోల్పోతారని రఘురామ స్పష్టం చేశారు.