టెక్నికల్ గా వైసీపీ ఎమ్మెల్సీ...టీడీపీలో నో ఎంట్రీ !
పాపం ఆయన రాజకీయ బాధలు పగవారికి కూడా వద్దు అనిపిస్తోందిట. మనసు టీడీపీలో ఉంది.
By: Satya P | 3 Jan 2026 9:21 AM ISTపాపం ఆయన రాజకీయ బాధలు పగవారికి కూడా వద్దు అనిపిస్తోందిట. మనసు టీడీపీలో ఉంది. టెక్నికల్ గా వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. పసుపు కండువా కప్పుకోవాలని ఆయనకు తెగ ఉబలాటం ఉంది కానీ హైకమాండ్ ఒక కండిషన్ పెట్టిందట. లోకల్ లీడర్స్ ఓకే చెబితేనే అని. దాంతో స్థానికంగా ఎదురు గాలి వీయడంతో ఆయన అధికార పార్టీలో చేరాలని ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. చిత్రమేంటి అంటే ఆయన సతీమణి మండల వైఎస్ ప్రెసిడెంట్ గా ఉన్న ఆమెను ముందే టీడీపీలో చేర్చారు. ఆయన మాత్రం వైసీపీ ఎమ్మెల్సీ పదవి ఉండడంతో కూటమిలో చేరి పదవి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారుట.
వైసీపీలో చేరి :
వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఎస్ కోట నియోజకవర్గానికి చెందిన కీలక నెత ఇందుకూరి రఘురాజు 2018లో వైసీపీలో చేరారు. తనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆయన భావించారు. కానీ అనూహ్యంగా ఆ సీటు కాస్తా కడుబండి శ్రీనివాసరావుకు ఇవ్వడం జరిగింది. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళూ ఇందుకూరి రఘురాజుకు వైసీపీ ఎమ్మెల్యేకు మధ్య వివాదాలే నడచాయి. అయితే 2024 ఎన్నికల్లో తనకు టికెట్ రాదని తేలిపోవడంతో ఆయన తన భార్యను టీడీపీలోకి పంపించారు. వైసీపీలో తాను ఉన్నా పట్టనట్లుగా వ్యవహరిస్తూ టీడీపీకే సహకరిస్తూ వస్తున్నారు.
వేటు పడకుండా :
ఇదిలా ఉంటే రఘురాజు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా నెగ్గారు. అయితే ఆయన టీడీపీతో ఉంటూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ ఆధారాలు సేకరించి చైర్మన్ కి ఫిర్యాదు చేసింది. దాంతో ఆయన మీద వేటు పడే ప్రమాదం ఉండడంతో కోర్టుకు వెళ్ళి టెంపరరీగా తన పదవిని కాపాడుకున్నారని చెబుతున్నారు. మరో మూడేళ్ళ పాటు ఆయన పదవీ కాలం ఉంది. దాంతో ఎలాగైనా తన మీద వేటు పడుతుందని ఆలోచనతో ఆయన టీడీపీలో చేరి పదవి నిలబెట్టుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. గత ఎన్నికల్లో కూడా టీడీపీకి సహకరించడంతో ఆయనను పార్టీలోకి తీసుకోవాలని ఆలోచిస్తున్నారుట.
నో అంటున్న లోకల్స్ :
అయితే ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి, అలాగే పార్టీలో కీలక నేత అయిన గొంప క్రిష్ణ ఇందుకూరి రఘురాజుని తీసుకోవడం అంటే కొత్త తలనొప్పులు వస్తాయని పార్టీలో వర్గ పోరు పెరుగుతుందని అధినాయకత్వానికి చెప్పారని అంటున్నారు. అయితే ఎస్ కోటలో జిందాల్ ఇష్యూని పెట్టుకుని రఘురాజు మరో వైపు కూటమిని ఇరకాటంలో పెడుతున్నారు. జిందాల్ కి భూములు ఇచ్చిన వారికి తిరిగి ఆ భూములు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తూ బాధితుల తరఫున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దాంతో ఆయనను పార్టీలో చేర్చుకుంటే జిందాల్ ఇష్యూ కి కూడా ఫుల్ స్టాప్ పడుతుందని పెద్దలు ఆలోచిస్తున్నారుట. దాంతో లోకల్ లీడర్స్ కి నచ్చ చెప్పి ఆయనకు తీసుకోవాలని చూస్తున్నారని అంటున్నారు.
పోటీ ఖాయం :
అయితే రఘురాజు ఎమ్మెల్యే సీటు కోరుకుంటారు అని అంటున్నారు. ఆయన వైసీపీలో కూడా ఎమ్మెల్యే టికెట్ నే ఆశించారు. కానీ దక్కలేదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు కోసం ఎన్నారై గొంప క్రిష్ణ కూడా వేచి చూస్తున్నారు. దాంతో ఆయన వైపు నుంచి అయితే నో ఎంట్రీ అని రాజుకు చూపిస్తున్నారుట. అయితే అధినాయకత్వం మాత్రం ఈ వైసీపీ ఎమ్మెల్సీ విషయంలో ఏమి చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది.
